| నాటకములు | వరవిక్రయము (1923) | కాళ్లకూరి నారాయణరావు |
| ప్రథమాంకము. (ప్రదేశము: పురుషోత్తమరావుగారి లోపలి చావడి.) (ప్రవేశము: పంటెను నూలు చుట్టుచు భ్రమరాంబ, చరకాగానముతో నూలు వడకుచు కాళింది, కమల.) | |||||||
| కాళింది, కమల:- |
(మోహనరాగము - ఆది తాళము.) చరకా ప్రభావం బెవ్వరి కెఱుక! జగతిలోన మన చరకా॥ సిరులతోడఁ దులఁదూగుచున్న యల- సీమజాతి చూచుచున్న దేమఱక. చరకా॥ చర. సాలున కిరువదికోట్ల రూప్యములు - సంపాదించెడు వారికె గాక మేలి చేతిపనులు మాపుకొని - మేటి బానిసలమైన వెనుక, చరకా॥ పాటవమగు సామ్రాజ్యముఁ గూర్చున్ - పరిమితి లేని ధనంబును జేర్చున్ కాటక రాకాసిని బరిమార్చున్ - సాటిలేని యొక జాతి నొనర్చెన్. చరకా॥ | ||||||
| కాళింది:- | అమ్మా! అదేమే - చేతిలోని నూలు చేతిలోనే యున్నది! | ||||||
| భ్రమ:- | ఈ పూఁట నా దృష్టి యీపని మీఁద లేదే! మీ నాయనగారు మిల్లెగరిటెఁడు కాఫీనీళ్లు గొంతులోఁబోసికొని, ప్రొద్దున బోయినపోక - యింతవఱ కింటికి రాలేదు! పండ్రెండు కొట్టి పావుగంట యైనది! ఎక్కడికి వెళ్లినారో యేమి పనిమీఁద నున్నారో తెలియదు! | ||||||
| కమ:- | నాయనగారి కిప్పు డింకేమి పని యున్నది? - అహర్నిశలు అల్లురను వెదకుటక్రింద సరిపడుచున్నవి. | ||||||
| భ్రమ:- | అమ్మా! యేమి చేయు మనెదవు - ఆఁడుపిల్లలం గన్నవారి యవస్థ యిప్పు డీస్థితికి వచ్చినది!
| ||||||
| కమ:- | అట్లే కాని ఆఁడుబిడ్డల తల్లి వ్యథకు మాత్రము అర్థములేదమ్మా ఏమందువా?
| ||||||
| కాళింది:- | హుష్! ఊరకుండుము! అదిగో చెప్పుల చప్పుడు - నాయనగారు వచ్చుచున్నారు. | ||||||
| పురు:- | (ఆయాసముతోఁ బ్రవేశించి) ఔరా! యేమి విపరీతకాల మాసన్న మైనది.
ఇంతకన్న ఘోర మింకేమున్నది?
(అని యనుకొనుచు ముందునకు నడుచును.) | ||||||
| భ్రమ:- | (లేచి) ఇదేమి నేఁ డింతసే పున్నారు! భోజనమునకుఁ బ్రొద్దు పోలేదా? | ||||||
| పురు:- | వెఱ్ఱిదానా! యెక్కడి భోజనము! - ఎక్కడి లోకము?
| ||||||
| భ్రమ:- | ఇంతకు నిప్పుడు చేసికొనివచ్చిన పని యేమిటి? | ||||||
| పురు:- | కాళ్ళరుగునట్లు కాలేజి యంతయుఁ గలయఁ దిరుగుటకంటెఁ జేసినపని చిన్న మెత్తు లేదు! | ||||||
| భ్రమ:- | కాలేజి యంతటిలోఁ బెండ్లికావలసిన పిల్లకాయ లెవ్వరును గానుపింపనే లేదా? | ||||||
| పురు:- | కానిపింప కేమీ - కావలసినంతమంది యున్నారు. కాని యేమి లాభము - గవ్వకుఁ గొఱగానివాఁడు గూడ కాసుల వెలలో నున్నాడు! ఒక్కటే లెక్క - స్కూలు ఫయినలు వానికి రెండువేలు - ఇంటరు వానికి మూడు- బియ్యే వానికి నాలుగు! ఆస్తి యేమయిన నున్నచో నంతకు రెట్టింపు! ఈవిధముగా రైలు తరగతులకువలె రేట్లేరుపడి యున్నవి! ఆ పయిని -
| ||||||
| భ్రమ:- | వారివారి వర్తనాదికము లెట్టివి? | ||||||
| పురు:- | ఆ సంగతి నీ వడుగ నక్కఱయు లేదు - నేను జెప్పనక్కఱయు లేదు!
| ||||||
| భ్రమ:- | వారి తలిదండ్రు లీపాటికి వారిచేత చదువులకు స్వస్తి యేల చెప్పింపరో! | ||||||
| పురు:- | వెఱ్ఱిదానా! ప్రస్తుతము చాలమంది బాలురను పాఠశాలల కంపుట - విరివిగా గట్నములు లాగుటఁకుఁగాని విద్యకొఱకుఁ గాదు. అందువలన మనువు కుదిరిన మఱునాడు కాని మానిపింపఁ దలంపరు. | ||||||
| భ్రమ:- | అట్లయిన నా చూపుడు గుఱ్ఱములతో మన కవసరములేదు. గాని - మీతోపాటు సంఘ సంస్కరణము కొఱకు సన్నద్ధులైన వా రెందఱో కలరు గదా - వారిలో నెవ్వరికిని వయస్సు వచ్చిన పిల్లకాయలు లేరా? | ||||||
| పురు:- | లేకేమీ - యున్నారు. ఉండి యేమి లాభము? ఉపన్యాస వేదికపై నుక్కిరిబిక్కిరి చేసుకొనుటయే కాని - పని వచ్చినప్పుడు పట్టుదల సున్న! బాల్య వివాహము లన్నఁ బటబట పండ్లుకొఱకు బాపిరాజుగా రేమిచేసినారో విన్నావా?- అభము శుభము నెఱుఁగని యాఱేండ్లపిల్లను, నలుబదియేండ్లు కడచిన నాల్గవ పెండ్లివానికి ముడిపెట్టి - అదేమన - అత్తగారి పట్టన్నారు! స్త్రీ పునర్వివాహముల కొఱకుఁ జిందులు త్రొక్కిన శివయ్యగారు బంగారు బొమ్మవంటి పదునాఱేండ్ల చెల్లెలికి భర్త చావఁగానే, వంటలక్కను మానిపించి, వంట తప్పెల చేతికిచ్చి - అదేమన, మాయమ్మ చావనిమ్మన్నారు. శవవాహనమును గూర్చి శంఖములు పూరించు శరభయ్యగారు - ప్రక్క యింటి యిల్లాలు భర్త చచ్చి, శవవాహకులకు డబ్బిచ్చు శక్తిలేక దేవుడాఁ గోడా యని దేవులాడుచుండ వీధి తలుపునకు గొండ్లెము వైచి, విత్తెడు నైవేద్యముపట్టి, పెరటి త్రోవను పేకాటకుఁ జక్కఁబోయి - అదేమన ఆమె వచ్చి అడుగలేదన్నారు! విన్నావా?- వీరే కాదు- ఈ యూరి సంఘ సంస్కర్త లందఱు నిదే మాదిరి! | ||||||
| భ్రమ:- | అయిన నొకసారి యాలాపించి చూడకపోయినారా? | ||||||
| పుర:- | ఆహా! ఆ యాశకూడఁ దీర్చుకొనియే వచ్చినాను ఎవరితోఁ బ్రస్తావించిన నొక్కటియే పల్లవి - "నాకిష్టమే కాని మావాళ్లు పడనివ్వరండి" యను మాట తప్ప మాఱుమాట లేదు! | ||||||
| భ్రమ:- | వా రన్నదియు వాస్తవమే. కట్నము లేదన్న నాఁడుది కంఠమున కురిపెట్టుకొను దినములు వచ్చి - మాట దక్కుట కవకాశము లేనప్పుడు, మాబాగని తలయూఁప వలసిన వారె కాని - మగవారు మాత్ర మేమి చేయఁగలరు! | ||||||
| పురు:- | అదేమన్నమాట - ఆఁడుదానిమాట కింత యడుగుదాఁటలేని యధములు దేశారాధన మేమి చేయఁగలరు?
| ||||||
| భ్రమ:- | చివర కేమి సిద్ధాంతపఱచినారు? | ||||||
| పురు:- | అదే పాలుపోవుట లేదు. దారిలో దైవికముగా పెండ్లిండ్ల పేరయ్య యెదురుపడ - మా యింటి కొకసారి రమ్మని మఱిమఱి చెప్పిమాత్రం వచ్చినాను. | ||||||
| భ్రమ:- | పెండ్లిండ్ల పేరయ్య యెవరు? | ||||||
| పురు:- | ఎవరా? పెండ్లిండ్ల పేరయ్య యనియు, వివాహాల వీరయ్య యనియు నీ యూరిలో నిరువురు బ్రాహ్మణులు. ఈ చుట్టుపట్ల నేవివాహము జరిగినను వీరి చేతులపై జరుగవలెను. | ||||||
| భ్రమ:- | సరిసరి తెలిసినది, చక్కనిపని చేసినారు. ఆయనతో నాలోచించి, అతి శీఘ్రముగాఁ గార్యములగు సాధనము చూడుఁడు. పెద్దమ్మాయికిఁ బదుమూఁడవ యేఁడు కూడ వెళ్లవచ్చినది. చిన్నమ్మాయి దానికన్న నొక యేఁడాది మాత్రమే చిన్నది. కట్నముల పట్టుదలచేత నిప్పటికే కాలహరణ మైనది. ఈ మాఖములో నిరువురకును ముడి పడకున్నచో ముప్పు వాటిల్లక మానదు. ఏ యెండ కా గొడుగు పట్టక తప్పదని నే నెంత మొత్తుకొన్నను వినిపించుకొన్నారు కారు. ఈపాటిమార్పు మీమనస్సున కిదివఱకుఁ గలిగినచో అల్లురతో నీపాటికి హాయిగా నుండెడివారము! | ||||||
| పురు:- | వెఱ్ఱిదానా! అల్లు రనెదవేమి? అల్లురు కారు - అధికారులు! కావుననే - ఆఁడుబిడ్డలం గన్న యపరాధముక్రింద - సాగదీసి సంచుల కొలఁది జరిమానాలు వసూలు చేయుచున్నారు. కాకున్న - కాళ్లుకడిగి కన్యనిచ్చువారి కీ కట్నముల దండన యెందులకు?
అందును, నల్లుర బాధ యనుభవించినవారికిగాని తెలియదు!
పెక్కు మాట లేల;
| ||||||
| భ్రమ:- | మరల వెనుకటిదారిని బడి మనసు పాడు చేసికొనుచున్నారు. అమ్మయ్యో! ఇదిగో ఒంటిగంట! రండు స్నానమునకు రండు. | ||||||
| పురు:- | స్నానము క్షణములో ముగించెదను. వడ్డన కాని మ్మని వంటలక్కతోఁ జెప్పుము. పెద్దమ్మాయి! పేరయ్య వచ్చినచోఁ గూర్చుండు మను. (అని భ్రమరాంబతో లోని కేగును.) | ||||||
| కాళిం:- | చెల్లీ! మనవారి మాట లన్నియు వింటివి కదా - నిజముగా నీకేమి తోఁచుచున్న దే? | ||||||
| కమ:- | (చివాలున లేచి) చెప్పుమనెదవా?
| ||||||
| కాళిం:- | (లేచి కౌఁగిలించుకొని) బళి, బళి! బాగుగాఁ జెప్పితివే!
| ||||||
| కమ:- | అక్కా! ఒక్క సందేహము.
| ||||||
| కాళిం:- | కాకేమి కాని మన మిపుడు కావింపఁదగిన దేమియు లేదా? | ||||||
| కమ:- | లేకేమీ?
| ||||||
| కాళిం:- | సెబాసునే చెల్లీ! వయసునకుఁ జిన్నదాన వైనను వరహాల కెత్తుకెత్తయిన మాట్లాడితివి! ఇదిగో.
| ||||||
| కమ:- | హుష్! ఊరకుండు యెవరో వచ్చుచున్నారు. | ||||||
| పేర:- | (ప్రవేశించి) అమ్మా! పంతులుగా రేం చేస్తున్నారు? | ||||||
| కాళిం:- | మీ పేరు? | ||||||
| పేర:- | నాపేరా? నాపే రొక విధంగా నడచి చచ్చిందా? చిన్నప్పుడు పేరడనీ, పేరగాడనీ అనేవారు. కాస్త ముదిరిన తర్వాత, పేరన్ననీ, పేరయ్యనీ అంటూ వచ్చేవారు. ఇప్పు డిప్పుడు పేరిశాస్తుర్లనీ, పేరిభొట్లనీ, పేరావధాన్లనీ, పేరిచైన్లనీ అంటున్నారు. ఇకముందే మంటారో యీశ్వరుడికే తెలియాలి. | ||||||
| కాళిం:- | నాయనగారు భోజనము చేయుచున్నారు, అదిగో ఆకుర్చీపై గూరుచుండుడు. | ||||||
| పేర:- | (కూర్చుండి) అయ్యొ నాయిల్లు బంగారము కానూ! అప్పటినుంచి యిప్పటిదాకా భోజన మేనా! బజార్లో పంతులుగారికి కనిపించిన తర్వాత, పండా కొండయ్య యింట్లో బారసాల సంభావన పుచ్చుకొని, వీసెడు వంకాయలూ, విస్తళ్ళూ కొనుక్కుని, యిద్దరితో మాట్లాడి యింటికిపోయి, స్నానంజేసి, సంధ్యావందనం చేసుకుని, జపంచేసుకుని, దేవతార్చన చేసుకుని, భోజనంచేసి, పొడుం చేసుకుని, కాస్త మంచి శకునం కంటబడేవరకూ గడపలో నుంచొని, అయిసర బొజ్జా అని అప్పుడు చక్కా వచ్చాను. అయితే, అమ్మా! మీ రిద్దరూ, పురుషోత్తమరావు పంతులుగారి పుత్రిక లనుకుంటాను, అంతేనా? ఆఁ! అదిగో! ఆ పోలికలే చెపుతున్నాయి! అయితే, మీ పేర్లేమమ్మా! | ||||||
| కాళిం:- | నా పేరు కాళింది, మా చెల్లి పేరు కమల. | ||||||
| పేర:- | ఏం చదువుకుంటున్నారు? | ||||||
| కమ:- | ఇదివఱ కింగ్లీషు, తెలుఁగు చదివెడువారము. ఇప్పుడు హిందీ, సంస్కృతము చదువుచున్నాము. | ||||||
| పేర:- | ఓ యబ్బో! నాయిల్లు బంగార మైతే, నాలుగు భాషలే! అయితే ఆరుమోయన మేమయినా వాయిస్తారా? | ||||||
| కమ:- | (నవ్వి) హార్మోనియము కావలయును! ఆఁ వాయించగలము. | ||||||
| పేర:- | అల్లికా, కుట్టూ - యి వేమయినా చేతవునా? ఇదుగో? యీ బ్రాహ్మ డేమిటి యిన్ని ప్రశ్నలు అడుగుతున్నా డనుకుంటారేమో, ఈ రోజులలో పెళ్లికొమార్తెలకు కావలసిన లక్షణాలివ్వే. అందుకోసం అడుగుతున్నాను. అరుగో పంతులుగారు వస్తున్నారు. చిటికెడు పొడుం పీల్చుకుని సిద్ధంగా వుంటాను. (అని యట్లు చేయును.) | ||||||
| పురు:- | (ప్రవేశించి) ఏమీ! పేరయ్యగా రెండలోనే వచ్చినారే, రవంతసేపు పండుకొని కాని రారనుకొన్నాను. (అనుచు నింకొక కుర్చీలోఁ గూరుచుండును.) | ||||||
| పేర:- | సరి సరి. యెంతమాట? తమ సెలవైనాక, తక్షణం చేతులు కట్టుకుని వచ్చి వాల్తాను గాని, నిద్రపోతానా! | ||||||
| పురు:- | అమ్మాయిలను జూచినారు గదా? వీరికే యిపుడు వివాహములు కావలసియున్నది. అమ్మా! మీరిఁక భోజనమునకు వెళ్ళి మీయమ్మ నొకసారి యిటు పంపుఁడు. | ||||||
| కాళిం, కమల:- | (లేచి నిష్క్రమింతురు.) | ||||||
| పేర:- | తమ గోత్రమేమిటి? | ||||||
| పురు:- | కౌశిక గోత్రము. | ||||||
| భ్రమ:- | (ప్రవేశించును.) | ||||||
| పురు:- | ఇరుగో! యీయనయే పేరయ్యగారు. పాపము, నామాట మీఁద పడకకూడ మాని చక్కవచ్చినారు. | ||||||
| భ్రమ:- | సంబంధము లెవ్వియైన సానుకూలపడు నన్నారా? | ||||||
| పేర:- | అమ్మా! సంబంధాల కేమి లోటు? కో! అంటే కోటి సంబంధాలు! అయితేసరా, వేలుపెట్టి చూపడానికి వెల్తిలేని సంబంధం సందర్భపడాలి. ఏం బాబూ! ఏమంటారు? | ||||||
| పురు:- | అంతే కాని, అసలు సంగతి మీతోఁ జెప్ప లేదు. నేను వరశుల్కము దూష్యమనే వాదములోని వాఁడను. ఈ దురాచారము మానిపింపవలెనని, యిప్పటికి బదేండ్ల నుండి పాటుపడుచున్న వాఁడను. ఈ కారణములచేత నీ పిల్లలకుఁ గట్నమిచ్చి పెండ్లి సేయుట కిష్టము లేక ... | ||||||
| పేర:- | తెలిసింది, తెలిసింది. అక్కడి కాగి, ఒక్కమాటకు సమాధానం చెప్పండి. పదేళ్ళనుంచి పాటుపడుతున్నారు గదా? యిప్పటి కొక్కరిచేత నయినా మానిపించ గలిగారా? వట్టిది బాబూ! వట్టిది! మచ్చుకైనా మానేవా రుండరు. వేలెడు కుఱ్ఱవాడు కనబడితే వేలకు వేలు వేలం పాడేటప్పుడు, వెఱ్ఱా, పిచ్చా, మానడానికి. ఇంత యెందుకూ? ఇదివఱకు కోర్టులో, ఇంత ఇన్కమ్టాక్సు ఇస్తున్నా మంటే ఘరానా. ఇప్పుడో - మాఅబ్బాయి కింతకట్నం యిచ్చారంటే ఘరానా! ఈలాటి స్థితిలో ఎవరు మాన్తారు! వద్దు బాబూ వద్దు! ఈ పిచ్చి మాత్రం యిక విడిచిపెట్టండి. అమలాపురంలో, వెనక, అయ్యగారి అంబయ్యగా రిల్లాగె, కట్న మివ్వనని భీష్మించి కూర్చుండేసరికి కన్య సమర్తాడి వూరుకుంది! ఆపాటున, నలుగురూ ఆంక్ష చెయ్యడం, ఆబ్రాహ్మ డాపిల్లనో బ్రహ్మసమాదిగాడి కంటగట్టడం, ఆపిల్ల కాపరానికి వెళ్లి అయిదుగురు బిడ్డలను కనడం యిన్ని జరిగాయి! | ||||||
| పురు:- | అట్లయినఁ, గట్నములేని సంబంధము కన్నొడుచుకున్నను లభింపదన్న మాటయేనా? | ||||||
| పేర:- | లక్ష యేళ్ళు తపస్సు చేసినా లభించదు. ఎవరైనా తేగలిగితే కుండనాలు పెట్టుకుందామని కుట్లు పెంచుకుంటూ వున్న నా చెవులు కుదుళ్ళలోకి తెగ్గోయించుకు పోతాను! ఇంతెందుకూ పెద్దపెద్ద లిప్పుడు బేరాలతో పనిలేకుండా బల్లమీద రేట్లు వ్రాయించి, బయట తగిలిస్తున్నారు. వెలగలేటివారు వేయిన్నూటపదహార్లు, రేటూరివారు రెండువేలు, ముంజులూరివారు మూడువేలు, నందరాజువారు నాలుగువేలు, అయ్యంకివారు అయిదువేలు, చింతలూరివారి చిన్నవాడు తూగినన్ని రూపాయలు ఎవరి మట్టుకు వా రీవిధంగా యేర్పాట్లు చేసుకుని కూర్చున్నారు. ముందుముందు చీట్లమీద రేట్లు వ్రాసి షాపులలో వస్తువుల కంటించినట్లు పెళ్ళికుమాళ్ళ ముఖాలకు అంటిస్తారని కూడా అనుకుంటాను! | ||||||
| పురు:- | రామరామా! రానురాను దేశ మేస్థితిలోనికి వచ్చినది? | ||||||
| పేర:- | అయ్యా! మీరు దీనికే ఆశ్చర్యపడుతున్నారు. కట్నాల తమాషా కమ్మవారిలో చూడాలి! వారిలో నల్లబంగారమే కాని తెల్లరూపాయలు పనికేరావు. ఆ నల్లబంగారం కూడా యకరాల లెక్కపోయి పుట్లలెక్కలోనికి దిగింది. పదిపుట్ల భూమికి వచ్చినవాడు పనికిమాలినవాడే! ఈ మధ్యనో యీతమొద్దుకు యిద్దరు భార్యలుండగా ఇరవైపుట్ల భూమితో ఇంకో పిల్లను కట్టబెట్టారు! నాలుగు రోజుల క్రిందట నలభయ్యారేళ్ళ నలుగురిబిడ్డల నాలుగోపెళ్ళి పెళ్ళికొడుకుకు నలభైపుట్ల యీనాంభూమీ, నలభై వెయ్యినూటపదహార్ల రొక్కమూ, నలభైతులాల గోవతాడూ, నాలుగుతులాల చుట్లూ, నాలుగుజతల యెడ్లూ, రెండు బళ్ళూ, పదివందల గజాల పాటిమన్నూ, ముప్ఫయిబళ్ళ ముక్కిన పెంటా సమర్పిస్తూ వియ్యపరాలి కాఱు పాడిగేదెలూ, వియ్యంకుడి కైదుబళ్ళ గోగునారా యిస్తే, పుస్తె ముడేశాడు! విన్నారా?
| ||||||
| భ్రమ:- | సరి కాని సంబంధము లేమున్నవో చెప్పినారు కారు. | ||||||
| పేర:- | చెపుతానమ్మా! చెపుతా, ఇద్దరికీ యీసంవత్సరమే చేయదలచుకున్నారా? | ||||||
| భ్రమ:- | సంబంధము లమరినచో నిరువురకు నీ సంవత్సరమే చేయవలెనని యున్నది. అయినఁ గాళిందిమాట ముం దాలోచింపుఁడు. | ||||||
| పేర:- | అలాగైతే, సంబంధాల విషయంలో మీ యభిప్రాయమేమిటో సంగ్రహంగా ముందు సెలవివ్వండి. మీకు కావలసింది: చదువా? చక్కదనమా? సంపత్తా? సంప్రదాయమా? లేక; చదువూ సంప్రదాయమూ, సంప్రదాయమూ సంపత్తూ, సంపత్తూ చక్కదనమూ, చక్కదనమూ చదువూ, చదువూ సంపత్తూ, ఈవిధంగా వుండవలెనా? | ||||||
| పురు:- | నాకేమో చదువు, సంప్రదాయము వీనిపై నున్నది. దానికేమో చక్కదనము, సంపత్తు వీనిపై నున్నది. మీరు మా యుభయుల కోరికలు తీఱునట్లు చూడవలెను. | ||||||
| పేర:- | అంటే నాలుగూ వున్నవాడు కావాలన్నమాట. కాని, నాలుగూ వున్నవాణ్ని నేనుగాదు సరిగదా నన్ను పుట్టించిన బ్రహ్మదేవుఁడు కూడా తేలేడు! ఏమంటారా? వారాలు చేసుకున్న వాజెమ్మకుగాని చదు వబ్బదు; పరువొల్లని పీనాసికి కాని భాగ్యం పట్టదు! ఇట్టి స్థితిలో, నాలుగూ వున్నవాణ్ని తేవడానికి నాతరమా, నాయబ్బతరమా. | ||||||
| భ్రమ:- | అట్లయినచో, నేఁటి స్థితినిబట్టి, నేను గోరినవే ముఖ్యముగాఁ జూడ దగినవి. ఏమనెదరా? బియ్యే ప్యాసయినవా రుద్యోగములు లేక, ప్లీడరుగుమాస్తాపని కోసము పిచ్చెత్తినట్లు తిరుగుచున్నారు! ప్లీడర్లు బోణీలేక, వీసెఁడు వంకాయల ఫీజునకు విలేజి కోర్టులకు సిద్ధపడుచున్నారు! చదువుల సంగతి యీ సరణిగా నున్నది. ఇఁక సంప్రదాయము సంగతి చూచినచో అయినకుటుంబము లడుగునఁ బడినవి. కాని కుటుంబములు గణనకు వచ్చినవి! ఇంత యేల! నిత్యము మనము చూచు నిర్భాగ్యులలోఁ జాలమంది సంప్రదాయ కుటుంబములలో జన్మించిన వారే! ఏమి లాభము! సంపత్తులేని కులీనుఁడు స్మశానములోని తులసి మొక్క వంటివాఁడు! కాఁబట్టి, యీ దినములలో నింత కలిగిన సంబంధమే యాలోచింపఁ దగును. | ||||||
| పేర:- | అమ్మా! మీమాటలు నాకు అరటిపం డొలిచి చేతిలో పెట్టినట్లున్నాయి. కాని కలిగినవారి కోసం చూస్తే కట్నం కాస్త హెచ్చు కాకమానదే? నిన్నగాక మొన్న, నీళ్ళకావిళ్ళ నీలకంఠంగాడి కొడుకుకు వెయ్యిన్నూటపదహార్లు రొక్కం, వెండి కంచం, వెండి చెంబులు, బంగారం భటువు, పట్టుతాబితా, రిస్టువాచీ, సిగరెట్లకేసూ ఇంకా యేమేమిటో వాటిపేర్లు నాకు తిన్నగా రావు. బ్యాట్టట, సెల్ఫు షేవింగు రేజరట, ప్యాకెట్టు టాయిలెట్టు బాక్సట, వ్యాసలైను సీసా అట; వల్లకాడట, యిన్నిస్తే పుస్తె ముడేశాడు. గొప్పవారిమాట చెప్పవలసిం దేముంది? | ||||||
| భ్రమ:- | సరే కానిండు, సమయమునుబట్టి నడువక తప్పునా? | ||||||
| పేర:- | అయితే యిం కేమీ! ఆపాటి ధైర్యమిచ్చారంటే కొండమీది కోతిని తేగలను. ఇదుగో యిప్పుడు చెపుతాను వినండి. మంత్రిప్రగడ మాధవరావుగారి పిల్లవాడికి మాన్యాలమీద రెండువేలు వస్తాయి. మాటాడమంటారా? | ||||||
| భ్రమ:- | ఆపిల్లవానిది అడ్డతలండీ! | ||||||
| పేర:- | అయితే పోనివ్వండి. పచ్చమట్ట బాపిరాజుగారి పిల్లవాడికి పన్నెండువందలు వస్తాయి. ప్రేమరీ పేసయ్యాడు. కుదర్చనా? | ||||||
| భ్రమ:- | రంగు. | ||||||
| పేర:- | రంగుకేమీ రాజారంగు. అంత యెరుపూకాదు. అంత నలుపూకాదు, చక్కని చామంచాయ. | ||||||
| భ్రమ:- | చామనచాయ యిప్పటివారికి సరిపడుట లేదండీ. | ||||||
| పేర:- | అలాగయితే, నాదెళ్ళవారి పిల్లవాడు మీ నాడాని కాగుతాడు. పచ్చగా పనసపండు. నలుగురన్నదమ్ములు. నలుగురకూ నాలుగైదువందలు రెండు వేలువస్తాయి. | ||||||
| భ్రమ:- | అబ్బే! అయిదువంద లీదినములలో నొక యాదాయమా? | ||||||
| పేర:- | అయితే, ముంజులూరి ముత్తయ్యగారి దత్తపుత్రుడికి మూడువేలు వస్తాయి. ముఖం చంద్రబింబాన్ని మించివుంటుంది. | ||||||
| భ్రమ:- | అవునుగాని అతఁడు మాపిల్లలకంటె ఆఱంగుళాలు పొట్టి! | ||||||
| పురు:- | ఓసి, నీ యెంచుబడి యేటఁ గలియా! యీవిధముగా నెంచుటకు మొదలుపెట్టినచో లోపము లేనివాఁడు లోకములో నుండునా? | ||||||
| పేర:- | బాబూ! యింకా యేంచూశారు! ఇతర్లతో పోల్చిచూస్తే యీయమ్మ చాలా మెరుగు. ఒక్కొక్క యిల్లాలి సంగతిచూస్తే వొళ్లు మండిపోతుంది! సర్వవిధాలా నచ్చిన సంబంధమైనా వచ్చి యడిగినప్పుడు వంకలు పెట్టడం, మించిపోయాక మిడకడం! | ||||||
| భ్రమ:- | అయ్యా! ఆఁడుపిల్లలకుఁ గావలసిన హంగులు మగవారికేమి తెలియును? ఆఁడుబిడ్డ పెండ్లియన, మగవారికి అప్పు దీర్చుకొనుట యని యభిప్రాయము! | ||||||
| పేర:- | అవునమ్మా! అవును ఆవశ్యం ఆలోచించవలసిందే కాని మీ మాటలనుబట్టి, మీ మనస్సులో యేదో సంబంధం తగిలే వున్నట్టు తట్టుతోంది. అట్టే మమ్మల్ని చంపక, అదేమో చెప్పితిరా బ్రతుకుతాం. | ||||||
| భ్రమ:- | (నవ్వి) చెప్పమనెదరా? సింగరాజు లింగరాజుగారి దత్తపుత్రుడు, నాబుద్ధికి రవంత నచ్చినాఁడు. | ||||||
| పురు:- | ఆ పిల్లవాఁ డాలోచింపఁ దగినవాఁడే. స్కూలు ఫయినలు చదువుతున్నాఁడు, చూపరి, నడతగూడ నాడెమయినదెయని విన్నాను. కాని, రెండు సందేహము లున్నవి. మొదటిది: యేఁబదియవ పడిలో మూడవపెండ్లి చేసికొన్న మూఢునితో సంబంధము చేయనాయని. రెండవది: పిల్లవానికిఁ బదునాఱేండ్లకు బయినుండవు. వరహీన మగునేమోయని. | ||||||
| పేర:- | మీ రెండు సందేహాలూ మినహాయించ తగ్గవే, ఏమంటారా? దీపంపెట్టే దిక్కులేనప్పుడు ఏగడ్డీ కరవక యేంచేస్తారు? ఇక వరహీనం మాటా? ఆ పిల్లవాడికీ, మన పెద్దమ్మాయికి ఒకటికాదు రెండు కాదు మూడేళ్ళు తేడా! ఇంకా వరహీనమేమిటి? కోమట్లలో యిప్పుడు కొంచెం పెద్దపిల్లలను కూడా చేస్తున్నారు. అంతగా చాదస్తులెవరైనావుంటే అబ్బాయి కధికమాసాలు చేర్చీ, అమ్మాయికి తగ్గించీ సరిపుచ్చుకొంటున్నారు. అందుకూ వప్పరనితోస్తే జాతకాలు ఫిరాయిస్తున్నారు. ఇన్నెందుకూ?
| ||||||
| భ్రమ:- | అన్నట్లు మఱచినాను వారికిని నాకు మూడేండ్లే తేడా! | ||||||
| పేర:- | అవునుగద? యింకేమీ? | ||||||
| పురు:- | సరే, యిక నా సందేహములమాట విడిచిపెట్టి ఆసంబంధము పెద్దమ్మాయి కాలోచింపుఁడు. | ||||||
| పేర:- | ఆలోచించడాని కభ్యంతర మేమీలేదు. కాని లింగరాజుగారు మాత్రం లిక్కికి లక్కనే మనిషి. కట్నం దగ్గర కంఠానికి ముడివుండదు. సరే, సర్వవిధాలా ప్రయత్నం చేతాము. అయితే అమ్మాయి లిద్దరికీ బాలతొడుగు లేపాటి వుంటాయి? | ||||||
| పురు:- | వేయేసి రూపాయలకు వెలితి యుండదు. అవికాక వారి బారసాలలనాఁడు వారి మాతామహుఁడు వారికి వ్రాసియిచ్చిన పదేసి యెకరముల భూములవల్లను నైదేసివందలు వచ్చుచున్నవి. | ||||||
| పేర:- | అలాగైతే యిఁక నంత భయపడవలసిన పనిలేదు. అమ్మగారన్నట్లు పెద్దమ్మాయి సంగతి ముందు తేల్చుకుని, ఆవెనుక చిన్నమ్మాయి సంగతి ఆలోచింతాము. (అని లేచును.) | ||||||
| పురు:- | మరల మీదర్శన మెప్పుడు? | ||||||
| పేర:- | రేపు దుర్ముహూర్తం పోగానే లింగరాజుగారి యింటికి వెళ్ళి, సంగతి సందర్భాలు చూచుకుని, సాయంకాలంలోగా వస్తాను. | ||||||
| భ్రమ:- | ఏమో, యేమి చేసికొని వచ్చెదరో పిల్లల వివాహభారము మీది. మిమ్ములను సంతోషపెట్టు భారము మాది! | ||||||
| పేర:- | అమ్మా! ఆమాట మీరు వేరే సెల వివ్వాలా! కార్యమయిందాకా కన్నుమూస్తే ఇది గాయిత్రి గాదు! శలవు! | ||||||
| (తెరపడును.) ఇది ప్రథమాంకము. | |||||||