| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | అవతారిక |
| కృతిపతి వంశ (కృష్ణ) ప్రశస్తి | ||
| ఉ. |
ఆ యమృతాంశునం దుదయమయ్యె బుధుం, డతఁ డార్తరక్షణో పాయుఁ బురూరవుంగనియె, నాతని కాయువు పుత్త్రుఁ డయ్యె, న య్యాయతకీర్తికి న్నహుషుఁ డాత్మజుఁడై యిలయేలెఁ, దత్సుతుం డై యలరె న్యయాతి, యతఁడాహవదోహలుగాంచెఁ దుర్వసు\న్. |
7 |
| క. |
ఉర్వీశమౌళి యగు నా తుర్వసు వంశంబునందు దుష్టారి భుజా దుర్వార గర్వ రేఖా నిర్వాపకుఁ డీశ్వరాఖ్య నృపతి జనించె\న్. |
8 |
| ఉ. |
తామసవృత్తి లేదు, సతతంబు నుగ్రుఁడు గాఁడు, పౌరుషం బేమియు వెల్తి గాదు, తన కెందును బైమఱి రాజు లేఁడు, సం గ్రామములోన నొక్క నరుగాసికి వాసి దొఱంగఁ, డీశ్వర క్ష్మా మహిళా మనోహరుని సాటియె యీశ్వరుఁ డెన్ని భంగుల\న్. |
9 |
| ఉ. |
రాజులనెత్తుటం బరశురాముఁడు వ్రంతలు సేసె రెండుమూఁ డీ జగతి\న్, గణింప నది యెంతటి విస్మయ! మబ్జినీ సుహృ త్తేజుఁడు కందుకూరి కడఁ దిమ్మయ యీశ్వరుచే జనించె ఘో రాజి బెడందకోట యవనాశ్విక రక్త నదీ సహస్రముల్. |
10 |
| క. |
శాశ్వత విజయుఁడు తిమ్మయ యీశ్వర నృపతికిని గౌరి కెన యగు తత్ప్రా ణేశ్వరి లక్కాంబికకు న్విశ్వాతిగ యశుఁడు సరసవిభుఁ డుదయించె. |
11 |
| సీ. |
ఎవ్వాని విజయంబు లెఱిఁగించు శాసన - స్తంభంబుఁ లాశాంత శైల వితతు లెవ్వాని యరిఁగాపు లేపారు కాళింగ - యవనాది వివిధ దేశాధినాథు లెవ్వాని నిత్య దానైక విలాసంబు - లారూఢతర తులాపూరుషంబు లెవ్వాని చిరకీర్తు లింద్రలోకాంగనా - భోగినీ గీతికాభోగ పదము |
|
| తే. |
వాఁడు వొగడొందు సర్వసర్వంసహాధి దేవతా ముఖదర్పణ ద్విజయనగర భద్ర సింహాసనస్థుఁ డున్నిద్ర తేజుఁ డీశ్వరాధిపు నరస భూమీశ్వరుండు. |
12 |
| సీ. |
కుంతలేశ్వరుఁడు సిక్కు వడంగ విద్యాపు - రంబు గై కొని నిజప్రౌఢి నెఱపెఁ బారసీకునకు దుర్భర మానవత్వంబుఁ - దొలఁగించె మానవదుర్గ సీమఁ జోళ వల్లభునకు సురవధూ మధురాధ - రము లిచ్చి మధురాపురంబుఁ గొనియె శ్రీరంగ పట్టణసీమ ఖడ్గనటీ వి - నోదంబు యావనేంద్రునకుఁ జూపె |
|
| తే. |
నతఁడు నుతికెక్కె రామసేత్వంతరాళ కలిత షోడశదాన విఖ్యాత యశుఁడు, మండలీకర మేఘ మార్తాండ బిరుదుఁ డీశ్వరాధిపు నరస పృథ్వీశ్వరుండు. |
13 |
| క. |
ఆ నరస మహీమహిళా జానికిఁ గులసతులు పుణ్యచరితలు తిప్పాం బా నాగాంబిక లిరువురు దానవ దమనునకు రమయు ధరయును బోలె\న్. |
14 |
| క. |
వారలలోఁ దిప్పాంబ కు మారుఁడు పరిపంథి కంధి మంథాచలమై వీరనరసింహరాయుఁడు వారాశి పరీశ భూమి వలయం బేలె\న్. |
15 |