శతకములు ఆంధ్రనాయక శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
సీ. పట్టి గొల్లది రోఁట గట్ట నోపిననీకుఁ- రోసంబు లే దన్న నీసు గలదె?
జారచోరాదిచేష్టలఁ బ్రవర్తిల్లు నీ- కపకీర్తి యన్న భయంబు గలదె?
భార్యచేఁ దన్నులుఁ బడ్డవానికి నీకు- లజ్జ లే దని యన్న లాఘవంబె?
కుండంటు లే దని కొసరి మెక్కిన నీకు- హీనత లెంచిన న్యూన మగునె?
 
తే. కోరి దాసులు ని న్నెంత దూరుచున్నఁ-బంత మున్నదె నీ కిసుమంత యైన?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
41
సీ. కడు దొంగతనమునఁ గని తల్లి వైచినఁ- దనబిడ్డనిగ బెంచె నిను యశోద
జనని గర్భము దించుకొనిన వేఱొకతల్లి- కడుపుఁ జేసికొనంగ గలిగెనన్న
తండ్రి వివాహయత్నము సేయ నొల్లక- తగులుక వచ్చె నీ ధర్మపత్ని
యన్న రారాజు కీనున్న నీసోదరి- యింటికి జోగిరా నంటుకొనియె
 
తే. నిట్టి నీ సంప్రదాయంబు గుట్టు బెట్టు-రట్టు సేయుదుఁ గనుము నా భట్టుతనము
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
42
సీ. పక్షంబు గల దండ్రు పాండుపుత్రులయందు- పాండవుల్‌ పడినట్టి పాటులేమి!
పూర్వజన్మమునందుఁ బూజించె గజ మండ్రు- గజరాజు పొందిన గాసి యేమి!
యల కుచేలునకు బాల్యస్నేహితుఁడ వండ్రు- నెఱిఁ గుచేలుఁడు పడ్డనెవ్వ లేమి!
ప్రహ్లాదుఁ డాజన్మభక్తియుక్తుం డండ్రు- ప్రహ్లాదుఁ డొందిన బాధ లేమి!
 
తే. యెంతయాలస్యమున వారి నేలినాఁడ-విట్టిదే నీ దయారసం బెంచి చూద
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
43
సీ. అనఘ మౌ విప్రసత్రాన్న మెంగిలిఁ జేసి- తీవె మున్‌ క్రతుభోక్త నేనే యనుచు
సవతికొమాళ్ళ సమయించి తందఱిఁ- దరుగని రాక్షసాంతకుఁడ ననుచు
బంధువు లన్యోన్య వైరానుహతులుగా- నడచితి భూభారహారి ననుచు
బలిమి నన్య స్త్రీలఁ బట్టితి వెందఱి- నస్ఖలద్బ్రహ్మచర్యమతి ననుచు
 
తే. లోకమున నడ్డ మెవ్వరు లేకయునికి-హద్దు లే కిట్లు నడచితి వళుకు మాలి
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
44
సీ. అది యోగ్యంతరం గాలానబంధంబు- వదలించుకొని నీకు వశము గాదొ!
వేదాంత సకృద చుంబితల మంత్రావర్ణ- నల గుహలుండి రా నలవి గాదొ!
నిమి షార్ధ నిమిషాది నిత్యవేళాచక్ర- గతి నిరోధించి రాఁ గ్రమము గాదొ!
వక్రకంటక పంకవత్క్రూరజనమనః- కాపథంబులను గా ల్మోపరాదొ!
 
తే. యేమి యాలస్య మిది నీకు నేల సకల-జంతుసంతాన రక్షావిచక్షణునకు
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
45
సీ. కఠిన స్తనంబుల ఘట్టించి దట్టించి- జడలచే మోది నున్దొడల నదిమి
పలుగంట్లు చేసి గోరుల నాటి దొమ్మిగా- యువతీసహస్రంబు లుపరతాది
బంధనంబుల నిన్నుఁ బైకొని తమి రేచి- రమియింప నిదురింప రాక నాఁటి
బడలిక దీర నాపఁగ రాని సుఖనిద్ర- బవళించియున్నట్టి భావ మిచటఁ
 
తే. దోఁచుచున్నది సంఫుల్లతోయజాక్ష!-మేల్‌ బళా! యింత జా గేమి మేలుకొనవె!
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
46
సీ. నీ బొడ్డుదమ్మి లోనికిఁ జొచ్చి చూచిన- నలువకు నీలోఁతు దెలియకున్నె?
బహుసహస్రాంగనా గృహముల నినుఁ గన్న- మునిరాజు నీమాయఁ గనకయున్నె?
నీ విశ్వరూప మెన్నికఁ జేసి పొడఁగన్న- నరుఁడు నీయురువు దా నెఱుఁగకున్నె?
తనమనఃపీఠి ని న్ననిశ మారాధించు- హరుఁడు భవత్తత్త్వం బరయకున్నె?
 
తే. గరువ మేటికి నీ మర్మ మెఱుఁగ రనుచుఁ-దెలిసినమహాత్ములకు నైనఁ దెలియకున్నె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
47
సీ. పురుషాకృతిగ నిన్ను గురుతుఁ బట్టఁగ రాదు- స్త్రీమూర్తి వనుచును జెప్ప రాదు
పరఁగ నపుంసకభావ మెన్నఁగ రాదు- రూపంబు గల్గు టెఱుంగ రాదు
గుణవంతుఁడ వ టంచు గణుతింపఁగా రాదు- మర్యాద దెలియ నేమతికి రాదు
కులజుఁడ వనుచు నిక్కువముఁ జెప్పఁగ రాదు- స్థల మెక్కడనొ కాని తెలియరాదు
 
తే. వస్తునిర్దేశ మొనరింప వశము గాని-నిన్ను వర్ణింపరా దయా నిశ్చితముగ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
48
సీ. నమ్ముదు రేరీతి నారదు నాత్మజు- మానిని జేసిన మాయవానిఁ?
దలఁతు రేరీతి నల్‌దలలదయము నోలి- బొడ్డుదమ్మినిఁ గన్న పురుషమణిని?
భూషింతు రేరీతి పుష్పబాణవిరోధి- విషయభ్రమితుఁ జేయు వేసగాని?
భాషింతు రేరీతి బ్రహ్మాదిమశకప- ర్యంతంబు గలిగిన వింతవాని?
 
తే. ని న్నెఱిఁ గెఱింగి యందఱు నన్నుతింతు-రెవ్వరికి నీవు కావలె నెంచి చూడ?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
49
సీ. ఎక్కడ నీకన్న దిక్కు లేనట్ల ని- న్నర్చింతు రబ్జగర్భాది సురలు
మఱి యెందు గతి లేనిమాడ్కి మహామును- ల్నీయందె లక్ష్యము ల్నిలుపు కొందు
రిలఁ దరణోపాయ మెందున లేనట్లు- సజ్జనుల్‌ నీకథల్‌ చదువుకొండ్రు
పగతుర మెయ్యెడ బ్రతికెద మన్నట్లు- దునిసిరి నీచేత దనుజు లెల్ల
 
తే. దత్త్వ మరసిన శుద్ధబుద్ధస్వరూప-మింత మధికార మెన్నటి దేమి చెపుమ
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
50
AndhraBharati AMdhra bhArati - shatakamulu - AMdhranAyaka shatakamu ( telugu andhra )