| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| నారదుఁడు శ్రీకృష్ణ సత్యభామలఁ జూడవచ్చుట | ||
| క. |
చనుదెంచెఁ గలహభోజన ముని రుక్మిణి వీడుకొల్ప మున్నీటి జలం బున మజ్జనాది మాధ్యం దిన కృత్యము లాచరించి నిష్ఠాపరుఁడై. |
16 |
| చ. |
అతనికి సత్యభామయు మురాసురవైరియు నాతిథేయ స త్కృతు లొనరించి యుండఁగ, సఖీమణు లిద్దఱు పళ్ళెరంబు వె ట్టితి మని విన్నవించినఁ, దటిల్లతయు న్జలదంబు యామినీ పతి వెనుకొన్న కైవడిఁ దపస్వియుఁ దామును భుక్తిశాలకు\న్. |
17 |
| మ. |
చని గారుత్మత రత్న పాత్రికలఁ గంసద్వేషి సాంబాది నం దనులు న్సాత్యకి ముఖ్య సోదరులు నానాబంధు సంతానముం దలమ్రోల న్వసియింప మౌనిపతిచెంత దాను నర్హాసనం బున నుండె న్భుజియింప వీవనల నంభోజేక్షణ ల్వీవఁగ\న్. |
18 |
| సీ. |
శాకపాకంబుల చవులు వక్కాణించు - గతిఁ గంకణంబులు గల్లుమనఁగ నతివేగ మిడుఁడు మీ రను మాడ్కి మేఖలా - కీలిత రత్నకింకిణులు మొరయఁ, గలమాన్న రుచితోడఁ గలహించుజాడ దు - వ్వలువ పింజలు ఫెళఫెళ యనంగ, నారగింపుఁడు మీర లని ప్రియం బాడెడు - పొలుపున మెట్టియ ల్గిలుకరింప, |
|
| తే. |
నలరుఁ బోఁడులు వడ్డింప నచటఁ గలహ భోజియును దాను బహు భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయముల మధుసూదనుండు సారెఁ గొనియాడుచును వేడ్క నారగించె. |
19 |
| తే. |
వామనేత్రీ కరాంచ లావర్జ్యమాన కనక భృంగారు కర్కరికా ముఖాగ్ర గళిత గంధోదకంబులఁ గంసవైరి చేతులను వార్చె బాంధవ శ్రేణితోడ. |
20 |
| క. |
అప్పుడు తాంబూలంబులు కప్పురమును జాలపల్లికలఁ బడఁతులు తే నిప్పించె బంధుకోటికి న ప్పద్మదళాయతాక్షుఁ డంతట సతియు\న్. |
21 |
| తే. |
అంతిపురమున నుచిత కృత్యములు దీర్చి చంద్రశాలా స్థితుం డైన శౌరికడకు సంతసంబున వచ్చి యాసంయమీంద్రు నడుగులకు నెఱఁగుడు, నతఁ డాదరమున. |
22 |