| శతకములు | మారుతి శతకము |
|
| శా. |
నీ నామంబు పఠించినన్ నిను మదిం జింతించినన్ నీ కథా గానం బుద్ధతి సల్పినం గరము వేడ్కన్ నిన్నుఁ బూజించినన్ నానావ్యాధులడంగు, వేలుపుల సన్మానంబు సంధిల్లు, వి ద్యానైపుణ్యము గల్గు, చేకుఱును దీర్ఘాయుష్యమున్ మారుతీ! |
111 |
| శా. |
నీపేరెంచిన శత్రువర్గము వెసన్ నిర్మూలమైపోవు సం తాపంబుల్ దొలఁగున్, సమస్తదురితాంతం బౌను, కూశ్మాండ మా రీ, పైశాచిక యక్ష రాక్షసగ్రహ, ప్రేతోగ్ర భూతాదినా నాపీడల్ నశియించు, భద్రమొదవున్ సత్యంబుగా మారుతీ! |
112 |
| మ. |
విమలంబై, వినఁ జిత్రమై, వితతమై, విద్యోతమై, వేద్యమై, యమృతంబై, యఘహారమై, యమితమై, యానందమై యాద్యమై సుమనస్సమ్మతమై, సుధీవినుతమై, సుజ్ఞానమై, సూచ్యమై, సముదంచద్గతి నొప్పు నీ మహిమ కీశగ్రామణీ, మారుతీ! |
113 |
| శా. |
ఆ సుగ్రీవుఁడు కీశరాజ్యపదవిం బ్రాపించుటల్ రాముఁడు ల్లాసంబొప్పఁగ నవ్విభీషణునకున్ లంకాపురం బిచ్చుటల్ వాసింగాంచి తరించుటల్ దశముఖున్ భంజించుటల్, మూర్ఛితుం డౌ సౌమిత్రినిఁ దేర్చుటల్, మరల సీతావాప్తియున్ సర్వమున్ నీ సాహాయము చేతనే కద? లసన్మేధానిధీ మారుతీ! |
114 |
| మ. |
పదదోషంబులు సంధిదోషము, యతిప్రాసాదిదోషంబులున్ ప్రథితవ్యర్థ సమాసదోషము రసార్థప్రక్రియాదోషముల్ పదపద్యంబులఁ గల్గియున్న ననుకంపన్ వాని నన్నింటి నీ మది సైరించి, గుణంబుగాఁ గొని ననుం బాలింపవే మారుతీ! |
115 |
| మ. |
చతురత్వంబున గోపినాథకులవిస్తారుండు శ్రీపద్మనా భతనూజుండగు వేంకటాఖ్యకవి విద్వత్సమ్మతంబైన యీ శతకంబున్ రచియించి, నీకు సముదంచద్భక్తి నర్పించె, స మ్మతితో దీనిఁ బరిగ్రహించి, కరుణ బాలింపవే మారుతీ! |
116 |