శతకములు ఆంధ్రనాయక శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
సీ. వెనుక వేసుకొని యుర్వీనాథకోటులు- సైంథవుఁ గావంగఁ జాలినారె?
ధర నేయు తనసుతు శిర మెవ్వఁడతఁ డీల్గ- శాపించి సింధురా జోపినాఁడె?
సాటింతు నాసర్వసైన్యంబు లని కర్ణు- చేశక్తి నరు నేయఁ జెప్పినారె?
పరులచే నొవ్వని పంతంబు గలభీష్ము- డర్జునాస్త్రంబుల కాఁగినాఁడె?
 
తే. మనుజయత్నంబు బల మెంత మాత్ర మీవు-నిజము కరుణించు నాతఁడే విజయుఁ డరయ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
101
సీ. ఆగామి సంచిత ప్రారబ్ధము లటుండ- నిజజన్మమందు నే నెల్లవేళ
నఘములే చేసితి నని యుష్మత్సుధా- సదృశ నిర్హేతుక జాయమాను
కరుణాకటాక్ష వీక్షణ మెంచ కెప్పుడో- ప్రసరింపవలె నే నపారదురిత
వారధిఁ దరియింపవలెఁ గాని గతి యితః- పర మెఱుంగను భక్తపాలనాంక!
 
తే. శేషపర్యంక! రాజ్యలక్ష్మీ సహాంక-ప్రధననిశ్శంక! యదుకులాంబుధిశశాంక!
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
102
సీ. పూర్వకవీంద్రులు పుణ్యఫలం బేమి- సాక్షాత్కరించి యస్మత్పరంబు
గా గద్యపద్యముల్‌ గల్పించు మనిన వే- వర మొసంగితి వండ్రు వాంఛఁ జేసి
నేర్చి నట్లుగఁ గూర్చి నేఁటి కవిత్వంబు- నీకంకితముఁ జేసి నెనరు దోఁపఁ
జేదోయి యొగ్గిన శ్రీపాదరజ మింత- నామీఁదఁ బాఱ నీ వేమి సామి
 
తే. కృపకుఁ బాత్రముఁ జేయు మక్షీణభాగ్య-లక్షణాంచిత పాదపల్లవకరాబ్జ!
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
103
సీ. కావ్యదోషము లెఱుంగని మత్కవిత్వంబు- విద్వన్నుతంబుఁ గావించినావు
బహిరంత రింద్రియ పరిశుద్ధి లేని నా- తలఁపులోపల వచ్చి నిలచినావు
పుణ్యకర్మ మొకింత పూని సేయని నన్నుఁ- బెద్దలచేత మెప్పించినావు
పురుషప్రయత్నంబు గురు తెఱుంగని నన్ను- భుక్తి గల్గఁగ జేసి ప్రోచినావు
 
తే. పతితుఁ జేపట్టినావు చేపట్టినావె-యన్యగతిఁ బోవనీయకు మార్తరక్ష!
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
104
సీ. శబరి యెంగిలిపండ్లు చవిఁజూచు ననుకంప- కుబ్జ గంధము పూఁతఁ గొన్నకరుణ
పాంచాలి కోర సాపడిన దయారతి- గోపమ్మ యుగ్గుఁబాల్‌ గ్రోలుకృపను
మాలికుఁ డొసఁగు తోమాలెఁ దాల్చినప్రేమ- ద్విజుని కొం గటుకులు దిన్నకూర్మి
గుహుఁడు పాదములు బట్టుట కుల్బు నెనరును- నుడుతదాస్యమునకుఁ బొడము ప్రేమ
 
తే. శతక మంగీకరింపుము జగతి జనకుఁ-డర్భ కావ్యక్త భాషల నలరి నట్లు
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
105
సీ. శతక మొకటి 'మనసా హరిపాదము- లాశ్రయించవె' యని యల్లినాఁడఁ
గరిమ 'రామా! భక్త కల్పద్రుమా!' యని యొప్పగా శతకంబుఁ జెప్పినాఁడ
నలరులదండ మీ కనఁగ 'హంసలదీవి- గోపాల శతకంబుఁ' గూర్చినాఁడ
యుష్మ దంకితముగా నూహించ శకమ మీ- నంచితంబుగ రచియించినాఁడ
 
తే. భవదనుగ్రహ కవితచేఁ బ్రబలువాఁడ-నవని గాసుల పురుషోత్త మాఖ్యవాఁడ
చిత్రజిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హతవిమతజీవ శ్రీ కాకుళాంధ్ర దేవ!
106
AndhraBharati AMdhra bhArati - shatakamulu - AMdhranAyaka shatakamu ( telugu andhra )