| శతకములు | వేంకటేశ శతకము |
|
|
కల్పవృక్షమునెంచి కలివెచె ట్టెంచుట తర మెఱుంగనివారి తగవుగాక కావేరినది నెంచి కాలువ లెంచుట, పురుషుల యవివేక బుద్ధి గాక కౌస్తుభమణి నెంచి కాచంబు నెంచుట, జడుల యజ్ఞానంపుసరవిగాక మందరాచల మెంచి మఱితిప్ప లెంచుట, తప్పు దెల్పినవారి తగవుగాక |
|
|
ఘనుల నల్పుల నీరీతి గలయ గూర్చి, పలుకుచుండెడి వారల భ్రాంతిగాక కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
91 |
|
సత్సంప్రదాయుడై శాస్త్రపారీణుడై యాగమజ్ఞుం డైనయతడు గురుడు పరమదయాళుడై పాపనిర్ముక్తుడై, యాచారవంతు డౌనతడు గురుడు భూరిసుజ్ఞానియై బోధింపశక్తుడై, యతిశాంత చిత్తుడౌనతడు గురుడు కడు దపోనిష్ఠుడై ఘనమంత్రసిద్ధుడై, యాధ్యాత్మవేత్తయౌనతడు గురుడు |
|
|
తెలిసి యిటువంటిగురు జేరివెలయవలయు, సుజనులగువార లీడేఱ జూచిరేని కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
92 |
|
అర్థంబు దేహంబు నాచార్యుసొమ్మని, యా నాజ్ఞ దప్పక యాస్థ గలిగి తగిన శుశ్రూషకు దను వలవడజేసి, మతి గల్గి యేప్రొద్దు మఱపు విడిచి యుపదేశ మిచ్చి నట్లూహలం దలపోసి, యాహారనిద్రల కాసపడక వేసర కాత్మలో విశ్వాస మెడలక, హరిభక్తి గురుభక్తినధికు డగుచు |
|
|
నున్నయాతండె శిష్యుడి ట్లుర్విమీద, బరగుశుభమూర్తి యతిలోకపావనుండు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
93 |
|
దైవంబు గురుఁడును ధరఁ గల రని నమ్మి, తలపోసి మనుట యుత్తమమతంబు కలగు వేదము ముక్తిగలదు పుణ్యుల కని, మఱి భక్తిసేయుట మంచిమతము యజ్ఞాదికర్మంబు లఖిలప్రపంచంబు, సత్యంబు లనుట నిశ్చలమతంబు హరి మాయచేఁ జిక్కఁ డాతఁడే సర్వజ్ఞుఁ, డని భజియించుట యాదిమతము |
|
|
చదివి తెలిసిన పెద్దలసమ్ముఖమున, నెఱుఁగువారికి సఫల మౌ నీమతంబు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
94 |
|
ఉచితకార్యంబు రా జొకమఱి వినకున్న, మఱియుఁ జెప్ప గఁదగు మాన్యునకును దగ వెంచ కేలిక తన్నుఁ గోపించిన, నెగ్గు పట్టఁగరాదు హితున కెపుడు తనవిభుం డొకకానిపని తప్పి చేసిన, నమరఁ జేయఁగవలె నాప్తునకును మఱచినయధిపతి మనసులోపనులెల్ల, నెచ్చరించఁగవలె నిష్టునకును |
|
|
సచివునకుఁ బోదు పతి కెన్నిచందములను, హితవు గోరక నీతి ననేకగతులఁ గలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
95 |
|
ఆఁకలివహి మౌని యై యుండనిచ్చునే, పిండియైనను దినిపించుఁ గాక శీతోష్ణములు కడుసిగ్గుతో నిల్పునే, ప్రేమఁ గంబళముఁ గప్పించుఁగాక సరసకామము బ్రహ్మచర్యంబు నిల్పునే, పొంచి యొక్కతెఁ దగిలించుఁగాక కోరి యాసలు మంచిగుణములు నేర్పునే, పాపచర్యకు నొడఁబఱుచుగాక |
|
|
యెంతవారికిఁ బంతంబు లెట్లు జరగు, మీకు శరణని బ్రతుకుటే మిగుల నేర్పు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
96 |
|
కుశలుఁడై ప్రతిమఁ జేకొని తీర్పనగుఁ గాని, తనరూపు చక్క దిద్దంగరాదు మగువల వలపింప మందు గలదు గాని, మఱి దుర్గుణము మాన్ప మందు లేదు క్రొత్తగా నొకజన్మ మెత్తఁగ దగుఁగాని, మహిఁ బూర్వదేహంబు మగిడిరాదు కొలుచులు కృషిసేసి కూర్పఁబన్పడుఁగాని, భుజియించినవి గాదెఁ బోయరాదు |
|
|
దైవకృత్యంబు లివియేల తప్పనిచ్చుఁ నుఱకలోకులు భ్రాంతి సేయుదురుగాక కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
97 |
|
సరకులు గొనవచ్చు సాధించి తేవచ్చుఁ, గోరి సుజ్ఞానంబు గొనఁగరాదు తపము సేయఁగవచ్చు ధనముఁ జేకొనవచ్చు, భువి నగ్రజన్ముఁడై పుట్టరాదు కాశికిఁ బోవచ్చుఁ గ్రమ్మఱి రావచ్చుఁ, దెలిసి సుషుమ్న భేదింపరాదు మౌని గావచ్చు నేమములు చూపఁగవచ్చుఁ, బాఱెడుమనసు నిల్పంగరాదు |
|
|
నేర్పు లేగతి నెవ్వరు నేర్చిరైన, సరవితో బ్రహ్మవేత్తల సరికి రారు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
98 |
|
కాంచనపాదము ల్గజ్జెలు నందియ, ల్గడు మించుమొలఁ జంద్రకావిదట్టి పీతాంబరముమీఁదఁ బిల్లలమొలనూలు, బిగియించి కట్టిన పెనుకటారి వరదానకరము నుజ్జ్వలకటిహస్తంబు, పటుశంఖచక్రోరుబాహుయుగము నొఱపైననాభియు నుదరబంధ మురంబు, నలమేలుమంగతో హారములును |
|
|
శిరసుమకుటంబు తిరుమణి చిత్రమకర, కుండలమ్ములుఁ గలమిమ్ముఁ గోరితలఁతు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
99 |
|
మాధవ గోవింద మధుసూదనాచ్యుత, వామన ప్రద్యుమ్న వాసుదేవ కృష్ణ దామోదర కేశవ శ్రీధర, హరి విష్ణు పురుషోత్తమా నిరుద్ధ సంకర్ష ణాధోక్షజ త్రివిక్రమ పద్మ, నాభ జనార్దన నారసింహ శౌరి హృషీకేశ నారాయ ణోపేంద్ర, తాలాంకముఖనామ తాళ్ళపాక |
|
|
యన్నయాచార్యసుత తిమ్మయాహ్వయుండఁ, బ్రణుతిఁ జేసితి రహిఁ గొమ్ము పద్యశతము కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
100 |