| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| రుక్మిణిపైఁ గృష్ణ ప్రేమాతిశయ ప్రశంస | ||
| ఉ. |
ఇన్ని దినంబులున్ సవతు లిందఱలో నల సత్యభామ కన్ సన్నలఁ ద్రిమ్మరున్ హరి వశంవదుఁడై యన విందుఁ; గాని యో కన్నియ! నీయెడం గలుగు గారవ మెయ్యెడఁ జూచి కాన; లే కున్న ననర్ఘ్య కుసుమోత్తమ మేరికినైన నిచ్చెనే? |
65 |
| ఉ. |
చక్కనిదాన నంచు, నెలజవ్వని నంచు, జగంబులోనఁ బే రెక్కినదాన నంచు, బతి యెంతయు నా కనురక్తుఁడంచుఁ దా నిక్కుచు విఱ్ఱవీఁగుచు గణింపదు కాంతల సత్య; యింతకున్ స్రుక్కక యున్నె! నీ మహిమ సూచిన బోటులు విన్నవించినన్ |
66 |
| క. |
ధరియించిన మొదలొక వ త్సర మాత్రము తావకీన ధమ్మిల్లములో నిరవుకొని మగుడ నివ్విరి తరుణీ! యల పారిజాత తరువున కరుగున్ |
67 |
| తే. |
అనుచు నారదుఁ డాడిన యట్టి పలుకు లచటి వృత్తాంత మంతయు నరసి పోయి వేఱు వేఱన సఖులు దేవేరులకును విన్నవించిన వారును జిన్నవోయి |
68 |
| ఉ. |
అందరలోనఁ బెద్ద, మహిమాన్విత రుక్మిణి; గానఁ బూవు గో విందుఁడు దానికిచ్చెఁ దగవేయని లక్షణ యోర్చె; సైఁచెఁ గా ళింది; శమించె భద్ర; యవులెమ్మని యూరడిలెన్ సుదంత; లోఁ గుందుట మానె జాంబవతి; కోప మడంచెను మిత్రవిందయున్ |
69 |
| తే. |
వారిలోపల సౌందర్యవతియు మాన వతియు మహనీయ సౌభాగ్యవతియు నైన సత్య యంతట నేమొకో శౌరి కడకుఁ బోయి రాదయ్యెఁ జెలి, ప్రొద్దువోయె ననుచు |
70 |
| మ. |
తన శృంగార వనంబులో నగరిపొంతం, జక్కఁగా దిద్ది తీ ర్చిన పూఁదేనియ యేటి కాలువ దరిం, జెంగల్వ పుప్పొళ్ళు నిం చిన చంద్రోపల వేదిపై సరస గోష్ఠిన్ బోటియుందాను న వ్వనజాతాయత నేత్ర శౌరిగుణముల్ వాక్రుచ్చి వర్ణించుచున్ |
71 |
| చ. |
అలికుల రావముల్ కిసలయాకుల కోకిల కాకు కాకలీ కలకల నాదముల్ సెలఁగఁ, గమ్మని తమ్మికొలంకు తెమ్మెరల్ వొలయఁగఁ, దొంటి చందమున బుద్ధికి నేమియు నింపు గామికిం గలఁగుచు సత్యభామ చెలిఁ గన్గొని యించుక సంశయించుచున్ |
72 |
| చ. |
అకట! యిదేమియో యెఱుఁగ నయ్యెడుఁ దొయ్యలి! దక్షిణాంస చూ చుక నయన ప్రకంపగుణ సూచన లేమియు వల్లగావు; సా రెకు మది జాలి వొంది యొక రీతిఁ దలంకెడుఁ; బ్రాణనాయకుం డొక చపలాక్షిఁ గూడి నను నొల్లని చెయ్దము లేమి చేసెనో! |
73 |
| క. |
అని సత్యభామ తనవిధ మనుఁగుం దొయ్యలికిఁ జెప్పు నవసరమునఁ జ య్యన వచ్చి యొక్క నెచ్చెలి కనుఁగవ నెఱసంజ వొడమఁగా నిట్లనియెన్ |
74 |