| శతకములు | భాస్కర శతకము |
|
| ఉ. |
కాని ప్రయోజనంబు సమకట్టదు తా భువి నెంత విద్యవాఁ డైనను దొడ్డరాజు కొడుకైన నదెట్లు; మహేశుపట్టి వి ద్యానిధి సర్వవిద్యలకు, దానె గురుండు వినాయకుండు దా నేనుఁగు రీతి నుండియు నదేమిటి కాడఁడు పెండ్లి? భాస్కరా! |
31 |
| ఉ. |
కామిత వస్తుసంపదలు గల్గు ఫలం బొరు లాసపడ్డచో నేమియుఁ బెట్టఁడేని సిరి యేటికి నిష్ఫలమున్నఁ బోయినన్ బ్రామికపడ్డ; లోకులకుఁ బండగ నే మది యెండి పోవఁగా నేమి ఫలంబు చేఁదు విడదెన్నటికైన ముసిండి భాస్కరా! |
32 |
| ఉ. |
కారణమైన కర్మములు కాక దిగంబడ వెన్ని గొందులం దూఱిన నెంతవారలకుఁ; దొల్లి పరీక్షితు శాపభీతుఁడై వారిధి నొప్పు నుప్పరిగ పైఁ బదిలంబుగ దాఁగి యుండినం గ్రూరభుజంగ దంతహతిఁ గూలడె లోకులెఱుంగ భాస్కరా! |
33 |
| చ. |
కులమున నక్కడక్కడ నకుంఠిత ధార్మికుఁడొక్కఁడొక్కఁడే కలిగెడుఁగాక పెందఱుచు గల్గగ నేరరు; చెట్టు చెట్టునన్ గలుగఁగ నేర్చునే? గొడుగు కామలు చూడఁగ నాడనాడ నిం పలరఁగ నొక్కటొక్కటి నయంబునఁ జేకురుఁగాక భాస్కరా! |
34 |
| ఉ. |
క్రూర మనస్కులౌ పతులఁ గొల్చి వసించిన మంచివారికిన్ వారి గుణంబె పట్టి, చెడు వర్తన వాటిలు; మాధురీజలో దారలు గౌతమీముఖమహానదు లంబుధిఁ గూడినంతనే క్షారముఁ జెందవే మొదలి కట్టడ లన్నియుఁ దప్పి భాస్కరా! |
35 |
| ఉ. |
గిట్టుట కేడఁ గట్టడ లిఖించిన నచ్చటఁ గాని యెండుచోఁ బుట్టదు చావు; జానువుల పున్కల నూడిచి కాశిఁ జావఁగా ల్గట్టిన శూద్రకున్ భ్రమలఁ గప్పుచుఁ దద్విధి గుఱ్ఱమౌచు నా పట్టునఁ గొంచు మఱ్ఱికడఁ బ్రాణము దీసెగదయ్య! భాస్కరా! |
36 |
| చ. |
ఘనబలసత్త్వ మచ్చుపడఁ గల్గిన వానికి హాని లేనిచోఁ దనదగు సత్త్వమే చెరచుఁ దన్ను; నదెట్లన నీరు మిక్కిలిన్ గినుక వసించినన్ జెఱువు కట్టకు సత్వము చాలకున్నచోఁ గనుమలు పెట్టి నట్టనడి గండి తెగంబడకున్నె భాస్కరా! |
37 |
| చ. |
ఘనుఁడగు నట్టివాఁడు నిజకార్య సముద్ధరణార్థమై మహిం బనివడి యల్పమానవునిఁ బ్రార్థనఁ జేయుట తప్పుగాదుగా; యనఘతఁ గృష్ణజన్మమున నా వసుదేవుఁడు మీఁద టెత్తుగాఁ గనుఁగొని గాలిగాని కడ కాళ్ళకు మ్రొక్కఁడె నాఁడు భాస్కరా! |
38 |
| చ. |
ఘనుఁడొకవేళ గీడ్పడిన గ్రమ్మఱ నాతని లేమిఁ బాపఁగా గనుగొన నొక్క సత్ప్రభువుఁగాక నరాధము లోపరెందరుం; బెనుఁ జెఱువెండినట్టి తఱిఁ బెల్లున మేఘుఁడు గాక నీటితోఁ దనుపఁ దుషారముల్ శతశతంబులు చాలునటయ్య భాస్కరా! |
39 |
| ఉ. |
చంద్రకళావతంసు కృపచాలనినాఁడు మహాత్ముఁడైనఁ దా సాంద్రవిభూతిఁ బాసి యొక జాతివిహీనునిఁ గొల్చియుంట యో గీంద్ర నుతాంఘ్రి పద్మ మతిహీనత నొందుట కాదుగా; హరి శ్చంద్రుఁడు వీరబాహుని నిజంబుగఁ గొల్వఁడె నాఁడు భాస్కరా! |
40 |