| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| సత్యాకృష్ణులు గరుడ వాహనారూఢులై స్వర్గమునకుఁ బయనమగుట | ||
| ఉ. |
ఆ విహగావతంసము నిజాంసముపైఁ బ్రియభామతోడ నిం ద్రావరజుండు నిల్చుటయు నాతత పక్ష మహానిలంబు లం భోవహ పంక్తిఁ దూలముల పోలికఁ దూల్పఁగఁ దద్దిశా ముఖుం డై వినువీథికి న్నెగసె నద్భుతకారి మనోజవంబున\న్. |
77 |
| క. |
ఇరు గ్రేవల నందక శా ర్ఙ్గ రథాంగ గదాయుధములు రాఁ దొడఁగె ఖగే శ్వర పక్ష జనిత వాతాం కుర పూర్తిని శంఖ మపుడు ఘుమఘుమ మ్రోసె\న్. |
78 |
| తే. |
అంబుధర జాల ముక్తంబు లయిన జలక ణములు సాత్రాజితీ కైశికమునఁ బొలిచె గగనతల లక్ష్మి పోరచి గాఁగ నిడినఁ జాల నొప్పారు మౌక్తిక స్తబక మనఁగ. |
79 |
| క. |
తళతళని మెఱుఁగుఁ దీఁగలు గలుగు ఘనాఘన చయంబు గనుఁగొనఁగా నిం పొలయించెఁ బసిడి కామల నలరెడు నీలముల గొడుగు లనఁగా హరికి\న్. |
80 |
| క. |
కమలదళాక్షుని దేహో ద్వమ దతి సాంద్ర చ్ఛవి ప్రవాహము వొలిచెం దమతండ్రి భానుఁ గనుఁగొన యమునానది గగనవీథి కరిగెడు ననఁగ\న్. |
81 |
| చ. |
ఖగకులనాథు పక్షముల గాడ్పు సహింపగ లేక రజ్జుప న్నగములు దేరిక్రిందికిఁ జన న్సరసీరుహమిత్రురథ్యముల్ నొగలఁ దొరంగి నిల్వ నరుణుండు రయంబునఁ జక్కఁ గట్టుచు\న్ గగనపథంబున దఱిమెఁ గాలవిలంబన మందకుండఁగన్. |
82 |
| క. |
నతి సేసె వైనతేయుఁడు గతిభేదములోన నన్నఁ గనుఁగొని, యతఁడు\న్ గతిలోనన దీవించినఁ, జతురతకు న్మెచ్చి రపుడు సత్యయు హరియు\న్. |
83 |
| క. |
మురమర్దనుఁ డివ్విధమ్మున గరుడునిపై గగన పథము గడచి యరుగుచుం దరళాయతాక్షి కిట్లను సరస స్మిత వచన రచన చాతురి మెఱయ\న్. |
84 |