| శతకములు | భాస్కర శతకము |
|
| ఉ. |
వట్టుచుఁ దండ్రి యత్యధమ వర్తనుఁడైననుగాని వానికిం బుట్టిన పుత్త్రకుండు తన పుణ్యవశంబున దొడ్డధన్యుఁడౌ; నెట్టన మఱ్ఱివిత్తు మునుపెంతయుఁ గొంచెము దానఁబుట్టునా చెట్టు మహోన్నతత్వమును జెందదె శాఖలనిండి భాస్కరా! |
91 |
| చ. |
వలనుగఁ గానలందుఁ బ్రతివర్షమునం బులి నాలుగైదు పి ల్లలఁ గను దూడనొక్కటి నిలం గను ధేనువు రెండుమూఁడు నేఁ డుల కటులైన బెబ్బులి కుటుంబము లల్పములాయె నాలమం దలు గడువృద్ధిఁ జెందవె యధర్మము ధర్మముఁ దెల్ప భాస్కరా! |
92 |
| చ. |
వలవదు క్రూరసంగతి యవశ్య మొకప్పుడు సేయఁబడ్డచోఁ గొలదియెఁ గాని యెక్కువలు గూడవు; తమ్ములపాకు లోపలం గలసిన సున్నమించుకయ కాక మఱించుక యెక్కువైనచో నలుగడఁ జుఱ్ఱుచుఱ్ఱుమని నాలుక పొక్కక యున్నె భాస్కరా! |
93 |
| ఉ. |
వానికి విద్యచేత సిరివచ్చె నటంచును విద్య నేర్వఁగాఁ బూనినఁ బూనుఁగాక తన పుణ్యము చాలక భాగ్యరేఖకుం బూనఁగ నెవ్వఁడోపు; సరిపో చెవి పెంచును గాకదృష్టతా హీనుఁడు కర్ణభూషణము లెట్లు గడింపఁగనోపు? భాస్కరా! |
94 |
| ఉ. |
సంతత పుణ్యశాలి నొక జాడను సంపద వాసిపోయి తా నంతటఁ బోక నెట్టుకొని యప్పటియట్ల వసించియుండు; మా సాంతమునందుఁ జందురుని నన్నికళల్ పెడఁబాసి పోయినం గాంతి వహింపఁడటోటు? తిరుగంబడి దేహమునిండ భాస్కరా! |
95 |
| చ. |
సకలజన ప్రియత్వము నిజంబుగఁ గల్గిన పుణ్యశాలి కొ క్కొకయెడ నాపదైనఁ దడవుండదు వేగమె పాసిపోవుగా; యకలుషమూర్తియైన యమృతాంశుఁడు రాహువు తన్ను మ్రింగినం డకటక మాని యుండఁడె! దృఢస్థితి నెప్పటియట్ల భాస్కరా! |
96 |
| చ. |
సన్నుత కార్యదక్షుఁడొక చాయ నిజప్రభ యప్రకాశమై యున్నపుడైన లోకులకు నొండక మేలొనరించు సత్త్వసం పన్నుఁడు భీముఁడా ద్విజుల ప్రాణము కాఁవడె యేకచక్రమం దెన్నికగా బకాసురుని నేపున రూపడఁగించి భాస్కరా! |
97 |
| చ. |
సరసగుణ ప్రపూర్ణునకు సన్నపు దుర్గుణ మొక్కవేళ యం దొరసిన నిటు నీకుఁ దగునో యని చెప్పిన మాన నేర్చుగా బురద యొకించుకంత తముఁ బొందిన వేళలఁ జిల్లవిత్తుపై నొరసిన నిర్మలత్వమున నుండవె నీరములెల్ల భాస్కరా! |
98 |
| చ. |
సరసదయాగుణంబుగల జాణ మహిం గడు నొచ్చియుం దఱచుగ వాని కాసపడి దాయఁగ వత్తురు లోకులెట్లనం జెఱకురసంబు గానుఁగను జిప్పిలిపోయిన మీదఁ బిప్పియై ధరఁ బడియున్నఁ జేరవె ముదంబునఁ జీమలు పెక్కు భాస్కరా! |
99 |
| ఉ. |
సారవివేకవర్తనల సన్నుతికెక్కిన వారిలోపలం జేరినయంత మూఢులకుఁ జేపడ దానడ; యెట్టులన్నఁ గా సారములోన హంసముల సంగతి నుండెడి కొంగపిట్ట కే తీరునఁ గల్గ నేర్చును దదీయగతుల్ దలపోయ భాస్కరా! |
100 |