| శతకములు | కృష్ణ శతకము |
|
| క. |
వడుగవునై మూఁడడుగుల నడిగితివౌ భళిర భళిర యఖిలజగంబుల్ తొడిగితివి నీదు మేనునఁ గడు చిత్రము నీ చరిత్ర ఘనుఁడవు కృష్ణా. |
41 |
| క. |
ఇరువదొకమాఱు నృపతుల శిరములు ఖండించితౌర చేగొడ్డంట\న్ ధరఁ గశ్యపునకు నిచ్చియుఁ బరఁగవె జమదగ్ని రామభద్రుడ కృష్ణా. |
42 |
| క. |
దశకంఠునిఁ బరిమార్చియు గుశలముతో సీతఁదెచ్చి కొనియు నయోధ్య\న్ విశదముగఁ గీర్తి నేలిన దశరథరామావతార ధన్యుఁడ కృష్ణా. |
43 |
| క. |
ఘనులగు ధేనుకముష్టిక దనుజులఁ జెండాడితౌర తగ భుజశక్తిన్ అనఘాత్మ రేవతీపతి యనఁగా బలరామమూర్తి వైతివి కృష్ణా. |
44 |
| క. |
త్రిపురాసుర భార్యల నతి నిపుణతతో వ్రతముచేత నిలిపితి కీర్తుల్ కపటపురాజవు బళిరే కృపగల బౌద్ధావతార ఘనుఁడవు కృష్ణా. |
45 |
| క. |
వలపుగల తేజి నెక్కియు నిలపై ధర్మంబు నిలుప హీనులఁ ద్రుంప\న్ కలియుగము తుదను వేడుక కలికివిగా నున్న లోకకర్తవు కృష్ణా. |
46 |
| క. |
వనజాక్ష భక్తవత్సల ఘనులగు త్రైమూర్తులందుఁ గరుణానిధివై కన నీ సద్గుణజాలము సనకాది మునీంద్రు లెన్నఁ జాలరు కృష్ణా. |
47 |
| క. |
అపరాధ సహస్రంబుల నపరిమితములైన యఘము లనిశము నేను\న్ గపటాత్ముఁడనై చేసితిఁ జపలుని ననుగావు శేషశాయివి కృష్ణా. |
48 |
| క. |
నరపశువ మూఢచిత్తుఁడ దురితారంభుఁడను మిగుల దోషగుఁడను నీ గుఱు తెఱుఁగ నెంతవాడఁను హరి నీవే ప్రాపు దాపు వౌదువు కృష్ణా. |
49 |
| క. |
పరనారీ ముఖపద్మము గుఱుతుగఁ గుచకుంభములను గొప్పును నడుము\న్ అరయంగనె మోహింతురు నిరతిని నిను భక్తిఁ గొల్వ నేరరు కృష్ణా. |
50 |