| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| గరుత్మంతుని యాగమనము | ||
| సీ. |
వజ్రంబునకు నీఁక వైచిన బలశాలి, - గజ కచ్ఛ పాశన ఘాతుకుండు, జనని దాస్యంబు నీఁగిన కులశ్రేష్ఠుండు, - దుర్ల భామృత పశ్యతోహరుండు, కమలాప్తు సారథి గారాబుతమ్ముండు, - గశ్యప కృత పుణ్యకర్మ ఫలము, సకల శకుం తౌఘ సామ్రాజ్య ధౌరేయుఁ, - డహి మృగయా వ్యస నాకులుండు, |
|
| తే. |
మింటిపాళెంబు లేర్చు ముక్కంటి తూపు - గఱి, నిపాతిత రోహిణ స్కంధుఁ, డనిల మాన సాతీత వేగసంపద్ఘనుండు, తార్క్ష్యుఁ డేతెంచె దానవధ్వంసి కడకు. |
72 |
| క. |
మిన్నుననుండి భరంబునఁ బన్నగ పతి తలలు చదియఁబడ ధారుణిమీఁ ద న్నిలిచి వైనతేయుఁడు వెన్నుని పదములకు వినయ వినతి యొనర్ప\న్. |
73 |
| చ. |
మునిపతి రాకయుం, గుసుమముం దన కిచ్చినలాగు, రుక్మిణీ వనితకుఁ దా నొసంగుటయు, వంచనఁ బొంచిన బోటి సత్యకు\న్ మన మెరియంగఁ జెప్పుటయు, మానినికోపము, వేఁడుకొంటయుం దనదు ప్రతిజ్ఞయుం దెలిపెఁ దార్క్ష్యున కెంతయు నాదరంబున\న్. |
74 |
| ఉ. |
సంతసమంది, జాదులు ప్రసాదము నయ్యె నటంచుఁ బొంగి, నా గాంతకుఁ "డంబుజోదర! బలాసురవైరి మదీయ పక్షముం బంతము గొన్నవాఁ డశనిపాతమున న్మును; నాఁటనుండియు స్వంత మనంబులోఁ జనదు; నాపగ నీఁగెద నేఁడు నీకృప\న్." |
75 |
| చ. |
అనుటయు, నంతవాఁడవె కదా! యని మిక్కిలి గారవించి, య వ్వనరుహలోచనుండు దగువారి సుహృజ్జన బంధుకోటి రాఁ బనిచి, నిజ ప్రయాణమును బట్టణరక్షయుఁ జెప్పి, వారిచే ననుమతి గాంచి యెక్కె విహగాధిపుఁ దానును సత్యభామయు\న్. |
76 |