| శతకములు | దేవకీనందన శతకము |
|
| శా. |
చన్నే నిన్నును బాలుఁగాఁ దలఁచి యిచ్చం బూతనాకాంత దాఁ జన్నుల్నిండఁగఁ జేఁదుఁ బూసికొని యా చన్బాలు నీకిచ్చినం జన్నుంబాలకు లోనుగాక యసుర\న్ సాధించి యాయింతికి\న్ సన్న\న్ ముక్తి యొసంగితీవు భళి కృష్ణా దేవకీనందనా. |
11 |
| మ. |
విలసిల్ల\న్ పదియాఱువేలసతుల\న్ వీక్షించి వారిండ్ల లో పల వర్తించుచునుండి వీటఁ గల గోపస్త్రీలనెల్ల\న్ గడుం బలిమి\న్ బట్టి రమించినాఁడవు భళీ ప్రాజ్ఞుండ వీవౌదు భూ స్థలి నీవేకద కొంటెదేవరవు కృష్ణా దేవకీనందనా. |
12 |
| మ. |
పొలుపొంద\న్ నడిరేయిఁ గుక్కుట రవంబుల్ చూపి గోపాలకా వళి విభ్రాంతులఁ జేసి మందలకునై వారేఁగఁ దత్కామినీ కలనాయత్నము తామ్రచూడగతుల\న్ గావించి నీకీర్తి ర చ్చల కెక్కెం గడుగొయ్యదేవరవు కృష్ణా దేవకీనందనా. |
13 |
| మ. |
అనిరుద్ధాచ్యుత యీశకేశవ ముకుందాధోక్షజోపేంద్రవా మన దామోదర చక్రపాణి హలి రామా శౌరి శార్ఙ్గీ జనా ర్దన పీతాంబర భక్తవత్సల నమో దైత్యారి వైకుంఠవా స నృసింహాంబుజనాభ ప్రోవు ననుఁ గృష్ణా దేవకీనందనా. |
14 |
| మ. |
ఇల గోవర్ధన మెత్తితీ వనుచు బ్రహ్మేంద్రాదు లెంతో నినుం బలుమారున్నుతులొప్పఁ జేసెదరు పద్మాక్షా కుచాగ్రంబునం జులకన్నెత్తిన రాధనెన్న రిదిగో సొంపొంద సత్కీర్తి ని శ్చలపుణ్యంబునఁ గాక చొప్పడునె కృష్ణా దేవకీనందనా. |
15 |
| శా. |
మౌళిం బింఛపుదండ యొప్పుగ నటింపంగౌను శృంగారపు\న్ శ్రీ లెంచంగను పిల్లఁగ్రోవి రవము\న్ జేకోలము\న్ జెక్కుచు\న్ గేల\న్ మెచ్చొనరింపఁ గోపకులతోఁ గ్రీడారసస్ఫూర్తి నీ వాలం గాచువిధంబు నేఁ దలఁతుఁ గృష్ణా దేవకీనందనా. |
16 |
| శా. |
పెచ్చుల్ ప్రేలుచుఁ బిల్లఁగ్రోవి రవము\న్ బెంపొందఁగాఁ జొక్కుచు\న్ నిచ్చల్ నిన్ను భజింప గోపగణము\న్ నిత్యోత్సవక్రీడమై నెచ్చల్ మచ్చిక ముచ్చటచ్చుపడఁగా హెచ్చించి కీర్తించి నీ సచ్చారిత్రము విన్నఁ బుణ్యమగుఁ గృష్ణా దేవకీనందనా. |
17 |
| మ. |
లలనాకుంచితవేణియుం దడవ మొల్లల్ జాఱ కస్తూరికా తిలకంబుం గఱఁగంగ లేఁతనగవు\న్ దీపింప నెమ్మోమున\న్ దళుకుల్ చూపెడిచూపు లుల్లసిల నానారీతుల\న్ వేణుపు ష్కలనాదంబులపెంపుఁ జూపుదువు కృష్ణా దేవకీనందనా. |
18 |
| మ. |
కలకాంచీమణికింకిణీమధురనిక్వాణంబు మంజీరమం జులరావంబును గొంతకొంత వినవచ్చెన్ బట్ట లేనైతి నం కిలి నిద్రించుట మోసపుచ్చె హితవాగ్గేయుండు నేఁడంచు ని చ్చలు మీశౌర్యము లెంచు గోపతతి కృష్ణా దేవకీనందనా. |
19 |
| మ. |
కలనైన\న్ నగియైనఁ గోప మెసఁగంగా నైన మీనామ ని ర్మలవర్ణద్వయ మెవ్వరేఁదలఁచినం బాపౌఘముల్వాయును జ్జ్వలభాన్వప్రతిమానచండకిరణవ్రాతాహతిం జీఁకటుల్ చలనం బంది తొలంగుచందమునఁ గృష్ణా దేవకీనందనా. |
20 |