| శతకములు | సంపఁగిమన్న శతకము |
|
| క. |
సర్వావస్థల నడఁచియు సర్వావస్థల నెఱింగి సర్వసముం డై సర్వముఁ దా నని తెలిసిన సర్వోత్తముఁ డాతఁ డన్న సంపఁగిమన్నా! |
111 |
| క. |
తనవారి నెదుటివారిని దనవారిఁగఁ జూడనేర్చుధన్యులు చాలన్ ఘనకీర్తులచే మింతురు సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా! |
112 |
| క. |
నిత్యానిత్యవివేకము సత్యనుపమశీలుఁ డెఱుఁగు నాతఁడు సుజన స్తుత్యుఁడు జీవన్ముక్తుఁడు సత్యం బిది వినఁగదన్న? సంపఁగిమన్నా! |
113 |
| క. |
కూడదు గతి సంసారికి బూడిదలో గచ్చకాయ పొరలినభంగి\న్ వాఁడును వీఁడును దానై జాడ యెఱిఁగి నడువ రన్న! సంపఁగిమన్నా! |
114 |
| క. |
పాపపువాసనవిషయము కాపాడుచురాగ నరుఁడు గడఁవగఁగలఁడా? యేపట్టున గుహ్యోదర చాపల్యము మానకున్న సంపఁగిమన్నా! |
115 |
| క. |
సాధనచతుష్టయంబున సాధారణలీలఁ దనరి సర్వేంద్రియముల్ శోధించి నిజసమాధిని సాధించినముక్తుఁ డన్న సంపఁగిమన్నా! |
116 |
| క. |
ఉద్యోగంబునఁ బురుషుఁడు సద్యోగముఁ జలుపవలయు సవిశేషముగా విద్యానిధి యగునతఁడే సద్యోముక్తుఁడు గదన్న సంపఁగిమన్నా! |
117 |
| క. |
బోధించినగురువులచే సాధింపను నేర్పు గలిగి సన్నుతు లగుచున్ శ్రీధరుఁ గలియుదు రపుడే సాధకమున బుధులు సుమ్ము సంపఁగిమన్నా! |
118 |
| క. |
ఆతురుఁ డై తను నడిగిన యాతనికిం దెలుపవలయు నన్యులు వింటే నా తలవంపులును సుహృ జ్జాతులకే యోగ మెన్న సంపఁగిమన్నా! |
119 |
| క. |
మందేహామందౌషధ మెందు న్సరిలేని దైవ మిలలో సత్యా నందంబు జయమునందు త మందఱము సుఖంబు లంది యలరుద మెలమిన్. |
120 |