| శతకములు | భాస్కర శతకము |
|
| ఉ. |
చక్కఁదలంపఁగా విధివశంబున నల్పుని చేతనైనఁ దా; జిక్కి యవస్థలం బొరలుఁ జెప్పఁగరాని మహాబలాఢ్యుఁడున్ మిక్కిలి సత్త్వ సంపదల మీఱిన గంధగజంబు మావటీఁ డెక్కి యదల్చి కొట్టి కుదియించిన నుండదె యోర్చి భాస్కరా! |
41 |
| చ. |
చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం; బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం పొదవెడు నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా! |
42 |
| ఉ. |
చాలఁ బవిత్రవంశమున సంజనితుండగునేని యెట్టి దు శ్శీలునినైనఁ దత్కుల విశేషముచే నొక పుణ్యుఁడెంతయుం దాలిమి నుద్ధరించును; సుధానిధిఁ బుట్టగఁగాదె శంభుఁడా హాలాహలానలంబు గళమందు ధరించుట పూని భాస్కరా! |
43 |
| ఉ. |
చేరి బలాధిపుం డెరిఁగి చెప్పిన కార్యము చేయకుండినన్ బారము ముట్టలేఁడొక నెపంబున దాఁజెడు నెట్టి ధన్యుఁడున్ బోరక పాండుపుత్రులకు భూస్థలిభాగము పెట్టుమన్న కం సారిని గాకుచేసి చెడఁడాయెనె కౌరవభర్త భాస్కరా! |
44 |
| ఉ. |
చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పునఁ గప్పిపుచ్చి తా మూసిన యంతటన్ బయలు ముట్టక యుండ దదెట్లు; రాగిపైఁ బూసిన బంగరుం జెదరిపోవఁ గడంగిన నాఁడు నాటికిన్ దాసిన రాగి గానఁబడ దా జనులెల్ల రెఱుంగ భాస్కరా! |
45 |
| చ. |
తగిలి మదంబుచే నెదిరిఁ దన్ను నెఱుంగక దొడ్డవానితో బగఁగొని పోరుటెల్ల నతిపామరుడై చెడుటింతెగాక తా నెగడి జయింపనేరఁడది నిక్కము తప్పదు; ధాత్రిలోపలన్ దెగి యొక కొండతో దగరు ఢీకొని తాఁకిన నేమి భాస్కరా! |
46 |
| చ. |
తడవగ రాదు దుష్టగుణుఁ దత్వ మెఱుంగక యెవ్వరైన నా చెడుగుణ మిట్లు వల్వదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుఁడై కడుఁ దెఁగఁ జూచుఁగా; మఱుగఁ గాగిన తైలము నీటిబొట్టుపై బడునెడ నాక్షణంబెగసి భగ్గున మండక యున్నె భాస్కరా! |
47 |
| చ. |
తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తి గోరు నా ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే లనుకొని పూను; శేషుఁడు సహస్ర ముఖంబుల గాలి గ్రోలి తా ననిశము మోవఁడే మఱి మహాభరమైన ధరిత్రి భాస్కరా! |
48 |
| చ. |
తనకు నదృష్టరేఖ విశదంబుగఁ గల్గిన గాని లేనిచో జనునకు నెయ్యెడన్ బరుల సంపదవల్ల ఫలంబు లేదుగా; కనుగవ లెస్సఁగా దెలివి గల్గిన వారికి గాక గ్రుడ్డికిన్ కనఁబడు నెట్లు వెన్నెలలుఁ గాయగ నందొక రూపు భాస్కరా! |
49 |
| ఉ. |
తాలిమితోడుతం దగవు దప్పక నేర్పరి యొప్పుదప్పులం బాలన సేయఁ గాకట నుపాయ విహీనుఁడు సేయనేర్చునే? పాలను నీరు వేఱు పరుపంగ మరాళ మెఱుంగుఁగాని మా ర్జాలమెఱుంగునే తదురు చారురసజ్ఞత బూన భాస్కరా! |
50 |