| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| శ్రీకృష్ణునకు వైతాళికుల మేల్కొలుపులు | ||
| మ. |
జయ గోవింద! ముకుంద! చక్రధర! కంసద్వేషి! సాత్రాజితీ ప్రియ! నారాయణ! కౌస్తుభాభరణ! కుంభి త్రాణ పారీణ! కా ళియ దర్పఘ్న! పతంగ వాహ! వనమాలీ! కృష్ణ! వైకుంఠ! శౌ రి! యశోదాత్మజ! భక్తవత్సల! మురారీ! గోపికా వల్లభా! |
56 |
| మ. |
శరధి క్రోడ నివేశ! శార్ఙ్గ ధర! శిష్టధ్యేయ! శీతాంశు భా స్కర నేత్రద్వయ! శుభ్రపంకరుహ భాస్వన్నాభ! శూరాన్వయా భరణా! శేషశయాన! శైలధర! శోభా రమ్య సర్వాంగ! శౌ ర్య రసోదంచిత! శంఖ చక్ర ధర! శర్వాణీ సహాయ ప్రియా! |
57 |
| క. |
మేల్కనుము దేవ! యివె రా చిల్కలు కనుమొగిచియున్న చెలువలఁ దమకుం బల్కులు నేర్పగఁ ముద్దులు కుల్కెడు పల్కులను మేలుకొలిపెడుఁ గృష్ణా! |
58 |
| సీ. |
చర మాద్రి దావాగ్ని సంప్లుష్ట సురసౌర - భేయీ కరీషైక పిండ మనఁగఁ, బహు చకోర దంశ పరిపీత చంద్రికా - క్షౌద్ర నీరస మధుచ్ఛత్ర మనఁగఁ, బ్రత్యఙ్ముఖోచ్చల ద్రాత్రి వర్షీయసీ - పలిత పాండుర కేశ బంధ మనఁగ, గగన సౌధాలేపకర కాలశిల్పి ని - ర్ముక్త సుధా వస్త్ర ముష్టి యనఁగ, |
|
| తే. |
సుమహిత జ్యోత్స్నికా లతా సుమగుళుచ్ఛ మనఁగ నతిధూసర చ్ఛాయ నబ్జవైరి చెలువు వోనాడి బింబావశిష్టుఁ డగుచు నల్ల నల్లన వ్రాలెడు నంబుజాక్ష! |
59 |
| చ. |
జలరుహమిత్రుఁ డాత్మ రుచి సంపదఁ జీఁకటి బందెకానికిం గలఁగుచు వీనిలోన నిడి కైకొన నమ్మికకాపు లంచుఁ జు క్కలదొర యెండ దాడి విని గ్రక్కునఁ దానును గాంతి వీనిలో పల నెలకొల్పె నాఁ బలుకఁబాఱె నిశాంత నిశాంతదీపముల్. |
60 |
| మ. |
దర మీల న్నయనంబులైగృహ బహిర్ద్వారంబుల న్యామకుం జరము ల్గండ మద భ్రమ ద్భ్రమరికా ఝంకార సంగీత వి స్ఫురణ ల్సూపుచుఁ గర్ణతాళ నినదంబు ల్మించఁగా మాగధో త్కరముం బోలుచుఁ జూడనొప్పె నివె హస్త న్యాసముల్మీఱఁగ\న్. |
61 |
| మ. |
సమ యాభీర కుమారుఁ డేపునఁ దమిస్రా రూప నక్తంచరిం గమలారిస్తన మండలాంక విష సంక్రాంత ప్రభా దుగ్ధపూ రముతో రూపఱఁజేయ శోషిలుచుఁ దార ల్సోల నిట్టూర్పు సాం ద్రముగా నూర్చె ననంగఁ బెల్లెసఁగెఁ బ్రాతఃకాల వాతూలముల్. |
62 |
| క. |
మంచునఁ దోఁగిన పల్లవ సంచయము భవ ద్వియోగ సంతాప రుద చ్చంచల నయనాబాష్ప క ణాంచిత బింబోష్ఠలీల నలరె నుపేంద్రా! |
63 |
| తే. |
కమ్మ కస్తురి గుళికలు తమ్మిలేమ నిదుర మంపునఁ బుక్కిట నించి మేలు కాంచి వేకువ నుమిసె నాఁ గమల ముకుళ కోటరంబుల నెలదేఁటి కొదమ లెగసె. |
64 |
| మ. |
విననయ్యెం గృకవాకు కూజితము లుద్వేలంబులై సూరసూ త నవోద్యత్కర కుంచికా విఘటిత ధ్వాంతారర క్రక్రియా స్వనము ల్కైరవిణీ ప్రసూన పృథుక స్వాప క్రియాలో లికల్ దినకృన్మార్గ నివారణ త్వరిత మందేహోగ్ర సింహధ్వనుల్. |
65 |
| తే. |
రాజు వీడెత్తి చనినఁ దారక భటాళి యంబరాభోగ నిజ శిబిరాంగణమునఁ గాలుకొల్పిన పావక జ్వాల లనఁగఁ బ్రాచిఁ గనుపట్టె నవ సాంధ్యరాగ రుచులు. |
66 |
| తే. |
కమలినీ జృంభికలకు దిక్కాంత లెల్ల హస్తతాళంబు లొనరించి రనఁగఁ జెలఁగె లలిత కాసార కూల కులాయ చలిత శకున పక్షజ పటపట స్వనము లధిప. |
67 |