| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | చతుర్థాశ్వాసము |
| శ్రీకృష్ణుఁడు పారిజాత వృక్షమును గొని పోవుట | ||
| క. |
హరి యపుడు పారిజాతా హరణోద్యోగమున నందనారామము ని ర్భరగతిఁ జొచ్చె విహగవర పరివృఢుపై నెక్కి సత్యభామయుఁ దాను\న్. |
50 |
| చ. |
సకల సురైక వంద్యుఁడగు చక్రధరుం డిదె నేఁడు దన్ను ను ర్వికిఁ గొనిపోవ వచ్చెనని వెక్కసమైన మనః ప్రభూత కౌ తుకమునఁ బోలె సంభ్రమముతో నటియించె నభీష్ట వస్తుదా యక తరుచక్రవర్తి యపు డాతత వాత విధూత శాఖమై. |
51 |
| క. |
సౌరి యిదె పారిజాతముఁ గోరికఁ గొని చనుచు మనలఁ గొనిపోఁడని లోఁ గూరిన నెవ్వగఁ దక్కిన భూరుహములు మధు రసాశ్రు పూరము నించె\న్. |
52 |
| మ. |
సురలోకాభిమత ప్రదాన సమతాసూయ న్బలెం గంస ఘ స్మరుఁ డత్యుద్ధతిఁ బారిజాతధరణీజాతంబు గోవర్ధనో ద్ధరణ ప్రస్తుతమైన హస్తమున నుత్పాటించి లీలాగతి\న్ గరుడ స్కంధముమీఁద నిల్పె, నిలిపెం గౌతూహలం బింతికి\న్. |
53 |
| చ. |
జలరుహనాభుఁ డిట్లు రభసంబున నందనపారిజాతముం బలిమిఁ బెకల్చి యెత్త విటపంబుల వ్రేలు దుకూల పల్లవం బులు వడిఁ బట్టి యీడ్చుఁ గొనిపోవఁగనీక పెనంగులీలఁ గ ల్పలతిక లెల్ల వల్లభలు ప్రాణవిభుం బెడఁబాయ నేర్తురే! |
54 |
| చ. |
గరుడుని ఱెక్కలం బొడము గాడ్పుల సోఁకునఁ దక్కు వేలుపుం దరువులుఁ బెల్లగిల్లి గగనంబునఁ దోడన వెంటనంటి రా నరిగెడు పారిజాత మహిజా హరణ వ్యసనైకలోలు నా హరిఁ గని యడ్డమై పలికి రచ్చటి నందనపాలు రందఱు\న్. |
55 |