| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| నారదుఁడు పారిజాత మహిమను వివరించుట | ||
| సీ. |
జలజాక్షి! యిది పారిజాత ప్రసూనంబు - నరులకు ధరియింప నరిది సూవె! పౌలోమి పార్వతి పద్మ పద్మజురాణి - యును శిరంబునఁ దాల్తు రనుదినంబు, హరి బహిః ప్రాణంబ వగుట నేఁ డెఱుఁగంగ - వచ్చె, నీకిపు డిది యిచ్చెఁ గాన, వెలఁదులు పదియాఱు వేవురలో నెన్న - సరిలేరు సౌభాగ్య గరిమ నీకు, |
|
| తే. |
నీవు దాల్చిన కతన నీపూవు నేఁడు భాగ్యము వహించె నుచితోపయోగ్య లీల నీప్సితార్థంబు లొడఁ గూర్చు నిది లతాంగి! దీని మహిమంబు చెప్పెదఁ దెలియ వినుము |
58 |
| క. |
పరిమళము సెడదు, వాడదు, పరువము తప్పదు, పరాగ భర భరితంబై నిరతము జగదేక మనో హర మగు నీ కుసుమరాజ మంబుజ వదనా! |
59 |
| మ. |
అళి నీలాలక! నీవు నీపతి రహస్య క్రీడ వర్తించు వే ళ లతాంతాయుధ సంగరంబునకు నుల్లాసంబు గల్పించు ను జ్జ్వల దీపాంకురమై, రతి శ్రమ తనూ సంజాత ధారాళ ఘ ర్మ లవంబు ల్దొలఁగింపఁగా సురటియై రంజిల్లు, నిచ్ఛాగతిన్ |
60 |
| చ. |
అడిగిన యంతలోన సరసాన్నములన్ సమకూర్చు నాఁకటన్ బడలికఁ జెందనీక; యశుభంబులడంచు; జగత్త్రయంబునం బడయఁగరాని సర్వగుణ భవ్యము సుమ్మిది; దీనిఁ దాల్చి యి ప్పడఁతులలోఁ గనుంగొను మపార మహా మహిమానుభావముల్ |
61 |
| చ. |
కువలయ పత్ర నేత్రి! నెఱిగొప్పున నీ కుసుమంబు దాల్చుటన్ సవతులు వచ్చి నీచరణ సారస యుగ్మము నాశ్రయింపగా, ధవుఁ డఱలేని కూర్మి జవదాఁటక నీపలు కాదరింపఁగా, నవిరళ భోగభాగ్య మహిమాన్వితవై విహరింతు గావుతన్ |
62 |
| క. |
నెలకొని వేసవిఁ జలువయుఁ, జలివేళల నుష్ణగుణము, సముచిత భంగిన్ గలిగించు నీలతాంతము, కొలఁదులు చెప్పంగ నిచ్చ క్రొత్తలు సుమ్మీ! |
63 |
| క. |
అలరుంబోఁడుల లోపల నలరుం బోఁడుములు నీకు నగ్గల మగుచున్, దలపూవాడక యుండుము తలపూవు ధరించి వికచ తామరసాక్షీ! |
64 |