| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| సత్యభామ యాగ్రహోదగ్రత | ||
| చ. |
అనవిని వ్రేటు వడ్డ యురగాంగనయుం బలె, నేయి వోయ భ గ్గున దరి కొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి, హె చ్చిన కనుదోయి కెంపు తన చెక్కులఁ గుంకుమ పత్ర భంగ సం జనిత నవీన కాంతి వెదచల్లఁగ గద్గద ఖిన్న కంఠియై |
82 |
| శా. |
ఏమేమీ! కలహాశనుం డచటికై యేతెంచి యిట్లాడెనా! యామాట ల్చెవియొగ్గి తా వినియెనా యాగోపికావల్లభుం డేమే మాడెను రుక్మిణీ సతియు? నీ వింకేటికిన్ దాఁచెదే! నీ మోమోటలు మాని నీరజముఖీ! నిక్కం బెఱింగింపవే! |
83 |
| చ. |
అతుల మహానుభావ మని యవ్విరిఁ దానొక పెద్ద సేసి య చ్యుతునకు నిచ్చకంబొదవ సూడిద యిచ్చిన నిచ్చెఁగాక తా, నతఁడు ప్రియంబు గల్గునెడ కర్పణ సేసినఁ జేసెఁగాక, యా మతకరి వేలుపుం దపసి మమ్ముఁ దలంపఁగ నేల యచ్చటన్? |
84 |
| క. |
పలు దెఱఁగు ముళ్ళ మాటలు కలహమె కల్యాణ మని జగంబుల వెంటన్ మెలఁగెడు మౌనికి సహజము; వలదని వారింపవలదె వల్లభుఁ డతనిన్? |
85 |
| క. |
ముని యేమి సేయు! రుక్మిణిఁ గొనఁ గారణ మేమి! ధూర్త గోపాలుఁడు సే సిన చెయిద మేమి చెప్పుదు! మన మెరియదె! ప్రాణమైన మగఁడిట్లయినన్ |
86 |
| క. |
పరికింపరు తమజాడలు, తరుణుల తగులములు నమ్మఁ దగదండ్రు మదిన్ శరదంబుద చలచిత్తులు పురుషులె పో; వారి నమ్మఁ బోలునె! చెలియా! |
87 |
| ఉ. |
ఇన్ని దినంబులున్ సవతు లిందఱలోఁ గడు గారవంబునం గన్నియ! నన్ను వల్లభుఁడు కన్నులఁ గప్పుకొనంగ నుండి యా వన్నెయు వాసియుం దొలఁగి వారు ననుం దల లెత్తి చూడఁగా సన్నలఁ జాయలం బలుక సైఁతునె! ప్రాణము లెంత తీపొకో! |
88 |
| ఉ. |
నామొగ మోటకై వలని నాటకముల్ గటియించి, రుక్మిణీ కామిని మీఁదటం గలుగు గౌరవముం గృపయుం బ్రియంబుఁ దా నేమియుఁ గాననీక, యిట నిన్ని దినంబులు నన్నుఁ దేల్చెనో తామరసాక్షి! మెచ్చవలదా! మురదానవ భేది కృత్యముల్ |
89 |
| ఉ. |
ఓ చెలి! శౌరి కిచ్చెనఁట యొక్కలతాంతముఁ దెచ్చి నారదుం డా చపలాక్షి కిచ్చెనఁట యాతఁడు నవ్విరి, యిట్టిమాట లా హా! చెవుల న్వినఁబడియుఁ బ్రాణము దాల్చెద మేన; నింతగా నోఁచితి, నింక నెట్టివి కనుంగొన నెమ్మెయి నున్న దాననో! |
90 |
| క. |
పూనుకొని మేలు గీళ్ళకు లోనయి విహరించువారి లోక మెఱుఁగదో! యా నరకాసుర దమనుఁడు తా నెఱుఁగఁడొ! భోజకన్య తా నెఱుఁగదొకో! |
91 |
| ఉ. |
ఆ సరసీరుహాక్షి నిలయంబునఁ బంకజనాభుఁ డుండుటం జేసి యొసంగెఁబో! తగవు సేకొని యొక్క లతాంత, మింతలో వాసియు వన్నెయుం దగవు వైభవముం జలము న్వివేకమున్ బో సవతు ల్భజించుటకుఁబో వెఱఁగయ్యెడు, నేమి సెప్పుదున్! |
92 |
| క. |
కలకాల మొక్కగతిఁ బూ సలలో దారంబు మాడ్కి సతి మదిలోనన్ మెలఁగెడు పురుషుఁడు గలుగుట తొలుజన్మము నోముఫలము తోయజనేత్రా! |
93 |
| సీ. |
కలలోన నైన నవ్వుల కైన నామాట - జవదాఁట వెఱచు నో చంద్రవదన! యేపదార్థంబు నాయెదుటఁ బెట్టక మున్న - యెవ్వారి కొసఁగఁడో యిగురుఁబోఁడి! చెలులు నాతో నేమి చెప్పుదురో యని - లంచంబు లిచ్చు నో చంచలాక్షి! తోడిచేడియలు నాతోడి వంతులకు రా - సయిరింపఁ జాలఁడో సన్నుతాంగి! |
|
| తే. |
యరమరలు లేని కూరిమి ననఁగి పెనఁగి కొదలు తీఱని కోర్కులఁ గూడి మాడి కపట మెఱుఁగని మమతలఁ గలసి మెలసి యున్న విభుఁడిట్లు సేయునే యో లతాంగి! |
94 |
| సీ. |
కృతకాద్రి కందరా కేళీ నిగూహన - వేళా పరస్పరాన్వేషణములు, పోషిత మాధవీ పున్నాగ పరిణయో - త్సవ కల్పితానేక సంభ్రమములు, చాతురీ నిర్జిత ద్యూత పణాదాన - కలిత చేలంచలాకర్షణములు, సాయం సమారంభ చక్రవాక ద్వంద్వ - విరహావలోకన విభ్రమములు, |
|
| తే. |
సాంద్రతర చంద్రికా కేశి చంక్రమములు, విధు శిలామయ వేదికా విశ్రమములు, ఫలక చిత్రిత నిజరూప భావనములు, మఱచెనో కాక! రుక్మిణి మాయఁ దగిలి |
95 |
| క. |
పతి ప్రాణ సదృశ బంధువు, పతి దైవం, బేడుగడయుఁ బతి సతులకు, న ప్పతియ కడు మేర తప్పిన గతి కులకాంతలకు వేఱు గలదే చెపుమా! |
96 |
| క. |
ధనమిచ్చి పుచ్చుకొన్నను మనమున నోర్వంగ వచ్చు; మగఁ డింతులకున్ జన విచ్చి పుచ్చుకొన్నను మన వచ్చునె? యింక నేటి మాటలు చెలియా! |
97 |