| శతకములు | కృష్ణ శతకము |
|
| క. |
దండమయా విశ్వంభర దండమయా పుండరీక దళనేత్ర హరీ దండమయా కరుణానిధి దండమయా నీకు నెపుడు దండము కృష్ణా. |
91 |
| క. |
నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమారా నారాయణ నిను నమ్మితి నారాయణ నన్నుఁ బ్రోవు నగధర కృష్ణా. |
92 |
| క. |
తిరుమణి దురితవిదూరము తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందు\న్ తిరుమణిఁ బెట్టిన మనుజుఁడు పరమపవిత్రుండు భాగ్యవంతుడు కృష్ణా. |
93 |
| క. |
శ్రీలక్ష్మీనారాయణ వాలాయము నిన్నుఁ దలఁతు వందితచరణా ఏలుము నను నీ బంటుగఁ జాలఁగ నిను నమ్మినాను సరసుఁడ కృష్ణా. |
94 |
| క. |
శ్రీధర మాధవ యచ్యుత భూధర పురుహూతవినుత పురుషోత్తమ నీ పాదయుగళంబు నెప్పుడు మోదముతో నమ్మినాఁడ ముద్దుల కృష్ణా. |
95 |
| క. |
శిరమున రత్నకిరీటము కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్ ఉరమున వజ్రపుఁబతకము సిరినాయక యమరవినుత శ్రీహరి కృష్ణా. |
96 |
| క. |
అందెలు పాదములందును సుందరముగ నుంచినావు సొంపలరంగా మందరధర మునిసన్నుత నందుని వరపుత్ర నిన్ను నమ్మితిఁ గృష్ణా. |
97 |
| క. |
కందర్పకోటి సుందర మందరధర భానుతేజ మంజులదేహా సుందర విగ్రహ మునిగణ వందిత మిము దలఁతు భక్తవత్సల కృష్ణా. |
98 |
| క. |
దుర్మతిని మిగుల దుష్టపుఁ గర్మంబులఁ జేసినట్టి కష్టుండ నన్ను\న్ నిర్మలునిఁ జేయవలె ని ష్కర్ముఁడ నిన్ను నమ్మినాను సతతము కృష్ణా. |
99 |
| క. |
భారద్వాజసగోత్రుఁడ గారవమున గంగమాంబ కరుణాసుతుఁడ\న్ పేర నృసింహాహ్వయుఁడను శ్రీరమయుత నన్నుఁగావు సృష్టినిఁ గృష్ణా. |
100 |
| క. |
అనుదినము కృష్ణశతకము వినినఁ బఠించినను ముక్తి వేడుక గలుగు\న్ ధనధాన్యము గోగణములు తనయులు నభివృద్ధిఁ బొందు దద్దయుఁ గృష్ణా. |
101 |