| శతకములు | దేవకీనందన శతకము |
|
| మ. |
పటుబాహాబలసత్త్వవైఖరుల దిక్పాలుల్ బ్రశంసించు నం తటివాఁడయ్యుఁ ద్రిశంకునన్దనుఁడు కాంతారత్నము\న్ విక్రయిం చుటలు\న్ నీమహిమంబుచేతఁ గద యిట్లాశ్చర్యమేమర్త్యులెం తటివారైనను నేమిచేసెదరు కృష్ణా దేవకీనందనా. |
61 |
| మ. |
తన శౌర్యోన్నతి యుగ్రసాధనముగా తాళాయణీశు\న్ శివు\న్ దనర\న్ మెచ్చఁగఁజేసి లోకముజయస్తంభంబు గావించియు\న్ మును దాఁ జేసినకర్మవార్ధిఘనమై ముంపం గడుంబాలుచేఁ జనఁడే దుర్మతి విక్రమార్కుఁ డిల కృష్ణా దేవకీనందనా. |
62 |
| మ. |
తెగువన్నిర్జరుల\న్ జయించుచు మదోద్రేకంబున\న్ గానలో మృగనేత్రి\న్ ధరణీతనూజ నసురు ల్మెచ్చంగఁ దాఁదెచ్చి నె వ్వగలం బెట్టి విధిప్రయత్నమున నిర్వంశంబుగా రాముచే జగతిం గూలఁడె యాదశాననుఁడు కృష్ణా దేవకీనందనా. |
63 |
| మ. |
పరనారీహరణం బొనర్చినమహాపాపాత్ముఁ డారావణుం డరయ న్నాతని తమ్ముఁడైన దనుజుం డత్యంతసద్భక్తితో శరణన్నం దయఁజూచి యగ్రజునిరాజ్యం బిచ్చి రక్షింప వా సరణి\న్ నీపదభక్తియే ఘనము కృష్ణా దేవకీనందనా. |
64 |
| మ. |
వెఱచైన\న్ మఱచైనఁ గార్యముతఱి\న్ వేసారుచున్నైన యా దరమొప్పైనను మాయనైన నృపతుల్ దండింపఁగా నైనను\న్ పరిహాసంబుననైన మిమ్మునుడువ\న్ బ్రాపించు పుణ్యాత్మకుల్ నరకావాసముఁ జేరరా ఘనులు కృష్ణా దేవకీనందనా. |
65 |
| మ. |
నొసట\న్ గన్నులఁగట్టి వేల్పుసతి నెంతోభక్తితోఁ జూఁడఁగా నిసుమంతైన భయంబులేక తలమీఁ దెక్క న్నదట్లుండనీ వసుధ\న్ భర్తను స్త్రీల కెవ్వరయిన\న్ వశ్యాత్ములై మట్టులే కస మియ్యం దల కెక్క కుండుదురె కృష్ణా దేవకీనందనా. |
66 |
| మ. |
కరితో దోమ మృగేంద్రుతో నరుఁడు బంగారంబుతోఁ గంచు భా స్కరుతో మిణ్గురుబుర్వు కల్పకముతోఁ గానుంగు రత్నాకరే శ్వరుతో నూషరపల్వలంబు నురుశేషస్వామితో మిడ్తయు\న్ సరియైన\న్ సరి మీకు దైవములు కృష్ణా దేవకీనందనా. |
67 |
| మ. |
నుతలోకప్రతిసృష్ట నిర్మలకళానూత్నాబ్జగర్భు\న్ మహా ప్రతిభు\న్ గౌశికుఁ గుక్కమాంసము భుజింపం జేసి మాలాతని\న్ బతిమాలించవె చండచండతరశుంభత్వంబు పాల్మాలునా శతఁ బొందించవె దేవదేవమయ కృష్ణా దేవకీనందనా. |
68 |
| మ. |
వరభోగాధ్వరదానధర్మగుణముల్ వర్జించి తృష్ణారతి\న్ నరులత్యంతము మూఢలోభమతులై నారీరతిం గూర్పఁగాఁ దరముం గాని ధనంబు తస్కరవరు\న్ ధాత్రీశులుం జేకొన\న్ సరఘవ్రాతము జేర్చుతేనెక్రియఁ గృష్ణా దేవకీనందనా. |
69 |
| మ. |
ఖలవాక్యప్రతిపాలకుల్ పరధనాకాంక్షుల్ పరస్త్రీరతుల్ కులధర్మౌఘనిబద్ధచిత్తులు నయాకూపారపారంగతుల్ కలుషుల్ రాజులు వారిసేవకులకెల్లం గల్గు నత్యంతని శ్చలసౌఖ్యంబులు నిన్భజింపఁగను కృష్ణా దేవకీనందనా. |
70 |