| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| అంధకార వర్ణనము | ||
| సీ. |
దిన వారిరాశి మా పను మౌని గ్రోలంగ - నడుగునఁ గనుపట్టు నస లనంగఁ, గ్రుంకుమె ట్టడవిఁ గార్కొనిన సంధ్యా వహ్నిఁ - బొడమిన దట్టంపుఁ బొగ యనంగఁ, దన మణి పడిపోవ ధరణీ తలంబున - నెమకంగ వచ్చిన నింగి యనఁగ, నల చుక్క లనియెడి వలరాజు గెలుపు వ్రా - ల్దెలియఁ బూసిన మషీ లేప మనఁగ, |
|
| తే. |
వృద్ధ వారవిలాసినీ విసరమునకు నపలితంకర ణౌషధం బనఁగ, జార నలినముఖుల కదృశ్యాంజనం బనంగ, నంధకారంబు జగమెల్ల నాక్రమించె. |
34 |
| సీ. |
చిలుక తేరును, నల్ల చెఱకు విల్లును, గల్వ - విరితూపు, నిత్తుము మరుఁడ! నీకు వనమాలికయు, నూత్న వంశనాళమును, బిం - ఛము సమర్పింతుము శౌరి! నీకుఁ, గప్పుఁ గప్పడమును, గస్తూరియును, గాటు - కయు నివేదింతుము కాళి! నీకుఁ, నేరేడుపండ్లు, వినీల చామరలు, దూ - ర్వలు, నొసంగుదు మిభవక్త్ర! నీకు, |
|
| తే. |
నిట్టి లోకోపకారికి నిరులుదొరకుఁ జంద్ర సూర్యాది దుర్దోష శాంతి వొదలి నిత్యత వహింపఁ జేయంగ నేర్తురేని యనుచుఁ బ్రార్థించి రభిసారికాబ్జముఖులు. |
35 |
| చ. |
మొనసిన దీపికా నికరముల్ గృహ కార్య గతాభిసారికా వనితల యూర్పు గాడ్పుల నెపంబునఁ గంపము నొంద నోడకుం డని తిమిరంబు తా నభయహస్త మొసంగె ననంగ వానిపైఁ గనుఁగొనఁ బొల్చె నంకురిత కజ్జలవన్నవధూమ మాలికల్. |
36 |