| శతకములు | ఆంధ్రనాయక శతకము |
|
| సీ. |
దూడలలోఁ బెరదూడ మేయఁగఁజూచి- యట్టె పట్టుక చావఁగొట్టవలెనె పొడవ రా వేగ నాబోఁతుకొమ్ములు పట్టి- విడువక దానిపే రుడుపవలెనె ముక్కుతోఁ జెనకిన కొక్కెరాయనిఁ బట్టి- వెర వొప్పఁగా మెడ విఱువవలెనె తన్నుఁ బో తని మృగాధమ మంచు నెంచక- తొడరి గార్ధభమును ద్రుంపవలెనె |
|
| తే. |
మేమి ఘనకార్యములు చేసి తిద్ధరిత్రి-నెన్నటికి నీ వొనర్చిన విట్టిపనులె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
31 |
| సీ. |
కవ్వడి కెంత చక్కఁగ బోధ చేసిన- నితరహింసాకర్మ మిష్టపఱుప రాయబారం బెంత రసికత నడిపిన- ననికి భారతుల నాయత్త పఱుప విశ్వరూపం బెంత విమలతఁ జూపిన- నోర్వని కురురాజు నులుకు పఱుప విలుఁ బట్ట నని యెంతొ చెలిమిగఁ బలికిన- నవల సుయోధను నాసపఱుప |
|
| తే. |
పోరు చంపక చుట్టముల్ పోర నీల్గఁ-జూచుచుంటివి యేనాఁటి చుట్ట మీవు? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
32 |
| సీ. |
శ్రీమద్వికుంఠపురీ వరేశుఁడ వయ్యు- గొల్లపల్లెల నుండఁ గోరు టేమి యక్షీణలక్ష్మీ కటాక్షవీక్షుఁడ వయ్యుఁ- ద్రోవ లే కింటింటఁ దోఁచ నేమి భూరి చతుర్దశ భువనావనుఁడ వయ్యుఁ- గడువేడ్కఁ దొఱ్ఱులఁ గాయ నేమి సన్మునిదేవతా సంభావితుఁడ వయ్యు- నాలగావరులతో నాడ నేమి? |
|
| తే. |
గొప్పలో గొప్పవాఁడవు కొలదిలోనఁ-గొలదివాఁడవు ని న్నెట్లు గొలువ వచ్చు? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
33 |
| సీ. |
దుర్యోధనుం డవధ్యుఁడ వంచు మానెఁ గా- కలుక బంధింపఁగాఁ దలఁప లేదె? గోపాలుఁడవు పూజఁ గొందువేరా యని- సభ నిన్నుఁ దిట్టఁడే చైద్యుఁ డెదిరి? నీలాంఛనంబులఁ బోలు చిహ్నలు దాల్చి- తానె నీ వనఁడె యుద్ధతినిఁ బౌండ్రుఁ? డెవ్వరుఁ బట్టలే రేను బట్టెద నంచు- యవనుండు దరుమఁడే యాహవమున |
|
| తే. |
నృపులు కొందఱు వెఱచిరే నీకు మున్ను-ప్రాణముల కాసపడరేని భండమున చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
34 |
| సీ. |
రాజు లెవ్వరుఁ బఙ్క్తిభోజన మిడకున్న- దాసునింట భుజించి తనియలేదొ? బంధువు లెవ్వరు గంధ మీ కుండిన- మువ్వంకలది పూయ మురియలేదొ? దొర లెవ్వరును బూలసరము లీకుండినఁ- దెలిసి మాలికుఁ డీగ నలరలేదొ? ప్రభువు లెవ్వరు వస్త్రబహుమాన మీ కున్నఁ- దెచ్చి యిచ్చిన చాకి మెచ్చలేదొ? |
|
| తే. |
పాటి సేయంగ నేరాజు బంధుగుఁడవొ?-మున్నె నీపస దెలిసిన దెన్న నేమి? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
35 |
| సీ. |
నాఁగలి రోఁక లన్నకు నిచ్చి శంఖాది- పంచాయుధము లీవు పట్టినావు తాఱిటెక్కెంబు కోల్తల పెద్ద కెత్తించి- గరుడధ్వజం బీవు గట్టినావు వెలరాని కఱవోని వలువ జ్యేష్ఠున కిచ్చి- కనకాంబరం బీవు గట్టినావు మద్య మగ్రజునకు మత్తిలఁ దావించి- జున్ను బాల్ పెరుఁ గీవు జుఱ్ఱినావు |
|
| తే. |
తగువరివె యన్నదమ్ముల ధర్మ మీవె-తీర్చవలెఁ గాని మఱియొండు తీర్పఁగలఁడె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
36 |
| సీ. |
అప్పనంబులు గొన్ను నఖిలదిఙ్మండలే- శ్వరులచే వేంకటాచలనివాసుఁ డరుదుగా నరువదా ఱవసరంబులు మహా- భోగంబుఁ గొనునీలభూధ్రవరుఁడు పానకం బాలు సాఁబాలు భక్తుల కిచ్చి- మెసఁగును మంగళాద్రీశ్వరుండు పుట్టకొలంది మైపూఁతఁగాఁ గొను మంచి- గంధంబు సింహనగ ప్రభుండు |
|
| తే. |
సాటిసాములరీతి నిచ్చోట నీవు-మూర్తిమంతంబుఁ జూపక కీర్తి గలదె? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
37 |
| సీ. |
బొచ్చెచేఁపకు నైన మచ్చరం బున్నది- తాఁబేటి కైన సత్త్వంబు గలదు డీకొన్న నడవిపందికిఁ గల్గు రోసంబు- తెరనోటినరుఁడైనఁ దెగువ సేయుఁ బొట్టివానికి నైన దిట్టతనం బుండు- బాపని కైన దర్పంబు గలదు చుంచురాజున కైన శూరత్వ మున్నది- ముసలికి నైనఁ జేపుష్టి గలదు |
|
| తే. |
సిద్ధ మాభీరుఁడవు నీవె బుద్ధి నెంచఁ-గలికి వై యేమి సేయఁ గలవొ కాని చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
38 |
| సీ. |
మును నందగోవత్సములఁ గాయునప్పుడు- సనునయించిరె కంజజాది సురలు? విటచోరచేష్టల వ్రేపల్లెఁ దిరుగు నీ- దగుమ్రోల నచ్చర లాడినారె? నరరథాశ్వముల సంగరవీథిఁ దోలునాఁ- డెంచి దిక్పతులు భావించినారె? మగధేశుదాడికి మథుర వీడిననాఁడు- దేవర్షు లెల్లఁ గీర్తించినారె? |
|
| తే. |
యల్పునిగ నెంచినారె లోకైకనాథ-నాథునిఁగ నెంచినారె ము న్దరణిఁ? జెపుమ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
39 |
| సీ. |
పూతనాకుచకుంభపూర్ణ విషస్తన్య- పాయివై బ్రదికిన భాగ్య మేమి? కాళియాశీవిషగ్రసన ప్రమాదంబు గడచి జీవించిన ఘనత యేమి? చాణూరమల్లదో స్తంభ ఘట్టన కోర్చి- లబ్ధజయుఁడ వైన లాభ మేమి? సాళ్వరాజామోఘ శక్తిప్రయోగంబు- మరలించుకొనిన సామర్ధ్యమేమి? |
|
| తే. |
బడుగుదాసరివలె నన్నవస్త్రములకుఁ-బరుల కాశింతు విచట నీపంత మేమి? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
40 |