| నాటకములు | వరవిక్రయము (1923) | కాళ్లకూరి నారాయణరావు |
| నాంది | |
భూరివరిష్ఠమై, విబుధ - పుంగవ మంగళ వాక్సమృద్ధమై, |
| ప్రస్తావన | |||
| సూత్ర:- | (ప్రవేశించి) ఓహో! యేమి యీ సభాసమ్మర్దము! ఆ మహాకవి కావ్యము లనఁగానే యభిజ్ఞుల కేమి యాదరము! (పరిక్రమించి) ఓ సభాస్తారులారా! వర్తమాన వరశుల్క దుర్నయ దూరీకరణమునకై బుద్ధిరాజు వీరభద్ర రాయామాత్యులవారి కంకితముగా, మహాకవి కాళ్లకూరి నారాయణరావు గారిచే రచింపఁబడిన వరవిక్రయ రూపకమును విలోకించు నిమిత్తము విచ్చేసిన మీయెడ నే నత్యంతముఁ గృతజ్ఞుఁడను, ఏమనుచున్నారు?
(తెరవంకఁ జూచి) ఓసీ! ఓసీ! యెక్కడ! ఒక్కసారి యిటురమ్ము. | ||
| నటి:- | (ప్రవేశించి) ఏమా యధికారము! కొని పాఱవైచినట్లె గొంతు చించుకొనుచున్నారే? | ||
| సూత్ర:- | ఓసి దెష్టా! కొని గాక నిన్నుఁ గోసికొని వచ్చితి నఁటే? నీ తండ్రికిచ్చిన వేయిరూపాయల రొక్కము - నీకుఁబెట్టిన వేయిరూపాయల నగలు - ఏ గంగలోఁ గలిసినవి? | ||
| నటి:- | మీ సొమ్ములు మీకుఁ దిరుగ నిచ్చివేసిన నాకు విడియాకు లిచ్చెదరా? | ||
| సూత్ర:- | ఆసి నీబొడ్డుపొక్క! యిది అమెరికాదేశ మనుకొంటివా యేమి! కాదుకాదు- ఆర్యావర్తము. అబ్బో! ఆ యాట లిక్కడ సాగవు! బొందు మెడఁగట్టినచో, బొందిలోఁ బ్రాణముండువఱకును బందెగొడ్డువలెఁ బడి యుండవలసినదే. | ||
| నటి:- | అట్లయిన నాసంగతి రేపాఁడంగుల సభలో నాలోచించెదము. కాని- యిప్పుడు నన్నుఁ బిలిచినపని యేమో సెలవిండు. | ||
| సూత్ర:- | పాత్రములను సిద్ధపఱచితివా? | ||
| నటి:- | సిద్ధపఱచుటయే గాదు- శీఘ్రముగఁ బ్రవేశింపవలసిన దని చెప్పికూడ వచ్చినాను. | ||
| సూత్ర:- | అట్లయిన, వారింకను నాలసించుచున్నా రేమి? | ||
| నటి:- | మీ చెవులలోఁ జెట్లు మొలచినవా యేమి! ఆ చరకాగానము వినబడుట లేదా? | ||
| (తెరలో:-) | చరకా ప్రభావం బెవ్వరి కెఱుక! జగతిలోన మన చరకా॥ సిరులతోడఁ దులఁదూగుచున్న యల- సీమజాతి చూచుచున్న దేమఱక, చరకా॥ | ||
| సూత్ర:- | ఔనే! అవిగో - భ్రమరాంబా, కాళిందీ, కమలా పాత్రములు చరకాగానముతోఁ బ్రవేశించుచున్నవి. మనము పోయి పయిపని చూతము రమ్ము. | ||
| (ఇద్దరు నిష్క్రమింతురు.) ఇది ప్రస్తావన. | |||