| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | ప్రథమాశ్వాసము |
| శ్రీకృష్ణుని సంసార విభూతి | ||
| చ. |
హరి నరకాసురుం గెలిచి యద్దనుజేంద్రుని యింట నున్న య చ్చరల కొలంబు వారి, నెఱజవ్వనముం బొలివోని వారిఁ, ద న్వరునిఁగఁ గోరు వారి, లలనామణులం బదియాఱు వేవురం బరిణయ మయ్యె నారదుని పంపున సౌఖ్య రసైక లోలుఁడై. |
37 |
| తే. |
మఱియు రుక్మిణి, సత్య, జాంబవతి, మిత్ర వింద, భద్ర, సుదంత, కాళింది, లక్ష ణ యనఁగా మున్న కల రబ్జనాభునకును మహిషు లెనమండ్రు సమతాభిమానవతులు. |
38 |
| ఉ. |
ఆ రమణీ లలామముల నందఱఁ గూడి యదూద్వహుండు త ద్ద్వారవతీ పురోపవన వాటికలం, గృతకాద్రి సీమల న్వారిధి తీర కుంజ సదనంబులఁ, గేళి తరంగిణీ తటీ కైరవిణీ సహాయ మణికల్పిత సౌధముల న్వసించుచున్. |
39 |
| శా. |
ఏయేవేళల నేసరోజముఖి యేయేలీలలం గోరుఁ దా నాయావేళల నాసరోజముఖి నాయాలీలలం దేల్చి, యే చాయం జూచినఁ దానయై మెలఁగుచున్ సౌఖ్యాబ్ధి నోలాడు భో గాయత్తుండయి పెక్కు రూపముల మాయా కల్పనా చాతురిన్. |
40 |
| క. |
హరి యిట్లు సతుల నందఱ సరిగాఁ జూచియును, భోజ జనపాల సుతం దరుణీమణి సాత్రాజితి నిరువుర మన్నించి మిగుల నిచ్చుం జనవుల్. |
41 |
| చ. |
కులమును రూపము న్మగని కూరిమియుం గలదాన నంచునీ వల నల రుక్మిణీ రమణి వాసిఁ జెలంగఁగ, సత్యభామయుం గులమును రూపము న్మగని కూరిమియుం గలదాన నంచునా వలఁ బచరింపఁగా, రవరవ ల్వొడమె న్మది వారి కెంతయున్ |
42 |