శతకములు నరసింహ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
సీ. తల్లిదండ్రులు భార్య తనయు లాప్తులు బావ - మఱఁదు లన్నలు మేనమామ గారు
ఘనముగా బంధువుల్‌ గల్గినప్పటికైనఁ - దాను దర్లఁగ వెంటఁదగిలి రారు
యముని దూతలు ప్రాణమపహరించుక పోఁగ - మమతతోఁ బోరాడి మాన్పలేరు
బలగ మందఱు దుఃఖపడుట మాత్రమె కాని - యించుక యాయుష్యమియ్యలేరు
 
తే. చుట్టముల మీఁది భ్రమదీసి చూరఁ జెక్కి - సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
21
సీ. ఇభరాజవరద! నిన్నెంతఁ బిల్చినఁగాని - మాఱు పల్కవదేమి మౌనితనమొ?
మునిజనార్చిత! నిన్నుమ్రొక్కి వేఁడినఁగాని - కనులఁ బడవదేమి గడుసుఁదనమొ?
చాల దైన్యమునొంది చాటు జొచ్చినఁగాని - భాగ్య మియ్యవదేమి ప్రౌఢతనమొ?
స్థిరముగా నీ పాదసేవఁ జేసెద నన్న - దొరకఁ జాలవదేమి ధూర్తతనమొ?
 
తే. మోక్షదాయక! యిటువంటి మూర్ఖజనుని - కష్టపెట్టిన నీకేమి కడుపునిండు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
22
సీ. నీమీఁది కీర్తనల్‌ నిత్యగానముఁ జేసి - రమ్యమొందింప నారదుఁడఁగాను
సావధానముగ నీచరణ పంకజ సేవ - సలిపి మెప్పింపంగ శబరిఁగాను
బాల్యమప్పటి నుండి భక్తి నీయందునఁ - గలుగను బ్రహ్లాదఘనుఁడఁగాను
ఘనముగా నీమీఁద గ్రంథముల్‌ గల్పించి - వినుతిసేయను వ్యాసమునినిగాను
 
తే. సాధుఁడను మూర్ఖమతి మనుష్యాధముఁడను - హీనుఁడను జుమ్మి నీవు నన్నేలుకొనుము
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
23
సీ. అతిశయంబుగఁ గల్లలాడనేర్చితిఁగాని - పాటిగా సత్యముల్‌ పలుకనేర
సత్కార్య విఘ్నముల్‌ సలుప నేర్చితిఁగాని - యిష్ట మొందఁగ నిర్వహింపనేర
నొకరి సొమ్ముకు దోసిలొగ్గ నేర్చితిఁగాని - చెలువుగా ధర్మంబు సేయనేర
ధనము లియ్యంగ వద్దనఁగ నేర్చితిఁ గాని - శీఘ్ర మిచ్చెడునట్లు చెప్పనేరఁ
 
తే. బంకజాతాక్ష! నే నతిపాతకుఁడను - దప్పులన్నియు క్షమియింపఁ దండ్రి వీవె!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
24
సీ. ఉర్విలో నాయుష్యమున్న పర్యంతంబు - మాయ సంసారంబు మఱగి నరుఁడు
సకల పాపములైన సంగ్రహించును గాని - నిన్నుఁ జేరెడి యుక్తినేర్వలేఁడు
తుదకుఁ గాలునియొద్ద దూత లిద్దఱు వచ్చి - గుంజుక చనివారు గ్రుద్దుచుండ
హింస కోర్వఁగలేక యేడ్చి గంతులువేసి - దిక్కు లేదని నాల్గుదిశలు చూడఁ
 
తే. దన్ను విడిపింప వచ్చెడి ధన్యుఁడేడి - ముందు నీ దాసుఁడైయున్న ముక్తి గలుగు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
25
సీ. అధిక విద్యావంతులప్రయోజకులైరి - పూర్ణశుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతులమాట జనవిరోధంబాయె - వదరుఁబోతులమాట వాసికెక్కె
ధర్మవాదనపరుల్‌ దారిద్ర్యమొందిరి - పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి - దుష్టమానవులు వర్ధిష్ణులైరి
 
తే. పక్షివాహన! మావంటిభిక్షుకులకు - శక్తిలేదాయె నిఁక నీవెచాటు మాకు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
26
సీ. భుజబలంబునఁ బెద్దపులులఁ జంపఁగవచ్చు - పాము కంఠముఁ చేతఁబట్టవచ్చు
బ్రహ్మరాక్షసకోట్ల బాఱఁద్రోలఁగవచ్చు - మనుజుల రోగముల్‌ మాన్పవచ్చు
జిహ్వ కిష్టముగాని చేఁదు మ్రింగఁగవచ్చు - పదును ఖడ్గముచేత నదుమవచ్చుఁ
గష్టమొందుచు ముండ్లకంపలోఁ జొరవచ్చుఁ - దిట్టుఁబోతుల నోళ్లు కట్టవచ్చుఁ
 
తే. బుడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి - సజ్జనులఁ జేయలేఁడెంత చతురుఁడైన
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
27
సీ. అవనిలోఁ గల యాత్రలన్ని చేయఁగవచ్చు - ముఖ్యుఁడై నదులందు మునుఁగవచ్చు
ముక్కుపట్టుక సంధ్యమొనసి వార్వఁగవచ్చు - దిన్నఁగా జపమాలఁ ద్రిప్పవచ్చుఁ
వేదాల కర్థంబువిఱిచి చెప్పఁగవచ్చు - శ్రేష్ఠ క్రతువులెల్లఁ జేయవచ్చు
ధనము లక్షలు కోట్లు దానమియ్యఁగవచ్చు - నైష్ఠికాచారముల్‌ నడుపవచ్చు
 
తే. జిత్త మన్యస్థలంబునఁ జేరకుండ - నీ పదాంభోజములయందు నిలుపరాదు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
28
సీ. కర్ణయుగ్మమున నీకథలు సోఁకినఁజాలు - పెద్ద పోగుల జోళ్లుపెట్టినట్లు
చేతు లెత్తుచుఁ బూజసేయఁగల్గినఁజాలు - తోరంపు కడియాలు దొడిగినట్లు
మొనసి మస్తకముతోమ్రొక్కఁ గల్గినఁ జాలు - చెలువమైన తురాయిచెక్కినట్లు
గళము నొవ్వఁగ నిన్నుఁబలుకఁ గల్గినఁ జాలు - వింతగాఁ గంఠీలువేసినట్లు
 
తే. పూని నిన్నుఁ గొల్చుటే సర్వభూషణంబు - లితర భూషణముల నిచ్చగింపనేల?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
29
సీ. భువనరక్షక! నిన్నుఁబొగడనేరని నోరు - ప్రజకు గోచరమైన పాడుబొంద
సురవరార్చిత! నిన్నుఁజూడఁగోరని కనుల్‌ - జలము లోపల నెల్లిసరపుగుండ్లు
శ్రీరమాధిప! నీకుసేవఁజేయని మేను - కూలి కమ్ముడువోని కొలిమితిత్తి
వేడ్కతో నీ కథల్‌వినని కర్ణములైనఁ - గఠినశిలాదులఁగలుగు తొలలు
 
తే. పద్మలోచన! నీ మీఁద భక్తిలేని - మానవుఁడు రెండుపాదాల మహిషమయ్య
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
30
AndhraBharati AMdhra bhArati - shatakamulu - narasiMha shatakamu ( telugu andhra )