శతకములు నరసింహ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
సీ. ప్రహ్లాదుఁ డేపాటి పైఁడి కానుక లిచ్చె? - మదగజం బెన్నిచ్చె మౌక్తికములు?
నారదుం డెన్నిచ్చె నగలు రత్నంబు? ల - హల్య నీకే యగ్రహారమిచ్చె?
ఉడుత నీ కేపాటి యూడిగంబులు చేసె? - ఘనవిభీషణుఁ డేమి కట్నమిచ్చె?
పంచపాండవు లేమి లంచ మిచ్చిరి నీకు? - ద్రౌపతి నీ కెంత ద్రవ్యమిచ్చె?
 
తే. నీకు వీరంద ఱయినట్లు నేను గాన? - యెందుకని నన్ను రక్షింప విందువదన?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
71
సీ. వాంఛతో బలిచక్రవర్తి దగ్గర జేరి - భిక్షమెత్తితి వేల, బిడియపడక?
యడవిలో శబరి దియ్యని ఫలా లందియ్యఁ - జేతులొగ్గితి వేల, సిగ్గుపడక?
వేడ్కతో వేవేగ విదురునింటికి నేఁగి - విందుఁగొంటి వదేమి, వెలితిపడక?
నటుకు లల్పము కుచేలుఁడు గడించుక తేర - బొక్కసాగితి వేల, లెక్కగొనక?
 
తే. భక్తులకు నీవు పెట్టుట భాగ్యమౌను - వారి కాశించితివి తిండివాఁడ వగుచు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
72
సీ. స్తంభమం దుదయించి దానవేంద్రునిఁ ద్రుంచి - కరుణతోఁ బ్రహ్లాదుఁ గాచినావు
మకరిచేఁ జిక్కి సామజము దుఃఖించంగఁ - గృపయుంచి వేగ రక్షించినావు
శరణంచు నా విభీషణుఁడు నీ చాటున - వచ్చినప్పుడె లంక నిచ్చినావు
ఆ కుచేలుఁడు చేరెఁడటుకు లర్పించిన - బహుసంపదల నిచ్చి పంపినావు
 
తే. వారివలె నన్నుఁ బోషింప వశముగాదె? - యింత వలపక్ష మేల శ్రీకాంత! నీకు?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
73
సీ. వ్యాసుఁడే కులమందు వాసిగా జన్మించె? - విదురుఁడే కులమందు వృద్ధిఁ బొందెఁ?
గర్ణుఁడే కులమందు ఘనముగా వర్ధిల్లె? - నా వసిష్ఠుం డెందు నవతరించె?
నింపుగా వాల్మీకి యే కులంబునఁ బుట్టె? - గుహుఁ డను పుణ్యుఁడే కులమువాఁడు?
శ్రీశుకుఁ డెచ్చటఁ జెలఁగి జన్మించెను? - శబరి యే కులమందు జన్మమొందె?
 
తే. నే కులంబున వీరంద ఱెచ్చినారు? - నీ కృపాపాత్రులకు జాతినీతు లేల?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
74
సీ. వసుధాస్థలంబున వర్ణహీనుఁడు గాని - బహుళ దురాచారపరుఁడు గాని
తడసి కాసియ్యని ధర్మశూన్యుఁడు గాని - చదువనేరని మూఢజనుఁడు గాని
సకలమానవులు మెచ్చని కృతఘ్నుఁడు గాని - చూడ సొంపును లేని శుంఠ గాని
అప్రతిష్ఠలకు లోనైన దీనుఁడు గాని - మొదటికే మెఱుఁగని మోటుగాని
 
తే. ప్రతిదినము నీదు భజనచేఁ బరఁగునట్టి - వానికే వంక లేదయ్య వచ్చు ముక్తి
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
75
సీ. ఇభకుంభములమీఁది కెగిరెడి సింగంబు - ముట్టునే కుఱచైన మూషికమును?
నవచూతపత్రముల్‌ నమలుచున్న పికంబు - గొఱుకునే జిల్లేడుకొనలు నోట?
అరవిందమకరంద మనుభవించెడి తేఁటి - పోవునే పల్లేరుపూల కడకు?
లలితమైన రసాలఫలముఁ గోరెడి చిల్క - మెసవునే భ్రమత నుమ్మెత్తకాయ?
 
తే. నిలను నీకీర్తనలు పాడనేర్చినతఁడు - పరులకీర్తనఁ బాడునే యరసి చూడ?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
76
సీ. సర్వేశ! నీపాదసరసిజ ద్వయమందుఁ - జిత్త ముంపఁగలేను జెదరకుండ
నీవైన దయయుంచి నిలిచి యుండెడునట్లు - చేరి నన్నిపుడేలు సేవకుఁడను
వనజలోచన! నేనువట్టి మూర్ఖుఁడఁ జుమ్మి - నీ స్వరూపముఁ జూడ నేర్పు వేగ
తన కుమారుల కుగ్గు తల్లి వోసినయట్లు - భక్తిమార్గంబను పాలు పోసి
 
తే. ప్రేమతో నన్నుఁ బోషించి పెంచుకొనుము - ఘనత కెక్కించు నీ దాసగుణములోన
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
77
సీ. జీమూతవర్ణ! నీ మోముతో సరిరాక - కమలారి యతికళంకమునుఁ బడసె
సొగసైన నీ నేత్రయుగముతో సరిరాక - నళినబృందము నీళ్లనడుమఁ జేరెఁ
గరిరాజవరద! నీగళముతో సరిరాక - పెద్దశంఖము బొబ్బపెట్టఁ దొడఁగె
శ్రీపతి! నీ దివ్యరూపుతో సరి రాక - పుష్పబాణుఁడు నీకుఁ బుత్రుఁ డయ్యె
 
తే. నిందిరాదేవి నిన్ను మోహించి విడక - నీకుఁ బట్టమహిషి యయ్యె నిశ్చయముగ
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
78
సీ. హరిదాసులను నిందలాడకుండినఁ జాలు - సకలగ్రంథంబులు చదివినట్లు
భిక్ష మియ్యంగఁ దప్పింపకుండినఁ జాలుఁ - జేముట్టి దానంబు చేసినట్లు
మించి సజ్జనుల వంచించకుండినఁ జాలు - నింపుగా బహుమానమిచ్చినట్లు
దేవాగ్రహారముల్‌ దీయకుండినఁ జాలు - గనకకంబపు గుళ్లుగట్టినట్లు
 
తే. ఒకరి వర్షాశనము ముంచకున్నఁ జాలుఁ - బేరుకీర్తిగ సత్రముల్‌ పెట్టినట్లు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
79
సీ. ఇహలోకసౌఖ్యము లిచ్చగించెద మన్న - దేహ మెప్పటికిఁ దా స్థిరత నొంద
దాయుష్యమున్న పర్యంతంబు పటుతయు - నొక్కతీరున నుండ దుర్విలోన
బాల్య యువత్వ దుర్బల వార్ధకము లను - మూఁటిలో మునిఁగెడి ముఱికికొంప
భ్రాంతితో దీనిఁ గాపాడుద మనుకొన్నఁ - గాల మృత్యువు చేతఁ గోలుపోవు
 
తే. నమ్మరాదయ్య! యిది మాయనాటకంబు - జన్మమిఁక నొల్ల నన్నేలు జలజనాభ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
80
AndhraBharati AMdhra bhArati - shatakamulu - narasiMha shatakamu ( telugu andhra )