| శతకములు | వృషాధిప శతకము |
|
| ఉ. |
గానరసప్రవీణ! గతకాల వితాన! సమస్త భక్తస న్మాన! మహాకులీన! యసమాన చరాచర రూపభేద సం ధాన! జితాభిమాన! తనుధర్మవిహీన! మహాప్రదాన! దే వా ననుఁ గావుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
11 |
| ఉ. |
లింగమయాంతరంగ! గురులింగ పదాంబుజ భృంగ! సత్ప్రసా దాంగ! కృపాపరిస్ఫురదపాంగ! విముక్త భుజంగ! జంగమో త్తుంగ! జితాభిషంగ! గతదుష్కృత భంగ! మదీయలింగ! నీ వంగడ మేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
12 |
| ఉ. |
ఉత్తమ భక్తివృత్త! భజనోత్సుకచిత్త! యుదాత్త చిత్సుఖా యత్త! క్రియాప్రమత్త! నిఖిలాగమవేత్త! గుణోపయుక్త స ద్వృత్త! ప్రసాద భోగ సముదీర్ణ విశేషసుఖప్రమత్త! భా స్వత్తమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
13 |
| ఉ. |
దేహజవైరివాహ! శివదీపితదేహ! సుఖప్రవాహ! ని ర్మోహ! వినమ్ర సంయమిసమూహ! లసద్గుణగేహ! సంతతో త్సాహ! నిరీహ! జంగమ వితానదయావిహితావగాహ! ని ర్వాహమ నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
14 |
| ఉ. |
న్యాసఫలానివాస! దరహాస ముఖప్రతిభాస! దత్తకై లాస! విశేష జంగమవిలాస! శివైక్య సమాస! నిర్జితా యాస! సమస్త భక్తహృదయాంబుజ నిత్యనివాస! ధిక్కృత వ్యాస! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
15 |
| ఉ. |
రాగపరోపభోగ! గతరాగ! విధూతభవాదిరోగ! ని ర్యాగ! మహానురాగ! బహిరంతర నిష్ఠితయోగ! సత్క్రియో ద్యోగ! యకర్మయోగ! శివయోగ సమగ్ర సుఖాతిభోగ! దే వా గతి నీవె మాకు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
16 |
| ఉ. |
శీలలతాలవాల! యవశిష్ట భవప్రతికూల! లాలితో త్తాల గుణానుకూల! శివధర్మ మతప్రతిపాల! నిత్య స ల్లీల యశోవిశాల! చరలింగ సుఖోదయకాల! జియ్య! దే వా లలిఁ బ్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
17 |
| ఉ. |
కామితభక్తిభామ! గతకామ! మహాగణ సార్వభౌమ! ని స్సీమ యశోభిరామ! సవిశేష విముక్తిలలామ! సద్గుణ స్తోమ! శివైక్యదామ! సుఖదుఃఖ విరామ! ప్రమోదసీమ! దే వా మముఁ గావుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
18 |
| ఉ. |
సాధిత జన్మబాధ! గతసర్వనిషేధ! హతాపరాధ దు ర్బోధ కళావిరోధ! పరిపోషిత శాంభవవేధ! వర్జిత క్రోధ! నిరాకృతాఖిల విరోధ! శివైక్య సుబోధ! యీ భవ వ్యాధికి నీవె మందు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
19 |
| ఉ. |
శ్రీవిలసత్ప్రభావ! ప్రవిశిష్ట పరాజిత యన్యదైవ! స ద్భావ! యుత స్వభావ! శివతత్త్వ విశిష్ట మహానుభావ! యం హోవనదావ! పాలిత మహోద్ధతశైవ! విభుండవీవ దే వా వరదానశీల బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
20 |