| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| సత్యకుఁ జెలికత్తె పారిజాత వృతాంతము సెప్పుట | ||
| క. |
అమ్మా! యేమని చెప్పుదు, నెమ్మి న్నీ విభుఁడు రుక్మిణీసతి మణి సౌ ధమ్మున నుండఁగ సురముని క్రమ్మఱ నాకస్మికమ్ముగా నచ్చటికిన్ |
75 |
| క. |
చనుదెంచి యమ్మురారికి ననఘమ్మమరైక యోగ్య మతి సౌఖ్య కర మ్మనితర సులభ మ్మిది యని కొనియాడుచు నొక్క దివ్య కుసుమ మ్మొసఁగెన్ |
76 |
| క. |
మిన్నంది వేగఁ గైకొని కన్నుల నొత్తికొని మ్రొక్కి గారవ మెసఁగన్ వెన్నుఁడు రుక్మిణి కొసఁగెను అన్నెలఁతయుఁ గొప్పులోన నవ్విరిఁ దాల్చెన్ |
77 |
| తే. |
అంతలోనన యద్భుతం బావహిల్లఁ గొలఁది యిడరాని యొక వింత చెలువు గలిగి రాజ బింబాస్య రుక్మిణి తేజరిల్లె సాన పట్టిన మకురాంకు శస్త్రమనఁగ |
78 |
| ఉ. |
ఆ కుసుమంబు దాల్చిన మహా మహిమంబునఁ దోడి కామినీ లోకము మచ్చరంబు మదిలోనఁ దొఱంగి భజించుచుండ, న స్తోక నిజ ప్రభావములు సూపెడు గద్దియ మీద నెక్కి ము ల్లోకము దాన యేలు గతి లోలవిలోచన! యేమి సెప్పుదున్ |
79 |
| ఉ. |
ఎంతకు లేఁడు నారదమునీంద్రుఁడు; శౌరి వినంగ, రుక్మిణీ కాంత వినంగ, నేను వినఁగాఁ, బలికెం "బతిఁ గూర్చుదాన నా యంతటి వారు లేరని యహంకృతి నెప్పుడు విఱ్ఱ వీఁగుచున్ వంతున వచ్చు సత్య గరువంబిఁకఁ జెల్ల" దటంచు మానినీ! |
80 |
| క. |
ఆ రణభోజను మతకము, లా రుక్మిణి నటన, లా మురాంతకు చెయ్వుల్ చేరి కనుంగొనుచో నె వ్వారికిఁ గోపంబు రాదు! వారిజనేత్రా! |
81 |