| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | తృతీయాశ్వాసము |
| వసంత వైభవము | ||
| చ. |
సరసిజనేత్ర! చూచితె వసంతుఁడు నీవనవాటికా రమా తరుణియుఁ బాణిపీడన విధా సమయంబునఁ గేలుదోయి నొం డొరుపయి సమ్మదంబు లిగురొత్తఁగ మాటికిఁ జల్లు సేసఁ బ్రా ల్నెరసె ననఁగ వ్రాలెఁ గుహళీ విగళ న్నవకోర కావళుల్. |
53 |
| చ. |
చిలుకలు వాఁడి చంచువులఁ జించినచో లవలీదళంబుల\న్ ఫలరసరేఖ లంటి కనుపట్టెడుఁ జూడుము చైత్రుఁ డీలతా లలనల గండ దర్పణతలంబులఁ గుంకుమ పత్రభంగము ల్చెలువుగ వ్రాసెనో యన నళిప్రకరాద్వయ వాది కైశికా! |
54 |
| ఉ. |
పాదప నూత నాంబుధర పంక్తి విముక్త మరంద వర్షసం పాదిత శక్రగోపముల భావము నందుచు నోయదృష్ట సిం హోదర సన్నివేశ! కడు నొప్పెడు దాడిమబీజము ల్మదో న్మాదిత రాజకీర వదన త్రుటి తోరు ఫల చ్యుతంబులై. |
55 |
| క. |
తలిరాకు మెఱుఁగు వాతెఱ కలకంఠవిటుండు గమియఁగాఁ జూత లతా లలన విదిర్చెను గంటివె! యలి కంకణ ముఖర విటప హస్తముల సతీ! |
56 |
| చ. |
తనుఁ గనుఁ బ్రామి యొండొకలతం బతి వేఱొక తేఁటిబోటిపొ త్తున విరిదేనె గ్రోలఁగని తాలుచు సంపఁగితావి వెల్లిలోఁ గనలునఁ గూలఁబోవు నలికామిని సాహస మేమి సెప్ప! న య్యనుఁగుఁ బ్రియుండు నెచ్చెలులు నాఁగిన మాన దరాళకుంతలా! |
57 |
| చ. |
అనుచుఁ బ్రియాంసపీఠి నిజహస్తతలంబున నూఁది కల్పకా వనిజ దుకూల మార్జనల వంజుల పుష్ప మరంద సేచన\న్ దనదు విహార వైఖరికి నందనదేవత యాయితంబు సే సినగతి నొప్పు దివ్య వనసీమ ముదంబున సంచరించుచు\న్. |
58 |