శతకములు మారుతి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101 111
మ. ఘనవాలాగ్ని శిఖాళిఁ గాల్చితిని లంకన్‌ సీత యేమయ్యెనో
యని శంకించి కృశానుచేఁ గమల కాహా! నేఁడు వైదేహనం
దిని సేమంబున నున్న దంచు వినువీథి న్మ్రోయు దేవోక్తులన్‌
విని మోదంబున భూమిపుత్రి మరలన్‌ వీక్షింపవే మారుతీ!
71
మ. శరధిం దాటి దశాస్యు ప్రోలమరు లెంచం జొచ్చి సర్వంసహా
వరజం గాంచి, యశోకానననము విధ్వంసంబు గావించి కొం
దఱ దైతేయులఁ జంపి వెండి జలధిన్‌ లంఘించి శీఘ్రంబె యు
త్తర తీరస్థ నగంబుఁ జేరితివి గాదే బల్విడిన్‌ మారుతీ!
72
మ. కనుగొంటిన్‌ రఘురామపత్ని నల లంకాపట్టణాభ్యంతరం
బున నంచుం దగఁ బోయి వచ్చిన విధంబునన్‌, సర్వకార్యంబులున్‌
వినయంబొప్పఁగఁ దెల్పి యంగదునకున్‌ నీలాజపుత్రాదికీ
శనికాయంబుల కట్లొసంగవె మహాసమ్మోదమున్‌ మారుతీ!
73
మ. చిరకాలంబునుండి పెంచిన మధుస్ఫీతోరుకాంతారముం
గరమర్థిన్‌ వడిఁ జొచ్చి విచ్చలవిడిన్‌ సంతుష్టియౌ నట్లుగా
వరుసన్‌ దేనెలుఁ ద్రావనిచ్చి ఫలముల్‌ భక్షింపఁగాఁ జేసి వా
నరులం దృప్తులఁ జేయవే సమధికానందముతో మారుతీ!
74
శా. ఆరామాధిపు పాదపద్మముల కుద్యద్భక్తితో మ్రొక్కి గ
న్నారన్‌ జూచితి భూమిపుత్రిని దశాస్యావాసమౌ లంకలో
సారోద్యానమునందు దైత్యయువతీ సందోహమధ్యంబునన్‌
వీరగ్రామణి! చిక్కియున్నదని తద్వృత్తాంత మాద్యంత మిం
పారం దెల్పి, ముదబ్ధిఁ దేల్పవె నృపాలాగ్రేసరున్‌ మారుతీ!
75
మ. మహిపుత్రీకుశలంబు దెల్పి, మము సమ్యగ్ప్రీతి పాథోధి వా
ర్లహరిన్‌ దేల్చితి వింక నేను ప్రతికారం బేమి గావింతు? మ
త్సహనోదగ్రభుజాయుగాంచితపరిష్వంగంబు నీకిచ్చెదన్‌
రహి మీఱ న్గొను మంచొసంగఁడె కృపన్‌ రాజేంద్రుఁడున్‌ మారుతీ!
76
శా. ఆ లంకాపురి గుప్తికర్మము, నిశాటాళిప్రలాపంబులున్‌
వాలాయంబు దశాస్యుగర్వమును సర్వంబున్‌ నివేదించి కీ
శాళిం దోడ్కొని ఘోరజన్యమునకున్‌ యానంబు గావింపు, మిం
కాలస్యంబది యేలటంచు విభునిం బ్రార్థింపవే మారుతీ!
77
మ. మతిమంతుండు విభీషణుండు, రఘురామా, నన్ను రక్షింపు మం
చతిదైన్యంబున నేగుదెంచిన దదీయాకార వాగింగితా
తతశీలంబుల చేత వాని పరిశుద్ధత్వంబు బోధించి, స
మ్మతి నిప్పింపవె వాని కట్లభయమున్‌ క్ష్మానాథుచే మారుతీ!
78
మ. నలుఁడా సేతువు గట్టునప్పుడు కపుల్‌ నానాప్రకారంబులన్‌
శిలలం జెట్టులు దెచ్చివైచునెడ నిస్సీమప్రభావంబునన్‌
జలమారం దగ నీవు రాఘవుఁడు మెచ్చం గొప్ప శైలంబులన్‌
బలువొప్పం గొని తెచ్చి వైచి జలధిం బంధింపవే మారుతీ!
79
మ. కనకోర్వీధరరాజ మద్భుతగతిం గాలాభ్రముం దాల్చిన
ట్లనుమానింపఁగ నీవు భూరివిపులోద్యత్పృష్ఠభాగంబునన్‌
దిననాథాన్వయసోము రాము నమితస్థేమున్‌ రహిం దాల్చి గ్ర
న్ననఁ దత్సేతుపథంబునం జలనిధిం దాటింపవే మారుతీ!
80
AndhraBharati AMdhra bhArati - shatakamulu - mAruti shatakamu ( telugu andhra )