శతకములు నరసింహ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
సీ. గార్దభంబునకేల కస్తూరి తిలకంబు? - మర్కటంబునకేల మలయజంబు?
శార్దూలమునకేల శర్కరాపూపంబు? - సూకరంబునకేల చూతఫలము?
మార్జాలమునకేల మల్లెపువ్వులబంతి? - గుడ్లగూబకునేల కుండలములు?
మహిషానికేల నిర్మలమైన వస్త్రముల్‌? - బకసంతతికినేల పంజరంబు?
 
తే. ద్రోహచింతనఁ జేసెడు దుర్జనులకు - మధురమైన నీ నామమంత్రమేల?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
11
సీ. పసరంబు పంజైనఁ బసులకాపరి తప్పు - ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు
భార్య గయ్యాళైనఁ బ్రాణనాథుని తప్పు - తనయుఁడు దుష్టైన తండ్రి తప్పు
సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు - కూఁతురు చెడుగైన మాత తప్పు
అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు - దంతి దుష్టైన మామంతు తప్పు
 
తే. ఇట్టి తప్పు లెరుంగక యిచ్చవచ్చి - నటుల మెలఁగుదు రిప్పుడీ యవని జనులు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
12
సీ. కోతికి జలతారుకుళ్లాయి యేటికి? - విరజాజి పూదండ విధవ కేల?
ముక్కిడితొత్తుకు ముత్తెంపు నత్తేల? - నద్ద మేమిటికి జాత్యంధునకును?
మాచకమ్మకు నేల మౌక్తికహారముల్‌? - క్రూరచిత్తునకు సద్గోష్ఠు లేల?
ఱంకుఁబోతుకు నేల బింకంపు నిష్ఠలు? - వావి యేటికి దుష్టవర్తనునకు?
 
తే. మాట నిలుకడ సుంకరిమోటు కేల? - చెవిటివానికి సత్కథాశ్రవణ మేల?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
13
సీ. మాన్యంబులీయ సమర్థుఁ డొక్కఁడు లేఁడు - మాన్యముల్‌ చెఱుప సమర్థులంత
యెండిన యూళ్ల గోఁడెఱిఁగింపఁ డెవ్వఁడుఁ - బండిన యూళ్లకుఁ బ్రభువులంత
యితఁడు పేద యటంచు నెఱిఁగింపఁ డెవ్వఁడు - కలవారి సిరు లెన్నఁగలరు చాలఁ
దనయాలి చేష్టల తప్పెన్నఁ డెవ్వఁడు - బెఱకాంత ఱంకెన్నఁ బెద్దలంత
 
తే. యిట్టి దుష్టుల కధికారమిచ్చినట్టి - ప్రభువు తప్పులటంచును బలుకవలెను
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
14
సీ. తల్లిగర్భము నుండి ధనము తేఁ డెవ్వఁడు - వెళ్లిపోయెడినాఁడు వెంటరాదు
లక్షాధికారైన లవణ మన్నమె కాని - మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు
విత్త మార్జనఁ జేసి విఱ్ఱవీఁగుటె కాని - కూడఁబెట్టిన సొమ్ము తోడరాదు
పొందుగా మఱుఁగైన భూమిలోపలఁ బెట్టి - దానధర్మము లేక దాఁచి దాఁచి
 
తే. తుదకు దొంగల కిత్తురో దొరల కవునో - తేనె జుంటీఁగ లియ్యవా తెరువరులకు?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
15
సీ. లోకమం దెవఁడైన లోభి మానవుఁ డున్న - భిక్ష మర్థికిఁ జేతఁ బెట్టలేఁడు
తాను బెట్టకయున్న తగవు పుట్టదుగాని - యొరులు పెట్టఁగఁ జూచి యోర్వలేఁడు
దాత దగ్గఱఁ జేరి తన ముల్లె చెడినట్లు - జిహ్వతోఁ జాడీలు చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు - మేలు కల్గినఁ జాల మిడుకుచుండు
 
తే. శ్రీరమానాథ! యిటువంటిక్రూరునకును - భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
16
సీ. తనువులోఁ బ్రాణముల్‌ తర్లిపొయ్యెడి వేళ - నీ స్వరూపమును ధ్యానించునతఁడు
నిమిషమాత్రములోన నిన్నుఁ జేరును గాని - యమునిచేతికిఁ జిక్కి శ్రమలఁ బడఁడు
పరమసంతోషాన భజనఁ జేసెడివారి - పుణ్య మేమనవచ్చు భోగిశయన
మోక్షము నీ దాసముఖ్యుల కగుఁ గాని - నరక మెక్కడిదయ్య నళిననేత్ర
 
తే. కమలనాభ నీ మహిమలు గానలేని - తుచ్ఛులకు ముక్తి దొరకుట దుర్లభంబు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
17
సీ. నీలమేఘశ్యామ! నీవె తండ్రివి మాకు - కమలవాసిని మమ్ముఁగన్న తల్లి
నీ భక్త వరులంత నిజమైన బాంధవుల్‌ - నీ కటాక్షము మా కనేక ధనము
నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు - నీ సహాయము మాకు నిత్యసుఖము
నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య - నీ పద ధ్యానంబు నిత్యజపము
 
తే. తోయజాతాక్ష! నీ పాదతులసిదళము - రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
18
సీ. బ్రతికినన్నాళ్లు నీభజన తప్పను గాని - మరణకాలమునందు మఱతునేమొ
యావేళ యమదూతలాగ్రహంబున వచ్చి - ప్రాణముల్‌ పెకలించి పట్టునపుడు
కఫ వాత పైత్యముల్‌ గప్పఁగా భ్రమచేతఁ - గంప ముద్భవమంది కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా యంచుఁ - బిలుతునో శ్రమచేతఁ బిలువలేనో
 
తే. నాఁటి కిప్పుడె చేతు నీనామ భజన - తలఁచెదను జెవి నిడవయ్య! ధైర్యముగను
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
19
సీ. పాంచభౌతికము దుర్బలమైన కాయం బి - దెప్పుడో విడుచుట యెఱుకలేదు
శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి గాని - నమ్మరాదా మాట నెమ్మనమున
బాల్యమందో మంచిప్రాయమందో లేక - ముదిమియందో లేక ముసలియందో
యూరనో యడవినో యుదకమధ్యముననో - యెప్పుడో విడుచుట యే క్షణంబొ
 
తే. మరణమే నిశ్చయము బుద్ధిమంతుఁడైన - దేహమున్నంతలో మిమ్ముఁదెలియవలయు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
20
AndhraBharati AMdhra bhArati - shatakamulu - narasiMha shatakamu ( telugu andhra )