| శతకములు | ఆంధ్రనాయక శతకము |
|
| సీ. |
ఆడించెదవు బొమ్మలాటవాఁడును బోలె- సర్వచరాచరజంతువులను కనుకట్టు గట్టెదు గారడీఁడును బోలె- మిథ్యాప్రపంచంబు తథ్యముగను వేర్వేఱఁ దోఁతువు వేషధారియుఁ బోలెఁ- బహువిధదేవతాభద్రకళలఁ దెలివి మాన్పుదువు జక్కులవాని చందానఁ- బ్రజల సంపద్రంగవల్లిఁ జేర్చి |
|
| తే. |
యిట్టివే కద నీవిద్య లెన్ని యైన-నింక నేమిట ఘనుఁడవో యెఱుఁగరాదు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
51 |
| సీ. |
కూరిమి నల తంతెగొట్టు సన్న్యాసితో- ముచ్చటించెద వేమి పుణ్యమూర్తి సాటిగా వెలిగొండవీటి జంగముచెల్మిఁ- బచరింతు వేనాఁటి బాంధవుండు వెలిపాపపాన్పుపై వేడ్కతోఁ బవళింతు- వది యేమి భోగిభోగాంతరంబు పొరుగిండ్ల కేప్రొద్దుఁ బో రాఁ దలఁచునింతిఁ- బాయకుండెద వేమి భాగ్యలక్ష్మి |
|
| తే. |
మంచి సహవాసములు గల్గె నెంచి చూడ-నీకె తగు నట్టివారితో బెనరు నెఱివ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
52 |
| సీ. |
అఖిలపోషకుఁడ వ న్నాఖ్య మాత్రమె కాని- కర్తవు నీవె భోక్తవును నీవె యక్షరుండ వను ప్రఖ్యాతి మాత్రమె కాని- చర్చింప వేఱొండు సాక్షి గలఁడె సుగుణాబ్ధి వని నిన్ను స్తుతి యొనర్చుటె కాని- నిర్గుణుం డెవ్వఁడు నీకు మించ విశ్వాత్ముఁడ వటంచు వినుతించుటయే కాని- చొచ్చి ని న్నెవ్వఁడు చూచినాఁడు |
|
| తే. |
వినుకలులె గాని నిన్ను నీవిశ్వములను-మొద లెఱుంగుదురే నిజంబునకుఁ బిల్వ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
53 |
| సీ. |
ఒక గుణంబున నీవె సకల ప్రపంచంబుఁ- గల్పించితి వభూతకల్పనముగ వేఱొకగుణముచే విశ్వవిశ్వప్రాణ- రక్షణం బొనరింతు వక్షయముగ మఱి యొండు గుణముచే మండలంబులు గూడఁ- జెఱపివేయుదువు నిశ్శేషముగను నిర్గుణంబున నీవె నిరవకాశంబుగాఁ- బట్టక యుందువు బయలు మెఱసి |
|
| తే. |
గుణ మొకటి గాదు తెలిసినగుణము లేదు-చేరి నినుఁ గొల్వరాదు వచింపరాదు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
54 |
| సీ. |
జీవిని జీవి భక్షింపఁ జేసితి వింతె- కొని పెట్టినావె చేతనుల కెల్లఁ? జేసినంత భుజింపఁ జేసినా వింతె కా- కెక్కువ లెవ్వరి కిచ్చినావు? కర్మసూత్రంబునఁ గట్టి త్రిప్పెదవు గా- కిచ్చ నొక్కనిఁ బోవనిచ్చినావె? వెసంబృథక్ప్రతుల వేఱుఁబెట్టితివి గా- కందఱి కైకమత్య మిడినావె? |
|
| తే. |
తెలిసె నీరక్షకత్వంబు దేవదేవ!-వేఱె గతి లేక నిన్ను సేవింప వలసె? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
55 |
| సీ. |
నీరుపట్టుగ నుంట నారాయణుఁడ వండ్రు- నారాయణాఖ్యాధికార మేమి? బలిసి యంతట నీవె గలుగ విష్ణుఁడ వందు- రావిష్ణునామప్రభావ వేమి? ముగురు నీవై వెలుంగఁగఁ గేశవుఁడ వండ్రు- కేశవాభిఖ్యాప్రకాశ మేమి? సిరికి మగఁడ వై మెరయ శ్రీపతి వండ్రు- శ్రీపతినామప్రసిద్ధి యేమి? |
|
| తే. |
పెట్టుపేరు లనేకముల్ పుట్టుపేరు-గుఱు తెఱింగిన నీమూల మెఱుఁగవచ్చు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
56 |
| సీ. |
వేఁడని చూదక విపినవహ్నిజ్వాలఁ- ద్రావెదో తేనియఁ ద్రావినట్లు భార మం చనక గోవర్ధనపర్వతం- బెత్తెదో పూబంతి యెత్తినట్లు విషపుంజ మనక నాభీలాజగరజిహ్వఁ- జింపెదో ప్రాబట్టఁ జింపినట్లు పెస నసాధ్యుండని వెరవక నరకుని- నఱికెదో పార్వేఁట నఱికినట్లు |
|
| తే. |
భక్తసంరక్షణ త్వరా పరవశతను-జేసినా వేమొ యూరక సేయఁగలవె? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
57 |
| సీ. |
వత్సాపహరణగర్వము మాని యజుఁడు దా- నపరాధి ననుచు సాష్టాంగ మెఱఁగె భవుఁడు బాణున కాజి బాసట యై వచ్చి- భక్తునిఁ బట్టిచ్చి ప్రణుతిఁ జేసె వజ్రి శిలావృష్టి వర్షించి లజ్జించి- తప్పుఁ జేసితి నంచు దండ మిడియె సమవర్తి భీతి నంజలిఁ జేసి యాత్మలో- కస్థితు గురుపుత్రుఁ గాను కిచ్చె |
|
| తే. |
క్షోణిఁ బుట్టుక మాలిన గొల్లవాని-నిన్ను నావేల్పు లోడింప నేర రేమి? చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
58 |
| సీ. |
కొనముట్ట హెచ్చుతగ్గుల ప్రాతఁసుద్దుల- తాతపుస్తక మొకఁ డాతతాయి మ్రుచ్చిలి నీటిలోఁ జొచ్చి డాఁగిన వాని- పావన మేమి వెంబడిగఁ బెద్ద కోఱమీనంబవై యాఱొండుసంద్రము- ల్నిముసంబులో నీఁది నెమకి వాని డొక్క వ్రక్కలుగాఁ గఱుక్కున బరిఁ గోసి- కడ లేనినుడువు లెక్కటికి నోట |
|
| తే. |
మాట వెళ్ళనివానికి మగుడ నిచ్చి-యింతపనికిని నవతార మెత్తి తీవు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
59 |
| సీ. |
అబ్ధిపయఃపాత్ర మద్రికాణంధాన- మహిరాజగుణము దా రమరఁ గూర్చి యమృతాభిలాష దేవతాసురుల్ మథియింప- గిరి మున్గం గచ్ఛపాకృతి వహించి నిర్వహించుట గాని సర్వకాశ్యపులలోఁ- బఙ్క్తిభేదముఁ జేసి పల్మ ఱాస కొల్పి దైత్యులనోరుఁ గొట్టి యాదిత్యుల- కమృతాన్న మిడితి వాయమరులందుఁ |
|
| తే. |
బక్షపాతివి గావె? యభక్తిఁ బడిరి-నమ్ముదురె యానిశాటు లెన్నటికి నిన్ను చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! |
60 |