శతకములు ఆంధ్రనాయక శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
సీ. శౌర్య మెక్కించి విశ్వామిత్రుఁ డూరకఁ- దొడరింపఁ దాటకఁ దునిమినావు
వైదేహి వాక్యనిర్భంధంబుఁ ద్రోయలే- కఱిముఱి మారీచు నఱికినావు
వెనుకంజ వైచిన విడువక పైకి రా- నరుదుగా ఖరుతలఁ దరిగినావు
మొఱ్ఱో యనుచు దేవమునులు వా రెన్నాళ్ళో- యనుసరింప దశాస్యుఁ దునిమినావు
 
తే. కాని రోసంబు గలదె నిక్కముగ నీకు?-మనసు మెత్తనివాఁడ నే మనఁగ వచ్చు
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
71
సీ. కొంచెపుఁ బని దాసి నించుక దండింపఁ- బగబట్టి యది యెన్నిపాట్లు వెట్టె
బలిమినిఁ బట్టి శూర్పణఖ నాసికఁ గోయ- నది నీకుఁ బిదప నెం తలఁతఁ దెచ్చె
జిన్నతనంబునఁ జెనకి పోఁ దోలిన- మారీచుఁ డొనరించె మాయ లెన్ని
నిరపరాధుని వాలి నురుశరాహతిఁ గూల్ప- వానియిల్లా లెంత వగచి తిట్టె
 
తే. స్వామి వై యేమి యెఱుఁగవు స్వల్పకార్య-కారణంబున నెన్నెన్ని కతలు పుట్టె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
72
సీ. నీపేరు వినుటకే యోపక చెవిఁ గంట- గట్టుకున్నాతనిఁ గావ నేమి?
కలన నీతోఁ గత్తిఁ గట్టుక పోరాడు- వాని సోదరుని బ్రోవఁగ బ నేమి?
బాధింపఁ దగు మహాపాత కుండటుచేరి నీవాఁడ నంటె మన్నింప నేమి?
మాయవేసముల నీ మర్మ మారయుచున్న- విమత ధూతల బట్టి విడువ నేమి?
 
తే. పతిత శరణాగతావన ప్రకటదీక్ష-లోకముల కబ్బురంబుగ నీకె గలదొ?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
73
సీ. పఱపిన శస్త్రంబె బహుముఖంబుల దైత్య- వాహినీమర్మము ల్వ్రచ్చి వెడల
ముందు దూసిన బాణమునకన్న సరి మించి- వెనుకమ్ము దైత్యుల విఱుగఁ బొడువ
నేసినమార్గణం బెదు రెక్కి యితరాస్త్ర- మడఁచి క్రవ్యాదుల మగుడఁ జేయ
నిగిడించిన శరంబె నిర్జరారులఁ ద్రుంచి- తొడిఁదొడిఁ దనకుఁ దా దొసకుఁ జేరఁ
 
తే. దొలఁగి రసురులు కొంత నీబలిమి దెలిసె-ముష్టి నీ దెంత నీయస్త్రములదె వింత
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
74
సీ. అడవిలోఁ దెరువర్ల నుడుగక తినుచున్న- యాఁడుదాని వధించు టర్హ మగునె?
చిక్కినవారికిఁ జేతు లెంతయుఁ జాఁచు- మొండివాని వధించ ముఖ్య మగునె?
యెక్క డెక్కడ నైన నేఱుక తినుకాకి- కన్ను బోఁ బొడుచుట ఘనగుణంబె?
కడు వ్రేటుఁ బడి గడ్డి కఱచినఁ మారీచుఁ- దఱిమి బాధించుట నెఱతనంబె?
 
తే. యెవ్వ రేరాజు లొనరించి రిట్టిపనులు?-చేసితివి యింక నె ద్దేని సేయఁగలవు!
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
75
సీ. రాజకార్యపరుండు తేజోబలాధికుఁ- డాంజనేయుఁడు భృత్యుఁ డగుటఁ జేసి
యమితశౌర్యుఁడు ప్లవంగమకులేశుఁ డినజుఁ- డఱ లేని స్నేహితుఁడగుటఁ జేసి
విమతమర్మజ్ఞుండు విశ్వాసభరితాత్ముఁ- డల విభీషణుఁ డాప్తుఁ డగుటఁ జేసి
సుమనస్కు లమనస్కు లమృతవాక్యంబులన్‌- బొసఁగ నాశీర్వదించుట జేసి
 
తే. లంక సాధించితివి గాని లావుచేత-నిర్జరారుల గెలువంగ నీతరంబె?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
76
సీ. నడువఁజాల దని జానకి నెత్తుకొని ముందు- నడచు విరాధుని నఱకు టేమి?
చనవున వైదేహి చనుబిడ్డవలెఁ నోటఁ- బట్టిన యైంద్రికన్గొట్టు టేమి?
సీత సంతోషింపఁ జిత్రవేషముఁ దాల్చి- తిరుగు మారీచుని నరుకు టేమి?
తల్లినివలెఁ దెచ్చి ధరణీజను నశోక- వని నిల్ప రావఁణు దునుము టేమి?
 
తే. కోప మిటు లేమి? వారు మహాపరాధు-లైన ముక్తిప్రసాదార్హు లగుట యేమి?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
77
సీ. వరరాజ్యకాంక్షలోఁ బట్టకుండెద వైన- సుగ్రీవునగరంబుఁ జూడరాదె?
పరధనంబున కాస పడక యుండెద వైన- నాలంక నొకరాయి యంటరాదె?
పరయోష పై నిచ్చఁబాయ కుండెద వైన- నల శూర్పణఖముక్కు నిలుపరాదె?
పరదానవులఁ ద్రుంపఁ బంతగించెద వైన- మూల దైత్యులఁ దోలి పుచ్చరాదె?
 
తే. చేసిన ప్రతిజ్ఞలో నొండు వీస మైనఁ-దప్పు వోకుండ నడచిన ధార్మికుఁడవొ!
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
78
సీ. నిర్దయాత్ములె కాని నిత్యాగ్ని హోత్రాది- కర్మనైష్ఠికులైన ఘనులు గారె?
శుచిశూన్యులే కాని శ్రుత్యాదిపాఠక- ప్రకటవేదార్థబోధకులు గారె?
సత్యహీనులె కాని చంద్రశేఖరపాద-పద్మపూజానందపరులు గారె?
మాయికులే గాని మంత్ర ప్రయోగోప- సంహరణ క్రియాచణులు గారె?
 
తే. కులము బ్రాహ్మణ్య మగు దైత్యకులము నెట్లు-గూల్చితివి బ్రహ్మహత్యకు గొంక కహహ?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
79
సీ. ఒక్కవ్రేటునఁ గూలునో వాలి బలశాలి- చెట్లుమా టొగ్గి వేసితివి గాని
మొనసి నీల్గునె పఙ్క్తిముఖుఁడు తన్నాభికా- మృతకుంభ పగలఁ గొట్టితివి గాని
కుంభకర్ణుఁడు రణక్షోణిలోఁ దీరునే- తీఱని నిద్ర నెదిర్చెఁ గాని
చిక్కునే యింద్రజి త్తుక్కున సోదరుం- డశననిద్రలు మాని యఁడఁచె గాని
 
తే. యింద ఱాయంబు లెరుగుదు వందువలన-మడిసి రసురులు నీచేత మడియువారె?
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
80
AndhraBharati AMdhra bhArati - shatakamulu - AMdhranAyaka shatakamu ( telugu andhra )