| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| శ్రీకృష్ణుఁడు సత్య సౌధమున కరుగుట | ||
| మ. |
ముని నాకిచ్చిన పూవు చందమును నే మున్నాడి యా భోజనం దన కర్పించిన జాడయున్ దెలియ చెంతన్నిల్చి వీక్షించి పో యిన సాత్రాజితి బోటి నా వలన తా నేమేమి కల్పించెనో యని ప్రద్యుమ్నుని మౌని దండ నిడి చింతాయత్త చిత్తంబుతోన్ |
103 |
| ద. |
అరదము నెక్కి కేతన పటాంచల చంచల మైన తాల్మితోన్ తురగ జవంబు మున్గడవ త్రోచి కడంగెడు తత్తరంబుతోన్ తిరిగెడు బండి కండ్ల పగిదిన్ భ్రమియించు మనంబు తోడ శ్రీ హరి సనుదెంచె సత్య సముదంచిత కాంచన సౌధ వీథికిన్ |
104 |
| తే. |
వచ్చి యరదంబు డిగ్గి తద్ద్వార సీమ దారకుని నియమించి తాన యొకడు కమలనాభుండు కక్ష్యాంతరములు కడచి యలబలము లేని నగరెల్ల నరసి చూచి |
105 |
| సీ. |
కనక పంజర శారికలకుఁ జక్కెర వెట్టి - చదివింప రేలొకో సకియ లిపుడు! కరతాళ గతుల మందిర మయూరంబుల - నాడింప రేలొకో యతివ లిపుడు! క్రొవ్వాఁడి గోళ్ళఁ దంత్రులు మీటి వీణియ - ల్వలికింప రేలొకో భామ లిపుడు! కలికి రాయంచ బోదల నల్ల నెలయించి - నడిపింప రేలొకో పడఁతు లిపుడు! |
|
| తే. |
ఇన్ని దినముల వలె నుండ దేమి నేఁడు! చిన్నవోయిన దీ మేడ చెన్ను తఱిఁగి; పద్మ ముఖి తోడ నెవ్వరేఁ బారిజాత పుష్ప వృత్తాంత మెఱిగింపఁ బోలు నొక్కొ! |
106 |
| క. |
అని యనుమానించుచు నొ య్యన కోప గృహంబు జేరి యా సత్రాజిత్ తనయ ముసుంగిడి యుండగ ననువు మెఱయ జొచ్చి మాయ యచ్చు పడంగన్ |
107 |
| ఉ. |
కొందర మంతనంబులను కొందర జంకెన వాడి చూపులన్ కొందర చేతి సన్నల దగుల్పడ జేయుచు మీర బోయి మ ధ్యందిన భాను మండల కరావళి హావళి వాడి యున్న తీ గందలపించు నమ్మగువ కన్గొని యెంతయు విస్మితాత్ముడై |
108 |