| నాటకములు | వరవిక్రయము (1923) | కాళ్లకూరి నారాయణరావు |
| తృతీయాంకము - రెండవ రంగము. (ప్రదేశము: లింగరాజుగారి కచేరిచావడి.) (ప్రవేశము: పురుషోత్తమరావుగారు, లింగరాజుగారు, బసవరాజు, పేరయ్య, వీరయ్య - చాపలపైఁ గూరుచుండి.) | |||
| లింగ:- | విన్నారా?మున్నంగివారికిని, మాకును మూడుతరములనుండి సంబంధ మవిచ్ఛిన్నముగా సాగుచున్నది. మూర్తిరాజు పంతులుగారా సంగతు లన్నియు నెత్తుకొని మూరెఁ డుత్తరము వ్రాసినారు. అందుచేత నింతదూర మాలోచింపవలసి వచ్చింది. | ||
| వీర:- | మూడు తరాలనాటి సంబంధ మొకటేనా? మూడువేల రూపాయల కట్నమో? | ||
| పేర:- | వీరయ్యా! నీగొడవ మావిపరీతంగా వుందే! మూడువేలు మూడువేలని యిక్కడికి ముప్ఫయిసార్లన్నావు. ముష్టి మూడువేలు మీరేకాని మే మివ్వలే మనుకున్నావా? లింగరాజుగారు! ఆమొత్తం మేమే యిస్తాము. మాకింద ఖాయం! | ||
| వీర:- | అదేమన్నమాట? మీరధికంగా అన్న దేముంది? | ||
| పురు:- | అట్లయిన నింకొక యైదువంద లధికముగా నిచ్చెదము. | ||
| వీర:- | మా పంతులుగారు మఱి యైదువందలు. | ||
| పేర:- | వొయ్యోయ్! వొద్దుసుమా వొద్దు! మా పంతులుగారి సంగతి తెలియక మాజోరుగా వస్తున్నావు! మాట దక్కదుసుమా. | ||
| వీర:- | పేరయ్యా! నీ బెదిరింపులకు నేను జడిసేవాణ్ణి కాను! మా పంతులుగారు పెట్టమన్న మొత్తంవఱకూ పెట్టిమఱీ తీఱతాను. | ||
| పురు:- | (రోషముతో) సరే కానిమ్ము నాలుగువేల నాలుగువందలు. | ||
| వీర:- | అయిదువందలు. | ||
| పురు:- | ఆఱు. రా! యెంతవఱకు రాగలవో రా! | ||
| వీర:- | రాక విడిచిపెడతానా? యేడువందలు. | ||
| పురు:- | ఎనిమిది. | ||
| బస:- | (తనలో) బాగు బాగు! ఫార్సులాగునే యున్నదే!
| ||
| లింగ:- | వీరయ్యా! వీరిక్రింద ఖాయపరుప వచ్చునా? | ||
| వీర:- | అప్పుడేనా? అయిదువేలు! | ||
| పేర:- | (లేచి) బాబూ! యీబేరం మనకు కుదిరేదికాదు లేవండి! | ||
| పురు:- | అయ్యా! సెలవు తీసుకొను మనెదరా? | ||
| లింగ:- | సందర్భము లన్నియుఁ దమరు స్వయముగాఁ జిత్తగించుచు నన్ను నెపపెట్టుట న్యాయమా? | ||
| పురు:- | సరే మీచిత్తము! (అని లేచి పేరయ్యతో బైట కేగును.) | ||
| వీర:- | కొంపతీసి, బేరం గోవిందా కొట్టదుగద? | ||
| లింగ:- | వెఱ్ఱివాఁడా! పేరయ్య అంత పెయ్యమ్మ యనుకొంటివా? | ||
| వీర:- | నన్ను మెచ్చుకో రేం? నాపాఠం నే నెల్లా వప్పగించాను? | ||
| లింగ:- | నిత్యముఁ గోర్టులలో బ్రతుకు ముండకొడుకవు, నీకిది లెక్కా? (అని యేదియో వ్రాయుచున్నట్లు నటించును.) | ||
| బస:- | (తనలో) వీరి ప్రసంగమునుబట్టి వీరేదియో కుట్రసాగించునట్లు కనఁబడుచున్నది. వీరయ్య ఫాల్సు పాటగాడై యుండును. | ||
| పేర:- | (బయటను) పంతులుగారు బహుదూరం వెళ్ళారు. ఇంతదూరం వెళ్ళడం నాకిష్టంలేదు. వెళ్ళక చేసేదీ కనపడలేదు. ఆ యేల్నాటి శనిముండాకొడుఁకు లేకపోతే యెంచక్క ఫయసలయ్యేది! చెరపడానికి చేటపెయ్యచాలును! నిజానికి నిలివెడు ధన మిచ్చినా యీపాటి పిల్లవాఁడు మాత్రం యిక సందర్భపడడు. | ||
| పురు:- | పోనిం డింకను రవంత దూరము పోయి చూతమా? | ||
| పేర:- | పోవుటకేం పోవచ్చును. ఆ సులువు బలుపు లాలోచించుకో వలసినవారు మీరు. అమ్మగారితో ఆలోచింతా మంటే- అవకాశంలేదు. మనం మళ్ళీ వచ్చేసరి కీముండాకొడుకు మంగళం పాడేస్తాడు. | ||
| పురు:- | అనవసరమగు నాలస్యమెకాని అది మాత్ర మేమి చెప్పఁగలదు? ఇంకొకమాట యనిచూతము రండు. | ||
| పేర:- | అయితే, వొకపని చెయ్యండి- ఆవెధవతో వేలంపాట నాకిష్టం లేదు, ఆఖరుమా టని యింకో అయిదువంద లమాంతంగా పెట్టండి, దానితో దిమ్మ తిరిగిందా తిరుగుతుంది. తిరక్కపోతే, తిన్నగా యింటికి చక్కాపోదాం, ఏమి శలవు? | ||
| పురు:- | సరే రండు. (అని పేరయ్యతో మరల లోపలికేగి) లింగరాజుగారు! మఱియొకమాట యని పోవుదమని మఱల వచ్చినాను. ఇంకొక యైదువంద లిచ్చెదము. ఇష్టమున్న మాక్రింద స్థిరపఱుపుడు- లేదా, యింతటితో మాకు సెలవు. | ||
| లింగ:- | మూర్తిరాజుగారి క్రింద స్థిరపఱిచిన ట్టుత్తరము వ్రాయుటకు మొదలుపెట్టినానే! సరే సమాప్తి కాలేదు. కనుక దోషములేదు. ఏమి వీరయ్యా! వీరిక్రింద స్థిరపఱుప వచ్చునా? | ||
| వీర:- | వారు నాకిచ్చిన వర్దీ యెంతవఱకో అంతవఱకూ పాడాను. టిల్లిగ్రాఫిచ్చి తిరిగీ ఆర్డరు తెప్పించుకునేవఱకూ ఆగండి. | ||
| లింగ:- | అదేమన్నమాట! అయిదునిముషము లాగను. పెద్దమనుష్యుల కడ పేచీలు పనికిరావు! అయ్యా తమక్రింద ఖాయము. | ||
| పేర:- | తథాస్తు! పంతులుగారూ! తమవద్ద పదిరూపాయ లుంటే ప్రస్తుతము బజానాక్రింద జమకట్టించండీ! | ||
| పురు:- | (రూపాయలు తీసి యిచ్చును.) | ||
| పేర:- | తమరు కాస్త రశీదుముక్క వ్రాసి యిప్పించండి. | ||
| లింగ:- | అభ్యంతర మేమీ? (అని రసీదు వ్రాసి చదువును.)
చాలునా? | ||
| పేర:- | చాలు బాబూ! చాలు! మచ్చుకోసం దాచిపెట్టుకో వలసిన మతలబు! (అని రశీదు తీసికొని పురుషోత్తమరావుగారి కిచ్చును.) | ||
| పురు:- | బావగారూ! మాకిఁక సెలవా? | ||
| లింగ:- | చిత్తము. చిత్తము. తాతగారు పిల్లపేర వ్రాసియిచ్చిన దస్తావే జొకసారి పంపెదరా? | ||
| పురు:- | అభ్యంతరమేమీ? అట్లే పంపెదను. | ||
| (తెరపడును.) ఇది తృతీయాంకము. | |||