| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| చంద్రాభ్యుదయము | ||
| ఉ. |
యామవతీ కళత్రు నుదయావసరంబునకంటెఁ బాండిమ శ్రీ మునుదోఁచెఁ దూర్పుదెస, సిద్ధము కృష్ణుఁడు పారిజాతము\న్ భామినికై హరించు నని పాయని నెవ్వగ నింద్ర రాజ్యల క్ష్మీ ముఖ మండలంబున వసించిన వెల్లఁదనంబు కైవడి\న్. |
38 |
| సీ. |
కెరలి చీఁకటి మ్రాను గెడపంగ నిక్కిన - సమయ గజంబు దంతము లనంగఁ, జదలు గేదఁగి తూర్పు తుదకొమ్మ నరవిరి - యై కానిపించు పూ రేకు లనఁగఁ, బొడుపు గుబ్బలి నేల పురిటింటి యిడుపునఁ - జఱచిన గందంపుఁ జట్ట లనఁగ, మరుని ముందఱ బరాబరిసేయు కంచుకి - కులము చేతుల వెండిగుదె లనంగఁ, |
|
| తే. |
గైరవములకు వెన్నెల నీరు పఱవఁ బూని చేర్చిన పటికంపు దోను లనఁగఁ, గ్రమముతో శీతకర మయూఖములు గగన భాగమునఁ గొన్ని యల్లనఁ బ్రాకుఁదెంచె. |
39 |
| తే. |
అమరు లమృతాంబునిధిలోని యమృత రసము వెండి చేరులఁ బటికంపుఁ గుండ కట్టి చేఁదుకొనియెదరో! నాఁగ శీతరోచి మెఱుఁగు మెయితోన యల్లన మిన్ను ప్రాఁకె. |
40 |
| చ. |
అమరుల బోనపుట్టిక, సహస్రమయూఖుని జోడుకోడె, సం తమసము వేరువిత్తు, కుముదంబుల చక్కిలిగింత, పుంశ్చలీ సమితికిఁ జుక్కవాలు, నవ సారస లక్ష్మి తొలంగు బావ, కో కములకు గుండె తల్లడము, కైరవమిత్రుఁడు తోఁచెఁ దూర్పున\న్. |
41 |
| ఉ. |
పొందుగఁ బశ్చిమాబ్ధి తట భూస్థలి నంశుమ దంశుమత్ఫలా కందము వాసరాంత హలిక ప్రవరుం డిడ సాంధ్య వారిభృ త్కందళముల్ తమోదళ యుతంబులు నైగెల పండి వ్రాలెఁ బూ ర్ణేందునిపేరఁ బ్రాచి నది హేతువు వెన్నెలకల్మి కల్మికి\న్. |
42 |
| చ. |
సమయ విలాసి శోణమణి సంగత మౌక్తిక చారు హారము\న్ గ్రమమున గూర్చుచో నరుణరత్నము దా మును సాంధ్య రశ్మి సూ త్రమునఁ బొసంగఁ గ్రుచ్చియెడతప్పునఁ ద్రోచి పిఱుందఁజేర్చు ము త్తెము క్రియఁ దోఁచె నయ్యమృతదీధితి లాంఛన రంధ్ర సంగతి\న్. |
43 |
| చ. |
దిన పరిణామ లక్ష్మికిఁ బ్రతీచి తగం గయిసేయు వేడుక\న్ వనరుహమిత్రబింబ మను వర్తుల లాక్షిక పట్టికం బయో ధి నడుమఁ దోఁచి సాంధ్య నవదీప్తి రసంబు హరించె, పాఱవై చిన వెలిదూదియో యనఁగ శీతకరుం డుదయించె నత్తఱి\న్. |
44 |
| మ. |
కడఁక\న్ రేచలిగట్టు పట్టిఁ దను వేడ్కం గూర్ప నేతెంచి వై\న్ జడిగాఁ జుక్కలతూపు లేయఁ గినుక\న్ జాబిల్లి ముక్కంటి తాఁ బొడుపుం గెంపను వేఁడికంట నిరుల న్పూవిల్తు మేనేర్చి చొ ప్పడఁ దద్భూతి యలందెనా!నపుడు బింబం బొప్పెఁ బాండుద్యుతి\న్. |
45 |
| చ. |
తొలుమలఱాతితో నొరయు తూరుపుఁ దొయ్యలి ముత్తియంపుఁగుం డలమున మానికంబు పడినం గనుపట్టెడు లక్కగూఁడు నాఁ జలువలఱేని యప్పొడుపుఁజాయఁ దొఱంగిన కందు తోఁచె రే చెలువ కనుంగవం గమియఁ జెందిన కాటుక కప్పు కైవడి\న్. |
46 |
| మ. |
అమృతం బాసవ, మంగరాగ ముదయోద్యత్కాంతి, చేలంబు చి హ్నమునుంగా శశి రేవతీరమణుఁ డున్మాదంబుమీఱం దమో యమున న్భంగమునొంది పాఱఁ గర సీ రాలోడితం జేయ వ చ్చె మరుద్వాహిని దానిఁదేర్పనన మించెం జంద్రికా పూరముల్. |
47 |
| తే. |
తారకాధీశు కిరణ కదంబకంబు చిలికెఁ బలుచని వలిపంపు జిలుఁగు మంచుఁ గైరవశ్రీ వధూ కరగ్రహణ వేళ వెలికిఁ గ్రమ్మిన సాత్త్విక స్వేద మనఁగ. |
48 |