| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| కృష్ణుఁ డింద్రుని నొప్పించుట | ||
| ఉ. |
ఱింగను మ్రోఁత మ్రోఁగుచును ఱెక్కలపాములువోలె శౌరిచే సింగిణివింట వెల్లిగొను చిత్రశరంబులు సూతు నొంచి ర థ్యాంగకము ల్దళించుచు నిజావయవంబులఁ దూల్ప దేవతా పుంగవుఁ డోసరించుటయు బోరన నడ్డము సొచ్చె సైన్యముల్. |
16 |
| మ. |
మది నొక్కించుక శంక లేక సమరోన్మాదంబునం బేర్చి బె ట్టిదమైతాఁకిన దేవతా రథిక కోటిం గిట్టి తూలించె ను న్మద మాతంగ ఘటా తమశ్చయ నిశమ్మన్యంబుఁ దత్సైన్యము\న్ గదచే శార్ఙ్గముచే రథాంగకముచేఁ గంసారి హింసారతి\న్. |
17 |
| ఉ. |
సైనికు లెల్ల నంత రణసన్నహనం బెడలించి పాఱిన న్నానయు నచ్చలంబు మది నాటుకొనంగఁ గపోల మండలీ దాన మిళద్ద్విరేఫ నినదంబుల ఘీంకృతి సందడింప వె ల్లేనుఁగుమీఁద డీకొలిపి యింద్రుఁ డుపేంద్రునిఁ దాఁకె నుద్ధతి\న్. |
18 |
| క. |
పునరాగతుఁడగు మఘవునిఁ గనుఁగొని తన మ్రోలనున్న కామిని నెమ్మో మున దృష్టి నిలిపి మురమ ర్దనుఁ డిట్లను హాస గర్భిత ప్రౌఢోక్తి\న్. |
19 |
| ఉ. |
అచ్చరలేమ లెల్ల నగ నాహవ భూస్థలిఁ దానుఁ దోడుగా వచ్చిన తద్దిశాపతి వర్గములుం దల లూడఁ బాఱియు న్మ చ్చటు లాస్త్ర ఘట్టన మనంబున నెంచక నానగండయై వచ్చినవాఁడు చూచితివె! వాసవునిం గమలాయతేక్షణా! |
20 |
| ఉ. |
చూడుము నన్నటంచు మధుసూదనుఁ డమ్మరిఁబోసి తద్భుజా క్రోడము గాఁడ నేసిన నకుంఠితుఁడై సురరాజు కృష్ణు నీ రేడుశరంబుల న్ఖగకులేశ్వరు ముప్పదిరెంట నేసెఁల్; బే ర్వాడి తదన్యదిక్పతులు గ్రక్కున గంధగజాధిరూఢు లై. |
21 |