శతకములు వృషాధిప శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
చ. అసదృశ విస్ఫురద్గుణ దృగంచల కల్పిత సృష్టిపాలన
గ్రసనకళాకలాప ఘనకౌశల ఖేలన లింగమూర్తి మా
నసకలనా వశీకరణ నైపుణతత్పరశీల జంగమ
శ్వసన శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
51
చ. ప్రమథగణాధినాథ సముపాసన భాసుర పార్వతీమనో
రమ రమణీయ హృత్కమలరాజిత నవ్యపతంగ సౌరభ
భ్రమరవిలోలతా మధుకరాయిత దివ్యశరీర! సత్ప్రభా
వమహిత! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
52
ఉ. కందళితాత్మయంత్రిక వికర్తనశీల మరీచిమన్మనో
మందవిహార విస్ఫురిత మధ్యమయాన చిదంబరేందు ని
ష్యంద సుధారసానుభావ సంతతదివ్యశరీర యోగిరా
డ్వందిత నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
53
ఉ. "ఖ్యాతయశఃప్రపూరిత జగత్త్రియాయ నమోనమో, మహా
పాతక సూతకఘ్న పదపద్మ యుగాయ నమోనమో, సము
ద్ద్యోత వృషాయతే" యనుచు నుత్సుకతన్‌ బ్రణుతింతు సంయమి
వ్రాత శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
54
ఉ. "అస్తగణ ప్రవిష్ట సకలార్తి హరాయ నమోనమో, సుఖా
వాప్తి కరస్మితాంచిత కటాక్ష దయాయ నమోనమో, సము
ద్దీప్త గుణాయతే" యనుచు దీనగతిన్‌ బ్రణుతింతు నిన్ను ని
ర్వ్యాప్త జగత్ప్రపంచ బసవా! బసవా! బసవా! వృషాధిపా!
55
ఉ. "కల్పితలింగ జంగమసుఖ స్ఫురణాయ నమోనమో, యసం
కల్ప వికల్ప మార్గకథిత ప్రథితాయ నమోనమో, గుణా
కల్ప వరాయతే" యనుచు గౌరవలీల నుతింతు నిన్ను న
స్వల్పతర ప్రభావ బసవా! బసవా! బసవా! వృషాధిపా!
56
ఉ. "తర్జిత దుష్కృతాయ! భవతాపనికృంతన కల్మషాయ! భ
క్త్యూర్జిత మానసాయ! సుగుణోత్తమరత్న కరండకాయ! తే
యార్జిత సత్క్రియాయ! సదయాయ నమో" యని సన్నుతింతు నా
వర్జిత భక్తలోక! బసవా! బసవా! బసవా! వృషాధిపా!
57
ఉ. "చూర్ణిత మన్మథాయ! పరిశోభితభస్మవిలేపనాయ! సం
పూర్ణమనోరథాయ! గతపూర్వ భవాశ్రిత వర్తనాయ! తే
వర్ణ నిరాసకాయ! సశివాయ నమో" యని సంతతంబు ని
న్వర్ణన సేయువాడ బసవా! బసవా! బసవా! వృషాధిపా!
58
ఉ. "హృన్నళినే స్మరామి భవదీయ పదద్వితయం భవాటన
స్విన్న తను శ్రమాపహ మశేష జగత్ప్రణుతం మదీశ ని
ష్పన్న దయానిధే" యనుచు 'సంస్కృతభాష' నుతింతు నిన్ను వి
ద్వన్నుత నామధేయ బసవా! బసవా! బసవా! వృషాధిపా!
59
చ. "పరమనె యన్నె యాండవనె పన్నగతానె యనాథ నాధనే
పెరియనెపే నివుందనవె పేరు డయాననె పేరు జెప్పనే
తరి మురియాయనే" యనుచు 'ద్రావిడభాష' నుతింతు మన్మనో
వరకరుణా విధేయ! బసవా! బసవా! బసవా! వృషాధిపా!
60
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vR^ishhAdhipa shatakamu ( telugu andhra )