| శతకములు | మారుతి శతకము |
|
| శా. |
'ఓరి రావణ! నేను రామనృపవంశోత్తంసు దాసుండ నా శూరాగ్రేసరుపత్ని నీవు వనిలో జోరుండవై తెచ్చిత న్నారీరత్నము నిమ్ము రాఘవునకున్ గాకున్న నీవింక త ద్ఘోరాస్త్రంబులఁ జత్తు వాజి' నని నీతుల్ దెల్పవే మారుతీ! |
61 |
| శా. |
"బాలారత్నము సీత మ్రుచ్చిలిటు నీ పాలింటికిన్ మృత్యువం చాలోకింపక దెచ్చితింత కెపుడో యద్దేవి కోపానల జ్వాలాళిం బడి భస్మమై చనక సప్రాణుండవై యుండుటల్ చాలన్ చిత్రము భర్తచేఁ గలన నిన్ జంపింప నిందాక ని ట్లాలస్యం బొనరించె" నంచనవె దేవారాతితో మాఅరుతీ! |
62 |
| మ. |
"ఖల దైత్యాధమ! జానకీసతిని నీ కంఠస్థశాతాసిగాఁ దలపై బడ్డ మహాశనిచ్ఛదముగాఁ దాలుస్థితోద్యద్ధలా హలముంగా వసనాంచలగ్రథిత దీప్తాగ్నిస్ఫులింగంబుగా తలప న్నేరక దెచ్చి తీ" వని రహిన్ దర్జింపవే మారుతీ! |
63 |
| మ. |
"తరమే నీకిక నెందుఁ బోఁగలవు పాతాళంబులో డాఁగినన్ శరధిం జొచ్చిన మిన్నుఁ బ్రాకిన దశాస్యా! వజ్రి వజ్రాభ భీ కరబాణంబుల నీ శిరంబులనిలో ఖండించి యా కాకుత్స్థుఁడా వరవర్ణిన్ గొనిపోవు నిక్క" మనుచున్ వాదింపవే మారుతీ! |
64 |
| మ. |
'దశకంఠాసుర! పుణ్యసాధ్వియగు సీతం గానలో దొంగవై పశుబుద్ధిం గొనితెచ్చి నందుకిపుడే బంధించి ముష్టిన్ త్వదు గ్రశిరంబుల్ వెస వ్రక్కలింపనగు నా రామాజ్ఞ లేకున్కి దు ర్దశ నొందింపక యోర్చియుంటి' ననుచుం దర్జింపవే మారుతీ! |
65 |
| మ. |
దనుజాధీశుఁడు నీదువాలమునకున్ తైలార్ద్రచేలంబు లొ య్యనఁ జుట్టించి కొనన్ కృశాను నిడి దేవారాతు లివ్వానరుం గొని ప్రోలంతయుఁ ద్రిప్పుడంచుఁ బలుకన్ ఘోషింపుచున్ దైత్యుల ట్లొనరింపన్ బురి గుప్తికర్మము తదుద్యోగంబు వీక్షింపఁ బె ల్పన దత్కర్మ మొకింతసేపు మదిలో సైరింపవే మారుతీ! |
66 |
| మ. |
ప్రకటింపన్ జగముల్ దహించు శిఖి నీవాలాగ్రగుండయ్యు జా నకి యాశీర్వచనంబునన్ బవనబాంధవ్యంబునన్ జేసి తా వకవాలాంచితరోమమైనఁ గమలింపన్ శక్తుఁడుంగాక పొం దికతోఁ జందనపంకశీతుఁ డగుచున్ దీపింపఁడే మారుతీ! |
67 |
| మ. |
తనువుం గొంచెముఁ జేసి రజ్జుమయబంధంబుల్ వడిం ద్రుంచి వెం టనె కాలాభ్రము వైఖరిన్ బెరిగి తోడన్ వచ్చు దోషాటులన్ మునుముట్టం దునుమాడి నిర్జరులు సంతోషింప వాలాగ్నిచే ఘనలంకానగరంబు సర్వ మవిశంకం గాల్పవే మారుతీ! |
68 |
| మ. |
జనకక్ష్మాపతిపుత్రి యున్న నగరాజంబున్, నయజ్ఞుండు స జ్జనమాన్యుండగు నవ్విభీషణుని వేశ్మశ్రేష్ఠముం దక్క త క్కిన లంకాపురమెల్ల వాలకలితాగ్నిం గ్రాగి క్రుద్దేశనే త్రనటత్పావక దగ్ధలోకసమతం బ్రాపించెఁగా మారుతీ! |
69 |
| మ. |
నిను బంధించుట నీదువాలమున వహ్నిం గొల్పుటల్ రాక్షసుల్ వినిపింపన్ విని సీత యేను పతికిం బ్రేమాస్పదీభూత నౌ ట నిజంబేని కృపీటజన్మ! కడువేడ్కన్ మత్ప్రియార్థంబు పా వనికిన్ శీతుఁడవై వెలుంగు మనుచున్ బ్రార్థింపదే మారుతీ! |
70 |