దశమాంకము.
(ప్రదేశము: రాజవీధి.)
(ప్రవేశము: పురుషోత్తమరావుగారు, బసవరాజు, భ్రమరాంబ, కమల.) |
| పురు:- |
| సీ. |
కొసరి కట్నము లందు-కొంటయే గౌరవ
మని తలపోసెడి - యజ్ఞులార!
వచ్చి ముద్దుగఁ బిల్ల - నిచ్చెద మనఁ గట్న
ములకు బేరములాడు - మూర్ఖులార!
అబ్బాయి పెండ్లితో - నప్పు సప్పులు తీర్చి
నిలువ సేయఁగ జూచు - నీచులార!
ముడుపులు గొనితెచ్చి - ముంగల నిడుదాఁక
పల్లకి యెత్తని - పశువులార!
ఏమి యన్యాయ మిది! పూర్వ - మెన్నఁడేని
వరుల నిటు విక్రయించిన - వారు గలరె?
పూజ్యతరమైన మన పుణ్య-భూమియందుఁ
గటకటా! నరమాంస వి-క్రయము తగునె! |
|
| బస:- |
| సీ. |
కట్నాలకై పుస్త-కములు చేఁ గొని, పాఠ
శాలల కేగెడు - చవటలార!
పిలిచి కాళ్ళు కడిగి - పిల్ల నిచ్చిన వారి
కొంప లమ్మించెడి - కుమతులార!
అల్క పాన్పుల నెక్కి - యవి యివి కావలె
నని శివమాడెడి - యధములార!
ఎంత పెట్టినఁ దిని - యెప్పటి కప్పుడు
నిష్ఠురోక్తులె పల్కు - నీచులార!
కట్న మనుపేర నొక చిల్లి గవ్వఁ గొనిన
భార్య కమ్ముడువోయిన బంటు లగుచు
జన్మదాస్యంబు సలుపుఁడు సలుపకున్న
నత్తవారింటఁ గుక్కలై యవతరింత్రు. |
|
| భ్రమ:- |
| సీ. |
మగబిడ్డ పుట్టిన మఱునాఁడె మొదలు శు
ల్కమువలె లెక్కించు రాకాసులార!
మర్యాదకై చూచు - మరల గట్నాలకై
రేపవల్ వేధించు ఱేచులార!
అయిదు ప్రొద్దుల రాణు లై, చీటికిని మాటి
కలిగి కూర్చుండు గ య్యాళులార!
లాంఛనంబుల పేర లక్ష చెప్పుచు నిల్లు
గుల్ల సేయు దరిద్ర గొట్టులార!
ఆఁడుపుట్టువు పుట్టరే? ఆఁడువారి
నిట్టు లవమానపఱచుట కించుకేని
సిగ్గు పడకుండఁ దగునె! ఛీ, ఛీ, ధనంబె
పావనంబుగఁ జూచుట పరువె మురువె. |
|
| కమల:- |
| సీ. |
వెల పుచ్చుకొని వచ్చు వెడఁగులచేఁ బుస్తె
కట్టించుకొనియెడు కన్నెలార!
కట్నాల మగలతోఁ గలసి పల్లకిలోనఁ
గూరుచుండెడు పెండ్లికూతులార!
కోరిన వెల యిచ్చి కొని తెచ్చుకొన్న దా
సులకు దాస్యము సేయు సుదతులార!
మీ వివాహములకై మీవారు ఋణముల
పా లౌట గని యోర్చు పడఁతులార!
ఎంచిచూడఁగ స్త్రీజాతి కింతకన్న
గౌరవము లేని పని యొండు కలదె? చాలుఁ
జాలు నిఁక నైన బౌరుష జ్ఞానములను
గలిగి మెలఁగుడు సత్కీర్తిఁ గనుఁడు వినుఁడు. |
|
| ఒక బ్రాహ్మణుడు:- |
(ప్రవేశించి) అయ్యా! కట్నపు సొమ్ముకంటె కాలకూట విషము మేలు. దానివల్లనే నాకీ దరిద్రయోగము పట్టినది.
| సీ. |
తగిన బేరము వచ్చు దాఁక నబ్బాయిని
పాఠశాలకు తన్ని పంపినాను
పోటీలపై వెల పొసఁగించి నాలుగు
సంచుల వఱకు కక్కించినాను
మాటిమాటికిని బోట్లాటకు సిద్ధమై
లాంఛనాలని వేయి లాగినాను
అద్దెల కీవచ్చునని యున్న సొమ్మెల్ల
పెట్టి పెంకుటియిల్లు కట్టినాను
ఇల్లు కాలిపోయె నింటిది చనిపోయె
పిల్లవాఁడు వెఱ్ఱి పీనుఁ గాయె
కోడ లొకనిఁ దగులుకొని లేచియే పోయె
నాకు ముష్టిచెంబె లోక మాయె. |
(నిష్క్రమించును.) |
| ఒక అమ్మ:- |
(ప్రవేశించి) అయ్యా! నా సొద కొం తాలకించండి.
| సీ. |
వొడ్డికి వొడ్డీల వొంతున పెంచేసి
మంచి మాన్నాలు గడించినాను
పది పుట్ల బూఁవితో పండంటి బిడ్డ నో
యెదవ కుక్కలకొడు క్కిచ్చినాను
అలక పానుపుకాడ అవలైన శంగలి
బీ డాడి కడుపునఁ పెట్టినాను
అన్ని తిన్న యెదవ అమ్మాయి నొదిలేసి
యింకోర్తి పక్కలో యిఁవిడినాఁడు
నాకు కూడు లేదు నాబిడ్డ కిప్పుడు
కూడు, గుడ్డ, కొంప కూడ లేవు
అయిన వెల్ల సేర్చి అల్లుడోళ్ళకు పెట్టు
కమ్మ సచ్చినోళ్ళ కర్మ మింతె. |
(నిష్క్రమించును.) |
| ఒక సెట్టి:- |
(ప్రవేశించి) నా కత గూడా సెబుతాను నవ్వకండేం.
| సీ. |
పెసలలో, సోళ్లలో, బెడ్డలు కలిపివేసి
పెజల నెత్తులు గొట్టి పెంచినాను
మేనల్లు డింట్లోను మిడుకుతుంటే పిల్ల
నింకోరి సిన్నోడి కిచ్చినాను
గళ్లున పదివేలు పళ్ళెఁవులో పోసి
సకల మరేదలూ జరిపినాను
గుంటూరు మేళఁవూ గూడూరి సుందరి
పీకపాటా పిలి పించినాను
అయిదు రోజులు జుట్టిప్పు కాడినాను
తెలక రెండు దివాలాలు తీసినాను
యెల్లి యిరసాలుమెంటు కోర్టెక్కినాను
వచ్చి పెసరట్ల జంగిడి పట్టినాను. |
(నిష్క్రమించును.) |
| లింగ:- |
(చటాలున ప్రవేశించి) బావగారు! చివరకు, పందిని బొడిచి బం టని పించుకొన్నారు! మీ ప్రబోధము వినుచుఁ, బ్రచ్ఛన్నముగా నేనును మీవెనుకనే వచ్చుచున్నాను. ప్రజలలో మిమ్మును, మీ కొమార్తెను, మీ యల్లునిఁ బ్రశంసింపని వారును, నన్నును నా భాగ్యమును బరిహసింపని వారును లేరు.
| సీ. |
కట్టక ముట్టక - కడుపున కేనియుఁ
గుడువక యొక కొంత - కూర్చినాను!
వడ్డికి వడ్డీల - వంతునఁ బొడిగించి
పెనకువపైఁ గొంత - పెంచినాను!
పద్దులు పత్రముల్ - దిద్ది, దీపము లార్పి
వంచించి కొంత గ-డించినాను!
కా యమ్మి కసరమ్మి - కడు గమ్మి, వో ట్లమ్మి
చిల్లరగాఁ గొంత - చేర్చినాను!
అతిథి, చుట్టము, గురువును, - యాచకుండు,
దేవుఁ డను మాట లేక వ-ర్తించినాను!
కడకుఁ గట్నంబునకు గడ్డి - కఱచినాను!
కలఁడె నావంటి ఖలుఁడు లో-కంబునందు? |
|
| పురు:- |
బావగారు! గతజల సేతుబంధనమువల్లఁ గార్య మేమున్నది? ప్రస్తుతము తాము దయచేసిన పనియేమో సెలవిండు? |
| లింగ:- |
ఇఁక నాకేమి పని యున్నది? అబ్బాయినిఁ, గోడలిని యింటికిఁ దోడుకొనిపోయి యాస్తి యంతయు వారివశము చేసి, హాయిగా మీతో హరినామస్మరణ చేసికొనుచుఁ గూర్చుండవలె నని వచ్చినాను. |
| పురు:- |
ఈ మాటలు మీరు మనస్ఫూర్తిగా నన్నవేనా? |
| లింగ:- |
సందియ మేమి? నాకోడలిని సమాధానపఱిచి, నాకుమారుని మరల నావానిఁగ జేసికొనకున్న, రేపు వాఁడు నాకుఁ గర్మ చేయుటకు గాని, వాఁడు చేసిన కర్మ నాకు ముట్టుటకుఁ గాని యవకాశ మెక్కడిది? అప్పు డాలోచనము లేక పాడుకట్నము కొఱ కన్నిపాట్లు పడినాను! ఆ పాపమును బరిహరించుకొను వఱకును నా యంతరాత్మకు శాంతి కలుగదు! |
| పురు:- |
అట్లయిన మీ యిష్టానుసారమే యగుఁగాక! మన మందఱమును గలిసి యొకసారి మంగళాశాసనము కావించి పోవుదము. |
| (పురు) |
సీ. |
ఆడుబిడ్డల వివా-హములకై తండ్రులు
పడు బాము లెల్లను - బాయుఁ గాక! |
| (లింగ) |
|
కట్నాల కోసము - గడ్డి కఱచువారి
కెల్ల నా పాట్లె ఘ-టిల్లుఁ గాక! |
| (బస) |
|
పణములు గొనువారు - భార్యల కేప్రొద్దు
నూడిగంబులు సేయు-చుంద్రు గాక! |
| (కమ) |
|
వెలమగల్ మెడల బు-స్తెలు కట్టు దౌర్భాగ్య
దశ కన్నియల కింకఁ - దప్పుఁ గాక! |
| |
| (భ్రమ) |
|
కట్నముల నందుకొంటయే - గౌరవ మను
వెడఁగుదన మాఁడువారిని - వీడుఁ గాక! |
| (అందఱు) |
|
ఉర్వి నన్నిటఁ గాళింది - కుద్ధియైన
వెలదులే యెప్పుడు బ్రభ-వింత్రు గాక! |
|
శ్రీమజ్జగద్గురు శంకరభగవత్పాద ప్రసాదాసాదిత మహాకవి బిరుదాంక
భారద్వాజ గోత్రార్ణవ శశాంక, కవిఘంటాకలాపహస్త
కాళ్ళకూర్యన్వయప్రశస్త బంగారురాజ కవిరాజతనూజ,
నారాయణరాయామాత్య బిడౌజ ప్రణీతంబగు
వరవిక్రయ ప్రకరణము
సంపూర్ణము.
|