| శతకములు | వేంకటేశ శతకము |
|
|
మాంధాతకొనిపోఁడు మహిచేరెడైనను, గొనిపోఁడు రారాజు కొలుచుగొన్ని నరుఁడు గొంపోవఁడు నవరత్న మొకటైన, శిబి కొనిపోఁడొక్క చిన్నమైనఁ గొనిపోఁడు ఖచరుండు గోవునొక్కటియైన, వస్త్రంబుగొనుచుఁ బోవఁడు యయాతి గుఱ్ఱమొక్కటినైనఁ గొనిపోఁడు నహుషుండు, గజముగొంపోవఁ డొక్కటిని సగరుఁ |
|
|
డింక నేరికి సతములౌ నేల సిరులు, తా నొనర్చిన ధర్మంబె దక్కుఁ గాక కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
41 |
|
సుఖదుఃఖములఁ నుబ్బు స్రుక్కులఁ బొరయక, వనధికైవడినుండు వాఁడు యోగి పంచేద్రియముల పాల్పడి చలియింపక, గగనంబువలెనుండు ఘనుఁడు యోగి యజ్ఞాన రహితుఁ డై యంధకారముఁ బాసి, యాదిత్యువలెనుండు నతఁడు యోగి పరిపూర్ణుఁ డై యుండి భావింపఁ జోద్యమై, పవనునివలెనుండు బలుఁడు యోగి |
|
|
బహువిధంబుల నీపాద భక్తిగలిగి, నెదరకుండిన యతఁడెపో సిద్ధ యోగి కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
42 |
|
అత్యలసత యెందు నంటనీయఁడు శీలి, గుణములన్నిటిఁ బాపు గోపబుద్ధి పిసిడితనం బది పిమ్మటఁ దిట్టించు, గడు నహంకారంబు కష్టపఱుచు ముదిమియెవ్వరికైన ముందుదోపగఁ నీదు, బాల్య ముద్దండతఁ బ్రబలజేయుఁ ధనకాంక్ష మిక్కిలిదయతోడఁ బెడఁబాపుఁ, జలము కార్యవిచారసరణిఁ జెఱుచు |
|
|
ఘనులుదలపోసి యిటువంటి గతులుమాని, బ్రతుకుదురు దాము సన్మార్గ పదమునందు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
43 |
|
తగిలి తాఁ జేసినధర్మంబు తలగాఁచు, దైవంబు గొలిచినఁ దన్నుమనుచు జితకామునితపంబు శీఘ్రమె ఫలియించు, సత్యమెక్కడనైన జయముఁ జూపు బ్రియవాక్యమందఱఁ బెనచిచుట్టము సేయు, మరితన్నుఁ బొగడించు మంచితనము కడిగండమణఁగించుఁ గలితాన్నదానంబు, జపము పాతకముల సడలఁ జేయు |
|
|
నెఱిఁగి నడచిన సిద్ధించునిహముఁ బరము, సులభమిన్నింట నినుగొల్చు సుజనులకును కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
44 |
|
బహుపుణ్యుఁ డగువానిబ్రదుకది మంచిది, మనసు గెల్చినవాని మహిమమేలు జ్ఞానంబు గలవాని జన్మము సఫలంబు, తప్పుఁజెప్పని వాని తగవు లెస్స సమబుద్ధి గలవాని చరితంబు సమ్మతి, యుపమరి యగువాని యునికి బాగు వావి గల్గినవాని వర్తన శుభమిచ్చు, మే లెఱింగిన మెచ్చు మెచ్చు |
|
|
భువికినిటువంటి మనుజుండు భూషణంబు, గలుగునీకృప నీరీతి ఘనులకెపుడు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
45 |
|
చాడికాఁడగువాఁడు నటలెల్లబోధించు, నందున కొరులపై నలుగవలదు పాతకుండగువాఁడు పరులను దూషించు, వెఱ్ఱియై తానవి వినఁగ వలదు వెడదొంగయగువాఁడు విత్తంబు లీవచ్చు, బ్రమసి యాసల నివి పట్టఁ దగదు మాయావియగువాఁడు మందు మంత్రము నేర్పు, మఱచి తప్పియు నవి మరగవలదు |
|
|
కర్తయగువాఁడు కపటుల గతులు దెలిసి, యేమఱక రాజ్యమెప్పుడు నేలవలయు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
46 |
|
మోపరియెంతైన మోవ వేసారఁడు, సొరది నాదాయమే చూచుఁ గాని మహిగృహస్థుం డలమటలకు నోడఁడు, సొలవ కేపనికైనఁ జొచ్చుఁ గాని కాలరినరుఁడు సుఖంబులఁ గోరఁడు, పరువుచే మే నలవఱుచుఁ గాని యటమటీఁ డెప్పుడు నల్పులఁ దెగితీయు, నుసరాన దిద్దక జుణుఁగుఁ గాని |
|
|
కడఁగి వీరల కీయోజఁ గర్మవశము, కర్మములు నిన్నుఁ గొలిచినఁ గాని తెగవు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
47 |
|
ఒకఁడు దాఁచినయర్థ మొక్కండు భుజియించు, నొకసతిమగఁడు వేఱొకతె కగును గాయంబు నిలువదు కడుబ్రహ్మకైనను, జాయగొన్నాళ్ళది జవ్వనంబు చదివినచదువులు సరి శరీరముతోనె, తలఁపులు మఱచినందనుక నుండుఁ గులముదారిద్ర్యంబు గొంచెంబుగాఁ జేయు, వలపు వేసట యైన వదలివిఱుగు |
|
|
నేలబ్రమయంగ నెవ్వరికేది నిజము చెలఁగి, మిముఁ గొల్చు వారిది చెడనిపదవి కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
48 |
|
శత్రులమాటలు సతమని నమ్మక, కాంతలకును గుట్టుఁ గాననీక సమయమ్ముగాండ్రకుఁ జనవు చెల్లింపక, తోడుఁబోతుల నిల్లు ద్రొక్కనీక ఘనతరద్రోహిఁ గొల్వునకు రానీయక, మొదలువంచకునకు మొగముగాక పిఱికిఁ బోట్లాటకుఁ బెనపెట్టి కొనితేక, దొరయని హీనునితోడ నగక |
|
|
వదల కెచ్చరి యుండెడువాఁడు రాజు, జగతి వర్ధిల్లునట్టి విచారపరుఁడు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
49 |
|
మానంబె యెక్కుడు మఱియుఁ బ్రాణముకంటెఁ, దనకీర్తియెక్కుడు ధనముకంటె సాహసం బెక్కుడు సాముసేయుటకంటెఁ, బంత మెక్కుడు ప్రతాపంబుకంటె నిలలో నుదారత్వ మెక్కుడు సిరికంటె, బీర మెక్కుడు తనబిరుదు కంటె సమరంబె యెక్కుడు సంధిమాటలకంటె, ధైర్య మెక్కుడు దొరతనముకంటె |
|
|
వెలయనిటువంటి గుణముల వీరవరుఁడు, కలఁడు వేయింటి కొక్కడు కడమలేఁడు కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ. |
50 |