| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| నారదుఁడు చతురోక్తుల శ్రీకృష్ణుని నుతించుట | ||
| అనులోమ విలోమ క. |
నాయశరగసార విరయ తాయనజయసారసుభగధరధీనియమా మాయనిధీరధగభసుర సాయజనయతాయరవిరసాగరశయనా! |
92 |
| . |
(దీని నర్ధభ్రమక కంద మనియు నందురు. మొదటి రెండు పాదములను దుది నుండి వెనుకకుఁ జదివినచో మూఁడు నాలుగు పాదము లగును. అనఁగా బూర్వార్ధమును ద్రిప్పి చదివినచో నుత్తరార్ధమును, ఉత్తరార్ధమును వెనుక నుండి చదివినచో పూర్వార్ధమును నగునని భావము.) |
|
| పాదభ్రమక క. |
ధీర శయనీయ శరధీ మార విభానుమత మమత మనుభావిరమా సార సవననవసరసా దారద సమ తార హార తామసదరదా! |
93 |
| . |
(పాదభ్రమక మనఁగా బ్రతిపాదమును వెనుకనుండి చదివినను నదే పాదము యగును. దీనినే యనులోమ విలోమ పాద మనియు నందురు.) |
|
| గోమూత్రికా బంధ క. |
విదళితదైత్య రమాగృహ పదసారస వినతదేవ పతగేశహయా చిదమిత చైత్యశమావహ మదవారణ విమతభావమతపాశజయా! |
94 |
| నాగ బంధ చ. |
జలదవితాననీల ఖలసాలకులక్షతివారణేశ ని శ్చలమునివారపాల సురచారణయక్షనవానుకూల కుం డలివరహారలోల నరనారదతత్పర భూవిధేయ యు జ్జ్వలమనునీతిశీలితవశంవద శక్రరమానికేతనా! |
95 |
| ఛురికా బంధ క. |
శ్రీవర వరవరహృత భవ భావన వనజాయతాక్ష పాలితవిబుధా ధావితదనుభవనియమి స భావనచతురా సముద్ధృతార్ణవ వసుధా! |
96 |
| చక్ర బంధ శా. |
చిత్రాకృత్యభినందిత వ్రజమృగాక్షీమధ్యగా యక్షరా మిత్రోష్ణద్యుతిదిగ్ధచక్ర జనివల్మీకర్క్షపా కృష్ణభా సత్రారాధ్య నుతింతు నిన్ను జగదీశా విక్రమాతిస్థిరా రాత్రీ నాంచితభామితాబ్జ సదయా రాధానుభావాకరా! |
97 |
| . |
(ఈ బంధమున మూఁడవ చుట్టున "కృష్ణరాయకృతి" యనియు నాఱవ చుట్టున "నందితిమ్మకవి" యనియుఁ గృతిపతి కృతిభర్త నామములు గూర్పఁబడి యున్నవి.) |
|
| ద్వ్యక్షరి క. |
మనమున ననుమానము నూ నను నీనామ మనుమనుమననమునునేమ మ్మున మాన నన్ను మన్నన మను మను నానామునీనమానానూనా! |
98 |
| . |
(ఈ కంద పద్యము "న, మ" యను రెండక్షరముల తోడనే సాగినది. కావున దీనికి ద్వ్యక్షరి కంద మని పేరు. ఈ రెండక్షరములనే గ్రహించుటచే నయ్యది నమః పూర్వకస్తుతి యైనది.) |
|
| ద్వికంద క్రౌంచపదవృత్తము: | ||
| క. |
అంకురితశ్రీ సంగభు జాంకా హరిహయమణి మదహర తనువర్ణా సంకటకృద్దైత్యాశయ శంకాజనన నిజచరిత శయధృతశంఖా! |
99 |
| క. |
పంకజనాభా భంజిత పంకా పరమపురుష భవపరిభవనామా శంకరభావా కిసలయ సంకాశపదయుగ కలశశరనిధిశయనా! |
100 |
| . |
(పై రెండు కంద పద్యములను గలిపి వానిలోని రెండేసి పాదముల నేక పాదముగాఁ జేసి చదివినచో నది నాలుగు పాదములు గల క్రౌంచపద వృత్త మగును. లక్షణము: ప్రతి పాదము నందును భ, మ, స, భ, న, న, న, య, యను గణము లుండును. పదు నొకండవ యక్షరమునకును బందొమ్మిదవ యక్షరమునకును యతి.) |
|
| భుజంగప్రయాతగర్భ స్రగ్విణి. |
వాసుదేవా ఘనస్వచ్ఛకాంతీ రమా వాస వంశస్వరవ్యక్తవేద క్రమా రాసలాస్యప్రకార ప్రవీణోద్యమా వాసవాదిస్తుతవ్యక్తనామా నమః. |
101 |
| . |
(ఇది స్రగ్విణీ వృత్తము. దీనిలో మరొక భుజంగ ప్రయాత మను వృత్త మిమిడి యున్నది. పద్యాంత మందలి "నమః" యను పదమును "నమో" యని మొదటఁ జేర్చి చదివినచో భుజంగ ప్రయాత వృత్తమగును. స్రగ్విణి లక్షణము: ఇందుఁ బ్రతిపాదము నందును నాలుగు "ర" గణము లుండును. ఏడవ యక్షరము యతి. భుజంగ ప్రయాత లక్షణము: ఇందుఁ బ్రతిపాదమునందును నాలుగు "య" గణము లుండును. ఇందు నెనిమిదవ యక్షరము యతి.) |
|
| క. |
అని చిత్రగతుల నవ్విభుఁ గొనియాడి మునీంద్రుఁ డరిగె గోపవధూటి జనతా వల్లభుఁడును మి త్ర నికాయముతోడ నిజపురంబున కరిగె\న్. |
102 |
| చ. |
నిజపురి కేఁగుదెంచి ధరణీధరుఁ డప్పుడు భోజరాజ ధ ర్మజ కురునాథ ముఖ్య మహిమండలనాథులఁ దక్కుఁగల్గు బం ధుజనులఁ గల్పక ద్రుమజ నూతన దివ్య విభూష ణాంబర వ్రజము లొసంగి వీడ్కొని నిరంతర సౌఖ్యరసైక లోలుఁడై. |
103 |
| క. |
తలిరులతుదఁ జినుకులు జల జల వడియఁగఁ దడిసి మెలఁగు చలికరువలి ను న్పొలపమున విరియు పరువపుఁ దొలుమొగడల వలపుఁ దెలుపు తోఁటలలోన\న్. |
104 |
| క. |
దర దళ దంబుజ ముకుళో దర దళ మిళ దళికుల చ్ఛదప్రహతి సర త్సరస రజోధూసర పరి సర సరసీ తీర కుంజసదన స్థలుల\న్. |
105 |
| క. |
మరకత గోమేదక పు ష్యరాగ విద్రుమ విదూరసంభవ ముక్తా హరినీల వజ్ర కురువిం ద రత్నమయ కృతక భూమిధర కందరల\న్. |
106 |
| సీ. |
భోజకన్యా సరి ద్రాజహంసము, సత్య - భామా శుకీ కేళిపంజరంబు, జాంబవతీ నిశా చంద్రోదయంబు, కా - ళిందీ సరోజి నీందిందిరంబు, భద్రా కలాపినీ ప్రావృడంబుదము, సు - దంతా రసాల లతా పికంబు, మిత్రవిందా వనీ చైత్రాగమము, లక్ష - ణా హారయష్టికా నాయకంబు, |
|
| తే. |
షోడశసహస్రకామినీస్తోమ ధేను కా రిరంసా మదోత్కట వారణేంద్ర మనఁగ సౌఖ్యాంబునిధి నోలలాడుచుండెఁ గృష్ణుఁ డఖిలావనైక వర్తిష్ణుఁ డగుచు. |
107 |