| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ద్వితీయాశ్వాసము |
| సత్యా సౌధమున శ్రీకృష్ణుని మజ్జన భోజనాదులు | ||
| క. |
తలిరాకుఁబోణి యొక్కతె జలకమునకు వేళ యనుచు శౌరికి వీణా కలకలములఁ గలకల నగు పలుకుల మెలపొలయ విన్నపము గావించె\న్. |
5 |
| ఉ. |
ఇంచిన వేడ్క నాత్మహృదయేశ్వరిఁ గన్గొని శౌరి మందహా సాంచిత నేత్రుఁడై జలకమాడఁగ లెమ్మని పైఁడిచేల కొం గించుక జాఱ నొక్క తరళేక్షణ హస్తముఁ గేల నూఁదుచుం గంచుకి సంచయము సముఖా! యన గద్దియ డిగ్గె, డిగ్గినన\న్. |
6 |
| క. |
ప్రామినుకుల పూఁబోఁడుల సీమంతపుఁ జెందిరంబుచే బలె నరుణ శ్రీమించు నతని పదముల భామామణి యోర్తు పయిఁడి పావలు తొడిగె\న్. |
7 |
| తే. |
కేళిగతి మీఱ మజ్జనశాల కరిగి శాతమన్యవ మణిమయాసనమునందుఁ గౌస్తుభాది విభూషణోత్కరము లెల్ల నొయ్య నొయ్యన సడలించి యున్న యంత. |
8 |
| ఉ. |
కంపన లీలమై నసదుఁగౌ నసియాడఁ, గుచద్వయంబు న ర్తింప, లలాటరేఖ చెమరింపఁగ, హారలతా గుళుచ్ఛముల్ తుంపెసలాడఁ, గంకణ మృదుధ్వని తాళగతిం జెలంగఁగా, సంపెఁగ నూనె యంటె నొక చంద్రనిభానన కంసవైరికి\న్. |
9 |
| ఉ. |
తామరదోయిలోఁ దగిలి దాఁటెడు తేఁటులువోలెఁ బెన్నెఱుల్ వేమఱు చేతులం బిడిచి విప్పి విదిర్చి నఖాంకురంబులం గోమలలీల దువ్వి తెలి గొజ్జఁగి నీ రెడఁ జల్లి చల్లి గం ధామలకంబు వెట్టె నొకయంగన కాళియనాగ భేదికి\న్. |
10 |
| మ. |
చెలువ ల్గొందఱు హేమకుంభములతోఁ జేసే నొసంగ న్విని ర్మల దోర్మూలరుచు ల్వెలిం బొలయఁ దోరంబైన చన్దోయి సం దొలయ న్వేనలి జాఱ నిక్కి యరమే నొయ్యారమై వ్రాలఁగా జలకంబార్చె లతాంగి యోర్తు యదువంశ స్వామికి న్వేడుక\న్. |
11 |
| సీ. |
చంద్రిక పూవన్నె జిలుఁగు దువ్వలువను - దడియొత్తె నొక్క కాంతాలలామ, కొనగోళ్ల నెఱులు చిక్కులు వాపి మెలపున - శిర సార్చె నొక్క లేఁజిగురుఁబోఁడి, వెన్నెల నిగ్గులు వెదచల్లెడు మడుంగు - లందిచ్చె నొక్క పూర్ణేందువదన, నవరత్నమయ భూషణవ్రజంబులు మేనఁ - గీలించె నొక రాజకీరవాణి, |
|
| తే. |
విరుల సరు లిచ్చె నొక యరవిందగంధి, యలఁదెఁ జందన మొక ధవళాయతాక్షి, సుదతి యొక్కతె కపురంబు సురటి విసరె, నిలువు టద్దంబు నొకయింతి నిలిపె నెదుట. |
12 |
| క. |
కలికి నిడువాలుఁ గన్నుల తళుకులు మణిదీప శిఖలుఁ దడఁబడ లక్ష్మీ నిలయునకిచ్చిరి కొందఱు నెలఁతలు మౌక్తిక విచిత్ర నీరాజనముల్. |
13 |
| మ. |
జలకం బాడి, మడుంగు కట్టి, మణిభూషా దీప్యమానాంగియై, కలపం బెంతయు వింతగా నలఁది, చెంగల్వ ల్నెఱిన్మించ వే నలిఁ గీల్కొల్పి, పసిండి యందె రవళి న్రాయంచ లంతంత రా జెలులుం దానును సత్యభామ చనుదెంచె న్నాథుఁడుప్పొంగఁగ\న్. |
14 |
| సీ. |
మాత్సర్య ఘన మేఘమాలికాపగమ ప్ర - కాశిత హిమధామ కళ యనంగ, విరహ నిశీథినీ విరమ సంప్రాపి తో - న్మీల నామోద పద్మిని యనంగఁ, గ్రోధ దంతావళ క్షోభ విభ్రమ పున - స్సంజాత నైర్మల్య సరసి యనఁగ, సంతాప నైదాఘ సమయ నిర్గమ కోర - కిత నవ మాలతీ లతిక యనఁగఁ, |
|
| తే. |
శాంతిఁ జెన్నారి వికసిత స్వాంత యగుచుఁ గలఁక యెంతయు దిగఁద్రోచి చెలువ మెసఁగఁ జేరవచ్చిన ప్రియభామ గారవించి యున్న యత్తఱి మురవైరి సన్నిధికిని. |
15 |