| శతకములు | కృష్ణ శతకము |
|
| క. |
పదునాలుగు భువనంబులు కుదురుగ నీకుక్షి నిల్పుకొను నేర్పరివై విదితంబుగ నాదేవకి యుదరములో నెట్టులొదిగి యుంటివి కృష్ణా. |
11 |
| క. |
అష్టమి రోహిణి ప్రొద్దున నష్టమగర్భమునఁ బుట్టి యాదేవకికిన్ దుష్టునిఁ గంసు వధింపవె సృష్టి ప్రతిపాలనంబు సేయఁగఁ గృష్ణా. |
12 |
| క. |
అల్ల జగన్నాథుకు వ్రే పల్లియ క్రీడార్థ మయ్యెఁ పరమాత్మునకున్ గొల్లసతి యా యశోదయుఁ దల్లియునై చన్నుగుడిపెఁ దనరఁగఁ కృష్ణా. |
13 |
| క. |
అందెలు గజ్జెలు మ్రోయఁగఁ జిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతి యాగోపిక ముందఱ నాడుదువు మిగుల మురియుచుఁ గృష్ణా. |
14 |
| క. |
హరిచందనంబు మేనునఁ గరమొప్పెడు హస్తములను గంకణ రవముల్ ఉరమున రత్నము మెఱయఁగఁ బరఁగితివౌ నీవు బాల ప్రాయము కృష్ణా. |
15 |
| క. |
పాణితలంబున వెన్నయు వేణీమూలంబునందు వెలయఁగఁ బింఛం బాణీముత్యము ముక్కున నాణెముగాఁదాల్చు లోక నాథుఁడ కృష్ణా. |
16 |
| క. |
మడుగుకుఁ జని కాళీయుని పడగలపై భరతశాస్త్ర పద్ధతి వెలయ\న్ గడువేడుకతో నాడెడు నడుగులు నా మదిని దలఁతు నచ్యుత కృష్ణా. |
17 |
| క. |
బృందావనమున బ్రహ్మా నందార్భకమూర్తి వేణు నాదము నీ వా మందార మూలమున గో విందా పూరింతువౌర వేడుకఁ గృష్ణా. |
18 |
| క. |
వారిజ నేత్రలు యమునా వారిని జలకంబులాడ వచ్చిన నీ వా చీరలు మ్రుచ్చిలి యిచ్చితి నేరుపురా యదియు నీకు నీతియె కృష్ణా. |
19 |
| క. |
దేవేంద్రుఁ డలుకతోడను వావిరిగా ఱాళ్ళవాన వడిఁ గురియింప\న్ గోవర్ధనగిరి యెత్తితి గోవుల గోపకులఁ గాచు కొఱకై కృష్ణా. |
20 |