| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| సత్య కోప గృహ ప్రవేశము | ||
| క. |
అని వగల మిగులఁ బొగులుచు జనితామర్షమునఁ గోప సదనంబునకున్ జనియెను లతాంగి హరిచం దన కోటరమునకు నాగ తరుణియుఁ బోలెన్ |
98 |
| ఉ. |
మాసిన చీర గట్టికొని మౌనము తోడ నిరస్త భూషయై వాసెన కట్టు కట్టి నిడువాలిక కస్తురి పట్టు పెట్టి లో గాసిలి చీఁకటింటికడఁ గంకటి పై జలదాంత చంద్ర రే ఖా సదృశాంగియై పొరలె గాఢ మనోజ విషాద వేదనన్ |
99 |
| చ. |
బిసరుహ పత్ర లోచనకుఁ బెల్లగు మోహము సంఘటిల్లె, వె క్కసమగు నెవ్వగ ల్వొడమెఁ, గంపము పుట్టెఁ, జెమర్చె మేను, మా నసమున విన్నఁబాటొదవె, నాటెఁ గడుం బరితాపవేదనల్, మసకపుఁ బాము కాటు గతి మచ్చరమ న్విస మగ్గలింపఁగన్ |
100 |
| చ. |
వెడ వెడ కన్ను మూయుఁ, గను విచ్చు, నగుం, దలయూఁచుఁ, బాన్పు పైఁ బడు, నుసురంచు లేచుఁ, దడఁబాటును దత్తఱముం జలంబు లో నడరఁగఁ గోపవేగమున నగ్గలమైన మనోజుబాధలం బడి మద హస్తి హస్తగత పద్మినియుం బలె సొంపు పెంపఱన్ |
101 |
| క. |
ఈ పగిదిన్ సాత్రాజితి కోపోద్వేగమున వగల కుందుచు ఘన సం తాపంబు పేర్మి నితర వ్యాపారము మాని యుండె హరియును యటచన్ |
102 |