| నాటకములు | వరవిక్రయము (1923) | కాళ్లకూరి నారాయణరావు |
| తృతీయాంకము - మొదటి రంగము (ప్రదేశము: లింగరాజుగారి పడక గది.) | |||||||||
| సుభ:- | (చదువుకొనుచుఁ బ్రవేశించి, చటుక్కునఁ బుస్తకము మూసి) సెబాసు! వివాహమన్న నీ విమలావిజయులదే వివాహము. సమాన వయోరూప సంపత్తిలేని దాంపత్య మేమిదాంపత్యము?
ప్రాయ ముడిగిన ప్రారబ్ధమునకు దోడు, పిసినిగొట్టుపీనుఁగుఁ గూడ నగుచో నిఁకఁ జెప్పవలసిన దేమున్నది! నాకుఁ బట్టిన యవస్థయే పట్టును! భగవంతుఁడా! తండ్రీ! నా భర్తవంటి భర్తను మాత్రము పగవారికైనఁ బ్రసాదింపకుము!
ఇంతటితోఁ దీఱినదా!
ఇఁక సంసార సందర్భములు సరేసరి!
| ||||||||
| లింగ:- | (తెరలో) మా వన్నెల విసనకఱ్ఱ యేమి చేయుచున్నది? | ||||||||
| సుభ:- | ఏమి చేయుచున్నదా? ఉసూరుమని యేడ్చుచున్నది! | ||||||||
| లింగ:- | (ప్రవేశించి) ఓసీ! యెప్పుడు చూచిన నెందులకో కొఱకొఱ లాడుచునే యుందువు. సంతోషముగా నుండు సమయ మెప్పుడే? | ||||||||
| సుభ:- | చచ్చిన మఱునాఁడు! | ||||||||
| లింగ:- | నీవా, నేనా? | ||||||||
| సుభ:- | మీకుఁ జా వేమిటి! ఎన్ని కట్నము లందుకొనవలసి యున్నదో, యెందఱి గొంతు లింకను గోయవలసి యున్నదో! | ||||||||
| లింగ:- | కట్నములమాట కఱకంఠుఁ డెఱుఁగును గాని పెన్నిధి వచ్చినను నేనిఁకఁ బెండ్లిమాత్రము చేసికొనను! బుద్ధివచ్చినది! | ||||||||
| సుభ:- | దాని కేమిలెండు! కలిమినిబట్టి యెవరికో గంగవెఱ్ఱు లెత్తక మానవు, సిగ్గు బుగ్గి చేసికొని మీరు సిద్ధపడక మానరు! | ||||||||
| లింగ:- | సరే, అంత యదృష్టము పట్టినప్పు డాలోచింపవచ్చును. గాని, నామీఁద నీ కింతకోప మెందులకే? | ||||||||
| సుభ:- | మీమీఁద నేమికోపము! నాతండ్రి మొఱ్ఱోయని మొత్తుకొనుచుండ ఆయన మెడలు విరిచి అన్యాయముగ నా గొంతుకోసిన మాయమ్మ మీఁదఁ దప్ప, నాకెవ్వరిమీఁదను కోపములేదు.
| ||||||||
| లింగ:- | ఓసీ! భర్తయన భగవంతుఁడు గదా! భర్త నిట్టి పాడుమాట లనవచ్చునని యే పుస్తకములో నైన నున్నదా? | ||||||||
| సుభ:- | ఆలియన నర్ధాంగి గదా! అర్ధాంగి కన్నమైనఁ బెట్టక, కూడఁబెట్టిన ధనముకూడఁ గొంపోయినవా రెవ్వరైన నున్నారా? | ||||||||
| లింగ:- | ఆహాహాహాహా! అంటించినావే ముక్కకుముక్క! వెఱ్ఱిదానా! గడించినవాఁ డెవ్వఁడు కర్చుపెట్టి చచ్చినాఁడే? చూడు -
| ||||||||
| సుభ:- | సరే కాని నా సమాధానము కూడ వినెదరా? | ||||||||
| లింగ:- | అక్కఱలే దక్కఱలేదు. ఈ వితండవాదమున కిప్పుడు తీఱికలేదు. నీకొక శుభవార్త చెప్పిపోవలెనని వచ్చినాను. | ||||||||
| సుభ:- | ఏమిటది? ఎవరైన బదులుకొఱకు వచ్చుచున్నారా యేమి? | ||||||||
| లింగ:- | బదులుఁగాదు బండలుఁగాదే. అబ్బాయికిఁ బిల్ల నిచ్చుటకై పెండ్లికొడుకు చూపులకు వచ్చుచున్నారు. | ||||||||
| సుభ:- | మనకుఁ బిల్ల నిచ్చునంతటి మతిమాలినవా రెవ్వ రబ్బా! | ||||||||
| లింగ:- | ఎవరా? పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారు. | ||||||||
| సుభ:- | ఏమిటీ? కాళిందినా? కమలనా? | ||||||||
| లింగ:- | కాళిందియో గీలిందియో నాకుఁ దెలియదు. పెద్దకొమార్తె. | ||||||||
| సుభ:- | పేరుతో మీకేమిపని! కట్నము మాత్రము గళ్ళున పెట్టెలోఁ బడిన జాలును! ఏపాటి? | ||||||||
| లింగ:- | ఏమో వారియిష్ట మే మిచ్చినను సరే. | ||||||||
| సుభ:- | అట్లయినఁ గాలమున కేదియో అంతరాయ మున్నదన్న మాటే! సరేకాని క్షౌరము చేయించుకొననే లేదుగద? | ||||||||
| లింగ:- | అబ్బా, అగపడినప్పుడెల్ల క్షౌరపుగోలయే కదా! నేను జావఁగానే, సర్వస్వము నీ క్షౌరముల క్రిందనే చెల్లుకాఁబోలును! | ||||||||
| సుభ:- | మీకా విచార మెందులకు? మీరు పోవునప్పుడు మీ యినుపపెట్టె మీనెత్తి కెత్తెదనులెండు! | ||||||||
| లింగ:- | ఆహా! అట్టి యవకాశమే యున్న నదృష్ట మేమనవచ్చును!
| ||||||||
| (తెరపడును.) | |||||||||