| శతకములు | ఆంధ్రనాయక శతకము |
|
| సీ. |
భక్తిఁజేసిన శిలాప్రతిమ మాత్రమే కాని- హరి యిందుఁ గలుగునా యనెడువారు స్వామి యిం దుండిన సత్యంబుఁ జూపక- యుండునే యని పల్కుచుండువారు బుద్ధావతారంబుఁ బూనినాఁ డఖిలంబుఁ- గని కనన ట్లుండు ననెడువారు దేవతామహిమంబు దెలియునో యేమేమి- నడువ నున్నదో యని నుడువువారు |
|
| తే. |
నీకు నిత్యోపచారముల్ లేకయున్న-లోకు లి ట్లాడుకొండ్రు పరాకిదేమి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
11 |
| సీ. |
ధర నూటయెనిమిది తిరుపతులందు శ్రీ- కాకుళం బరయఁ బ్రఖ్యాతమేని యాంధ్రనాయకుఁడ వం చఖిలదేశంబుల- నిన్నుఁ గీర్తించుటే నిజమయేని వైఖానసోక్తికి వంచన రాకుండ- నెరలు చూపినమాట నిజమయేని వైకుంఠుఁడవు స్వయంవ్యక్తిగా మర్చావ- తార మొందినమాట తథ్యమేని |
|
| తే. |
వివిధ పూజోత్సవములు నిర్విఘ్నములుగఁ-జేసికొనకున్న నీకుఁ బ్రసిద్ధి గలదె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
12 |
| సీ. |
మానితంబుగ గరుత్మద్ధ్వజారోహణం- బెప్పుడొనర్తువో చెప్పుమయ్య! గరిమతో నీ తిరుక్కల్యాణసంభ్రమం- బెప్పు డెప్పుడొ వేగ చెప్పు మయ్య రమతో మహోన్నతరథ మెక్కి తిరువీథు- లెప్పు డేతెంతువో చెప్పు మయ్య ధరణి నభ్యాగతదాన ప్రజాబృంద- మెప్పుడు బలియునో చెప్పు మయ్య |
|
| తే. |
వత్సరోత్సవ వీక్షణవాంఛ జనుల-కెపుడు ఫలియించునో యానతీయు మయ్య చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
13 |
| సీ. |
తగునట్లు తిరుమేను తా నామతింపుచు- మిన్న పీతాంబరం బున్న దనుచుఁ గమలతోఁ బుట్టిన కౌస్తుభం బది పోవఁ- దక్కు సొమ్మది నీకు తక్కె ననుచు లలితరత్న ద్యుతి మొలచినట్లు కిరీట- ముత్తమాంగముఁ బాయ కున్న దనుచు మండితమాణిక్యకుండలంబులు కర్ణ- యుగళితోఁ బుట్టిన ట్లున్న వనుచు |
|
| తే. |
నిండుకొన్నావు గడియించు నేరుపరివె-ప్రావలువ బ్రారువాణముల్ బ్రాఁతి యేమి? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
14 |
| సీ. |
వంచన గాదె దివ్యక్షేత్రపతులలో- మంత్రార్థకృత్యము ల్మాని యున్న? నపకీర్తిగాదె లోకాలోకములయందు- వత్సరోత్సవములు వదలి యున్న? నగుబాటు గాదె యన్యమతస్థజనులలో- నిజదాసకోటి మన్నింపకున్నఁ? బరిపాటి గాదె యల్పజ్ఞానమతులలో- దేవతామహిమంబుఁ దెలుపకున్న? |
|
| తే. |
నేఁటిదా నీ ప్రతిష్ఠ వర్ణించి చూడఁ-బాడి దప్పిన బలునిందపాలు గావె? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
15 |
| సీ. |
తిరునాళ్ళతఱి వచ్చెఁ బరిపరివిధముల- నెలమి సామగ్రిఁ జేయింప వేమి? సేవకు లందందు సేవింప భావింప- తిరువీథుల రథంబుఁ ద్రిప్పవేమి? వృజిన మెల్లఁ దొలంగు నిజ మంచుఁ బ్రజ లెంచు- పరమప్రసాదంబుఁ బంచవేమి? దివ్య దేశం బిది తీర్థంబు సార్థంబు- చక్రతీర్థము కృప సలుప వేమి? |
|
| తే. |
హఠము గావించి నీయన్వయంబు లెత్తి-కీర్తి నిందఁగ వర్ణించి గేలిపఱతు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
16 |
| సీ. |
చెల్లింపఁ దగునె వ్రేపల్లెలోఁ గల వెఱ్ఱి- గొల్లయిల్లాండ్రను గొల్లగొనఁగ? మెక్కంగఁ దగునె ము న్పెక్కిండ్లలో నుట్ల- కెక్కి పాల్వెన్నలు డొక్క నిండ? మ్రుచ్చిలఁ దగునె మళ్ళుచ్చి జలక మ్మాడు- మచ్చెకంటుల కోక లిచ్చకముగ? మ్రొక్కంగఁ దగునె ముం దొక్కపువ్వునకుఁ దాఁ- గక్కసించినయాలి కక్కజముగ |
|
| తే. |
నిట్టీ నగుబాటుపనులు నీ వెన్ని కలుగఁ-జేసినాఁడవు మంచిప్రసిద్ధకుఁడవె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
17 |
| సీ. |
అబ్బుకో గలవొ కాయక్లేశ మొనరించుఁ- దేవాసురు లటుండ దివ్యరమను దోచుకోఁ గలవొ చే సాచి లోకము లాచి- బలిమహాదాత వైభవము లెల్ల రాఁ దీయఁగలవొ సత్రాజిత్తుఁ డీకున్న- మణిశమంతక మొక మమతఁ గొల్పి నాటించఁ గలవొ సన్న కసన్ననె వనంబు- పెట్టు మ్రాన్పెకలించి పెరటిలోనఁ |
|
| తే. |
దెచ్చుకొన వేమి వస్త్రాన్నదీపధూప-గంధ తాంబూలములకైన గడన దెలిసె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
18 |
| సీ. |
తలను బించెపుదండ ధరియించవలె గాని- మణికిరీటము బెట్ట మనుజపతివె? గళమున వనమాలికలు పూనవలెఁ గాని- హారము న్వేయ దేశాధిపతివె? కరమున మురళి చక్కఁగఁ బూనవలెఁ గాని- శాతాసిఁ బూనంగ క్షత్రియుఁడవె? తనువు గోక్షీరవాసన గుప్పవలెఁ గాని- చందనం బలఁద రాజవె తలంప? |
|
| తే. |
నెల్లలోక మెఱింగిన గొల్లవాఁడ-వేది కుల మింత రాజస మేమి నీకు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
19 |
| సీ. |
కన్నవారల మున్ను గారాగృహంబున- విడిచి పాఱితివి నీ కడిమి యేమి? పగవాఁడు పురిటిలోఁ బట్టి నెత్తుకపోవఁ- దమకించుచున్న నీ ధైర్య మేమి? ముద్దుమన్మని గోప్యముగ నొండు బంధింపఁ- దెలియన ట్లున్న నీ తెగువ యేమి? వైరిధాటికి నోడి వనధి మధ్యమునందు- నిలు గట్టుకొన్న నీ బలిమి యేమి? |
|
| తే. |
విఱిగి తిరి గెన్నఁడెన్నఁడో తఱి యెఱింగి-యొరుల నడఁచితి వది యేమి భరము నీకు? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
20 |