| శతకములు | నరసింహ శతకము |
|
| సీ. |
విద్య నేర్చితి నంచు విఱ్ఱవీఁగఁగ లేదు - భాగ్యవంతుఁడ నంచు బలుక లేదు ద్రవ్యవంతుఁడ నంచు దఱుచు నిక్కఁగ లేదు - నిరత దానములైన నెఱప లేదు పుత్రవంతుఁడ నంచు బొగడించుకొన లేదు - భృత్యవంతుఁడ నంచు బొంగలేదు శౌర్యవంతుఁడ నంచు సంతసించగ లేదు - కార్యవంతుఁడ నంచు గడపలేదు |
|
| తే. |
నలుగురికి మెప్పుగానైన నడువ లేదు - నళినదళనేత్ర! నిన్ను నే నమ్మినాను భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
61 |
| సీ. |
అతి లోభులను భిక్షమడుగ బోవుట రోఁత - తన ద్రవ్య మొకరింట దాఁచ రోఁత గుణహీనుఁడగు వాని కొలువుఁ గొల్చుట రోఁత - యొరుల పంచల క్రిందనుండ రోఁత భాగ్యవంతులతోఁడ బంతమాడుట రోఁత - గుఱిలేని బంధులఁ గూడ రోఁత ఆదాయములు లేక యప్పుదీయుట రోఁత - జార చోరులఁ గూడ చనుట రోఁత |
|
| తే. |
ఆదిలక్ష్మీశ! నీ బంటు నయితినయ్య - యింక నెడబాపు జన్మంబులెత్త రోఁత భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
62 |
| సీ. |
వెఱ్ఱివానికి నేల వేదాక్షరంబులు? - మోటువానికి మంచిపాట లేల? పసులకాఁపరి కేల పరతత్త్వబోధలు? విటకాని కేటికో విష్ణుకథలు? వదరు శుంఠల కేల వ్రాఁత పుస్తకములు? - తిరుఁగు ద్రిమ్మరి కేల దేవపూజ? ద్రవ్యలోభికి నేల దాతృత్వ గుణములు? - దొంగబంటుకు మంచిసంగ తేల? |
|
| తే. |
క్రూరజనులకు నీమీఁద గోరి కేల? - ద్రోహి పాపాత్మునకు దయాదుఃఖ మేల? భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
63 |
| సీ. |
నాతండ్రి! నాదాత! నాయిష్టదైవమా! - నన్ను మన్నన సేయు నారసింహ! దయయుంచు నామీఁద దప్పులన్ని క్షమించు - నిగమగోచర! నాకు నీవె దిక్కు నే దురాత్ముఁడ నంచు నీ మనంబునఁ గోప - గింపఁ బోకుము స్వామి! యెంతకైన ముక్తిదాయక నీకు మ్రొక్కినందుకు నన్నుఁ - గరుణించి రక్షించు కమలనాభ! |
|
| తే. |
దండిదొర వంచు నీ వెంటఁ దగిలినాను - నేఁడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
64 |
| సీ. |
వేమాఱు నీకథల్ వినుచు నుండెడివాఁడు - పరుల ముచ్చటమీఁద భ్రాంతిపడఁడు అగణితంబుగ నిన్నుఁ బొగడ నేర్చినవాఁడు - చెడ్డమాటలు నోటఁ జెప్పఁబోఁడు ఆసక్తిచేత నిన్ననుసరించెడివాఁడు - ధనమదాంధుల వెంటఁ దగులఁబోఁడు సంతసంబున నిన్ను స్మరణఁ జేసెడివాఁడు - చెలఁగి నీచులపేరుఁ దలఁపఁబోఁడు |
|
| తే. |
నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగఁ - గోరి చిల్లరవేల్పులఁ గొల్వఁబోఁఁడు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
65 |
| సీ. |
నే నెంత వేఁడిన నీకేల దయరాదు? - పలుమాఱు పిలిచినఁ బలుక వేమి? పలికిన నీ కున్న పద వేమి బోవు? నీ - మోమైనఁ బొడచూపవేమి నాకు? శరణుఁ జొచ్చినవాని సవరింపవలెఁ గాక - పరిహరించుట నీకు బిరుదు గాదు నీ దాసులను నీవు నిర్వహింపక యున్నఁ - బరు లెవ్వ రగుదురు పంకజాక్ష! |
|
| తే. |
దాత దైవంబు తల్లియుఁ దండ్రి వీవె - నమ్మియున్నాను నీ పాదనళినములను భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
66 |
| సీ. |
వేదముల్ చదివెడు విప్రవర్యుండైన - రణము సాధించెడు రాజులైన వర్తక కృషికుఁడౌ వైశ్యముఖ్యుండైనఁ - బరిచరించెడు శూద్రవర్యుఁడైన మెచ్చుఖడ్గముఁ బట్టిమెఱయు మ్లేచ్ఛుండైనఁ - బ్రజల కక్కఱపడు రజకుడైన చర్మ మమ్మెడు హీన చండాలనరుఁడైన - నీ మహీతలమందు నెవ్వఁడైన |
|
| తే. |
నిన్నుఁ గొనియాడుచుండెనా నిశ్చయముగ - వాఁడు మోక్షాధికారి యీ వసుధలోన భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
67 |
| సీ. |
సకలవిద్యలు నేర్చి సభ జయింపఁగవచ్చుఁ - శూరుఁడై రణమందుఁ బోరవచ్చు రాజరాజై పుట్టి రాజ్య మేలఁగవచ్చు - హేమ గోదానంబు లియ్యగవచ్చు గగనమం దున్న చుక్కల నెంచఁగావచ్చు - జీవరాశుల పేళ్లు చెప్పవచ్చు నష్టాంగయోగము లభ్యసింపఁగవచ్చు - మేఁక రీతిగ నాకు మెసవవచ్చు |
|
| తే. |
తామరస గర్భ! హర పురందరులకైన - నిన్ను వర్ణింపఁ దరమౌనె నీరజాక్ష! భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
68 |
| సీ. |
నరసింహ! నీవంటిదొరను సంపాదించి - సుమతి మానవుల నేఁ గొల్వఁజాల నెక్కు వైశ్వర్యంబు లియ్యలేకున్నను - బొట్టకు మాత్రము పోయరాదె? ఘనము గాదిది నీకు కరవునఁ బోషింపఁ - గష్ట మెంతటి స్వల్పకార్యమయ్య? పెట్టఁ జాలక యేల భిక్షమెత్తించెదవు - నన్ను బీదను జేసినా వదేమి? |
|
| తే. |
అమల! కమలాక్ష! నేనిట్లు శ్రమపడంగఁ - గన్నులకుఁ బండువై నీకుఁ గానఁబడునె? భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
69 |
| సీ. |
వనరుహనాభ! నీవంకఁ జేరితి నేను - గట్టిగా ననుఁ గావు కావు మనుచు వచ్చినందుకు వేగ వరము లియ్యకకాని - లేవఁబోయిన నిన్ను లేవనియ్యఁ గూర్చుండఁబెట్టి నీకొంగు గట్టిగఁ బట్టి - పుచ్చుకొందును జూడు భోగిశయన! యీవేళ నీ కడ్డమెవరు వచ్చినఁ గాని - వారికైనను లొంగి వడఁకఁబోను |
|
| తే. |
గోపగాఁడను నీవు నా గుణము తెలిసి - యిప్పుడే నన్ను రక్షించి యేలుకొమ్ము భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
70 |